'హరిహర వీరమల్లు' హైలైట్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ కు కేవలం 8 రోజులు మాత్రమే ఉంది.;

By :  S D R
Update: 2025-07-16 01:23 GMT

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘హరి హర వీరమల్లు’ రిలీజ్ కు కేవలం 8 రోజులు మాత్రమే ఉంది.జులై 24న పాన్ ఇండియా లెవెల్ లో సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం U/A సర్టిఫికెట్ పొందింది. సినిమా నిడివి మొత్తం 2 గంటలు 42 నిమిషాలు కాగా, టైటిల్ కార్డులు, క్రెడిట్స్ మినహాయిస్తే 2 గంటలు 32 నిమిషాల పాటు ఆడియన్స్ కు 'వీరమల్లు' విజువల్ ట్రీట్ అందిస్తాడని నమ్మకంగా చెబుతుంది టీమ్.

17వ శతాబ్దం నాటి చారిత్రక నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో వీరమల్లుగా పవన్ పాత్ర ఎంతో వైవిధ్యంగా రూపొందిందట. ఎన్టీఆర్‌, ఎంజీఆర్‌ లాంటి దిగ్గజ నట, నాయకుల నుండి ప్రేరణ తీసుకుని వీరమల్లు పాత్రను డిజైన్ చేసినట్లు దర్శకుడు జ్యోతికృష్ణ వెల్లడించారు.

ఈ చిత్రంలో ప్రత్యేకంగా చార్మినార్ సెట్ రూపొందించారు. నిజమైన చార్మినార్ సమీపంలో షూటింగ్ సాధ్యపడకపోవడంతో దానికి సమానమైన పెద్ద ఎత్తు మోడల్‌ను నిర్మించి షూట్ చేశారు. అలాగే హార్బర్ సెట్‌ను 17వ శతాబ్దానికి తగినట్లు సహజంగా తీర్చిదిద్దారని నిర్మాత ఏఎం రత్నం వెల్లడించారు.

ఈ సినిమాలో పవన్ కల్యాణ్ పాత్ర పరిచయం రెండు వేర్వేరు ప్రాంతాల్లో డిఫరెంట్ మానరిజంలతో జరగనుందని యూనిట్ వెల్లడించింది. ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్ పవన్ ఫ్యాన్స్‌కు నిజంగా ఫీస్ట్ అనేలా ఉండబోతున్నాయట. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందించిన నేపథ్య సంగీతం సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని చెబుతుంది చిత్రబృందం.

ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తీసుకొస్తున్నారు. జులై 24న విడుదలయ్యే 'హరి హర వీరమల్లు: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఫస్ట్ పార్ట్ కాగా, సెకండ్ పార్ట్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు అంటే దాదాపు 20 నిమిషాల మేరకు ఇప్పటికే షూట్ చేసినట్లు నాయిక నిధి అగర్వాల్ వెల్లడించింది. ఫస్ట్ పార్ట్ రిలీజ్ తర్వాత వెంటనే సీక్వెల్ షూటింగ్ ప్రారంభమవుతుందట.

ఈ సినిమాలో నిధి అర్వాల్, బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, సత్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రాగా.. త్వరలో రిలీజ్ ట్రైలర్ ను వదిలే అవకాశాలున్నాయట. జూలై 20న 'వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ లెవెల్ లో నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Tags:    

Similar News