చరణ్‌కి చిరంజీవి ఆశీస్సులు
రామ్ చరణ్.. చిరుతలా దూసుకొచ్చి మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మెగా పవర్ స్టార్. మెగా ట్యాగ్ ను నిలుపుకుంటూ సినిమాల్లోనే కాదు. వ్యక్తిత్వంలోనూ చిరంజీవికి పుత్రోత్సాహాన్ని నింపుతూ దూసుకువెళుతున్నాడు.;
రామ్ చరణ్.. చిరుతలా దూసుకొచ్చి మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న మెగా పవర్ స్టార్. మెగా ట్యాగ్ ను నిలుపుకుంటూ సినిమాల్లోనే కాదు. వ్యక్తిత్వంలోనూ చిరంజీవికి పుత్రోత్సాహాన్ని నింపుతూ దూసుకువెళుతున్నాడు. ఈరోజుతో చరణ్ సినిమాల్లోకి ప్రవేశించి 18 ఏళ్లయ్యింది. ఈ సందర్భంగా.. మెగాస్టార్ చిరంజీవి తన తనయుడి సినీ ప్రస్థానం గురించి ఓ ఆసక్తికరమైన పోస్ట్ ను సోషల్ మీడియాలో పంచుకున్నారు.
చరణ్ 2007లో ‘చిరుత’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన క్షణాలను తలచుకుంటూ చిరంజీవి, ‘నిన్ను హీరోగా తెరపై చూసిన ఆ క్షణం నాన్నగా నేను ఎప్పటికీ మరచిపోలేను‘ అని పేర్కొన్నారు. తనయుడి క్రమశిక్షణ, కృషి, పట్టుదల, వినయం, అంకితభావమే ఆయనను ఇండస్ట్రీలో ప్రత్యేకంగా నిలబెట్టాయని ప్రశంసించారు.
చరణ్‌ను చూస్తూ తండ్రిగా ఎప్పుడూ గర్వపడతానని చెప్పిన చిరంజీవి, తెలుగు ప్రేక్షకుల అపారమైన అభిమానంతో, దేవుని ఆశీస్సులతో మరెన్నో శిఖరాలను అధిరోహించాలని ఆశీర్వదించారు. చివరగా “విజయోస్తు” అంటూ తన హృదయపూర్వక శుభాకాంక్షలను తెలిపారు.
చిరంజీవి నుంచి వచ్చిన ఈ భావోద్వేగపూర్వక పోస్ట్ మెగా అభిమానులను ఉప్పొంగేలా చేస్తోంది. చరణ్ ఇప్పటివరకు ‘మగధీర, రంగస్థలం, ఆర్.ఆర్.ఆర్’ వంటి చిత్రాలతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన తండ్రి ఆశీస్సులతో, అభిమానుల ఆశీర్వాదాలతో మరింత ఎత్తుకు ఎదగాలని అందరూ కోరుకుంటున్నారు. మరోవైపు రామ్ చరణ్ 18 సంవత్సరాల సినీ జర్నీని ప్రస్తావిస్తూ ‘పెద్ది‘ నుంచి కొత్త పోస్టర్ రిలీజయ్యింది.