సినీ కార్మికుల సమ్మె ముగిసింది

గడచిన 18 రోజులుగా టాలీవుడ్‌లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ముగిసింది. ఆగస్టు 4న ప్రారంభమైన ఈ సమ్మె కారణంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల చిత్రీకరణ పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే.;

By :  S D R
Update: 2025-08-21 17:10 GMT

గడచిన 18 రోజులుగా టాలీవుడ్‌లో కొనసాగుతున్న సినీ కార్మికుల సమ్మె ముగిసింది. ఆగస్టు 4న ప్రారంభమైన ఈ సమ్మె కారణంగా సినిమాలు, వెబ్‌సిరీస్‌ల చిత్రీకరణ పూర్తిగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. వేతనాలను 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సమ్మె చేపట్టగా, నిర్మాతలతో పలు రౌండ్ల చర్చలు జరిగినప్పటికీ అంగీకారం కుదరలేదు.

చివరికి ఎఫ్‌డీసీ చైర్మన్‌, ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుల చొరవతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు కార్మికశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చల్లో నిర్మాతలు – ఫెడరేషన్ మధ్య తుది ఒప్పందం కుదిరింది. ఈ చర్చలు విజయవంతం కావడంతో సమ్మెను విరమించుకోవాలని కార్మిక సంఘాలు ప్రకటించాయి. దీంతో రేపటి నుంచి షూటింగులు యథావిధిగా పునఃప్రారంభం కానున్నాయి.

సినీ కార్మికుల వేతనాల పెంపుపై 22.5 శాతం పెంపుకు ఇరు వర్గాలు అంగీకరించాయి. రూ.2 వేల లోపు వేతనాలు పొందే వారికి మొదటి ఏడాది 12.5%, రెండో ఏడాది 2.5%, మూడో ఏడాది 5% పెంపు.

రూ.2 వేల నుంచి రూ.5 వేల మధ్య వేతనాలు పొందే వారికి మొదటి ఏడాది 7.5%, రెండో, మూడో సంవత్సరాల్లో 5% చొప్పున పెంపు. అలాగే, పెద్ద సినిమాల కోసం ఆదివారాల్లో పనిచేసే కార్మికులకు ఒకటిన్నర రోజుల పేమెంట్ ఇవ్వాలని నిర్ణయించారు. అయితే చిన్న సినిమాల విషయంలో రెండో, నాలుగో ఆదివారాల్లో మాత్రమే ఒకటిన్నర కాల్‌షీట్ పేమెంట్ వర్తించనుంది. చిన్న సినిమాలకు ఇప్పటివరకు ఉన్నట్లే 15 శాతం డిస్కౌంట్ కొనసాగనుంది.

మిగిలిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనుంది. ఈ కమిటీలో ఇండస్ట్రీ, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. నెల రోజుల్లో ఈ కమిటీ అన్ని సమస్యలను పరిష్కరించే దిశగా చర్చలు జరపనుంది.

ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ – 'ఫెడరేషన్‌ సమస్యలను నిర్మాతలు, నిర్మాతల ఇబ్బందులను ఫెడరేషన్ అర్థం చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ జోక్యంతో సమస్య పరిష్కారమైంది' అని తెలిపారు. కార్మిక శాఖ అదనపు కమిషనర్ గంగాధర్ మాట్లాడుతూ – 'మూడు సంవత్సరాలకు గాను 22.5% వేతనాల పెంపుపై ఒప్పందం కుదిరింది. సమ్మెను కార్మికులు విరమించుకున్నారు. రేపటి నుంచి షూటింగులు పునఃప్రారంభం అవుతాయి' అని తెలిపారు.

Tags:    

Similar News