కార్మికులతో ముగిసిన చిరంజీవి భేటీ

టాలీవుడ్‌లో కొనసాగుతున్న కార్మికుల సమ్మెకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ముందుకు వచ్చారు. ఈరోజు ఆయన నివాసంలో ఫెడరేషన్ నాయకులతో సమావేశమై కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.;

By :  S D R
Update: 2025-08-18 14:02 GMT

టాలీవుడ్‌లో కొనసాగుతున్న కార్మికుల సమ్మెకు సంబంధించి మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ముందుకు వచ్చారు. ఈరోజు ఆయన నివాసంలో ఫెడరేషన్ నాయకులతో సమావేశమై కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సమావేశానికి ఫెడరేషన్‌కు చెందిన దాదాపు 70 మంది నాయకులు, ప్రతీ క్రాఫ్ట్‌కు చెందిన సభ్యులు హాజరయ్యారు. మొత్తం 24 క్రాఫ్ట్స్‌ నుండి 72 మంది ప్రతినిధులతో చిరంజీవి ప్రత్యక్షంగా మాట్లాడారు.

ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మాట్లాడుతూ 'గత 15 రోజులుగా వేతనాల పెంపు కోసం మేము సమ్మె చేస్తున్నాం. ఈ రోజు మెగాస్టార్ చిరంజీవి గారు మమ్మల్ని పిలిచి మాట్లాడారు. నిర్మాతలు మా మాట వినకుండా మాపైనే నిందలు వేస్తున్నారు. మేము రెండు కండిషన్లు పెట్టుకున్నాం, వాటిని అంగీకరిస్తే మేమేం నష్టపోమో చిరంజీవిగారికి వివరించాం. ఆదివారం డబుల్ కాల్ షీట్ సమస్య గురించి కూడా విన్నవించుకున్నాం. ఎలాంటి ఇబ్బంది వచ్చినా నా దగ్గరకు రండి అని ఆయన మాకు ధైర్యం చెప్పారు. రేపు మేము జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అలాగే ఛాంబర్‌తో కూడా సమావేశం జరగనుంది. మేం కోరినట్టుగానే వేతనాలు వస్తాయని ఆశిస్తున్నాం' అన్నారు. అలాగే ఆయన 'చిరంజీవిగారు, బాలయ్యబాబు గారు మాతో మాట్లాడేది సమస్య పరిష్కారం కోసమే కానీ ఎవరిపక్షం వహించరు' అని స్పష్టం చేశారు.

ఫెడరేషన్ కోఆర్డినేషన్ మెంబర్ వీరశంకర్ మాట్లాడుతూ 'సినీ పరిశ్రమలో ఇలాంటి సమ్మెలు కొత్తవి కావు. గతంలో చెన్నైలో కూడా 30–40 రోజులు షూటింగ్స్ ఆగిపోయాయి. ఇప్పుడు కూడా మేము చెప్పిన ప్రతి సమస్యను చిరంజీవిగారు శ్రద్ధగా విన్నారు. రేపు ఛాంబర్‌తో మీటింగ్ అయ్యాక పరిష్కారం దొరకొచ్చని భావిస్తున్నాం. నిర్మాతలు కూడా కార్మికుల పరిస్థితిని అర్థం చేసుకోవాలి' అన్నారు.

ఈ పరిణామాలన్నీ చూస్తుంటే రేపు సాయంత్రం 4 గంటలకు జరగబోయే ఫిల్మ్ ఛాంబర్–ఫెడరేషన్ సమావేశం అత్యంత కీలకమవ్వనుంది. కార్మికుల వేతన సమస్యలు, డబుల్ కాల్ షీట్ వ్యవహారం, షూటింగ్‌లు ఆగిపోవడం వంటి అంశాలపై ఈ మీటింగ్‌లో ఒక స్పష్టత రావచ్చని పరిశ్రమ అంతా ఎదురుచూస్తోంది.

Tags:    

Similar News