సెప్టెంబర్ లో బాక్సాఫీస్ సందడి

సెప్టెంబర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ సందడి నెలకొనబోతుంది. ఈ ఆగస్ట్ నెలలో రావాల్సిన రవితేజ ‘మాస్ జాతర’ వాయిదా పడే అవకాశాలు ఉండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ మీదకు మళ్లింది.;

By :  S D R
Update: 2025-08-21 01:36 GMT

సెప్టెంబర్ లో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ సందడి నెలకొనబోతుంది. ఈ ఆగస్ట్ నెలలో రావాల్సిన రవితేజ ‘మాస్ జాతర’ వాయిదా పడే అవకాశాలు ఉండటంతో.. ఇప్పుడు అందరి దృష్టి సెప్టెంబర్ మీదకు మళ్లింది. సెప్టెంబర్ నెలలో వరుసగా పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉండటంతో బయ్యర్లు, పంపిణీదారులు ఆశాభావంతో ఎదురుచూస్తున్నారు.

సెప్టెంబర్‌లో ఐదు పెద్ద తెలుగు సినిమాలు, రెండు తమిళ డబ్బింగ్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఈ చిత్రాలన్నీ క్యాస్టింగ్, బడ్జెట్, నిర్మాణ విలువల పరంగా ఆయా హీరోల కెరీర్‌లో ఎంతో కీలకమైనవి. వీటితో పాటు, థియేటర్ షేర్ల కోసం తీవ్రమైన పోటీ ఉండబోతుంది.

ముందుగా సెప్టెంబర్ 5న అనుష్క 'ఘాటి' రాబోతుంది. వైవిధ్యభరితమైన కథలను ఎంచుకోవడంలో ముందుండే క్రిష్ ఈ చిత్రాన్ని ఓ రూరల్ యాక్షన్ థ్రిల్లర్ గా తీర్చిదిద్దాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఒక బలమైన ఓపెనింగ్ సాధించే అవకాశం ఉంది.

మాస్ మహారాజ రవితేజ నటించిన ‘మాస్ జాతర’ ఆగస్టు 27న రావాల్సి ఉంది. అయితే.. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 5 లేదా సెప్టెంబర్ 12కి వాయిదా వేయొచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కానీ ఈ తేదీలలో ఇప్పటికే ఫుల్ కాంపిటేషన్ ఉంది. అయినా రవితేజ ఫ్యాన్ బేస్, ఈ చిత్రం మీద ఉన్న అంచనాలను బట్టి, ‘మాస్ జాతర’ మాస్ ఆడియన్స్‌ను ఆకర్షించే అవకాశం ఉంది.

తేజ సజ్జ నటించిన ‘మిరాయ్’ సెప్టెంబర్ 5న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ఈ చిత్రాన్ని నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సెప్టెంబర్ 12న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తుందట. ‘హనుమాన్’ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత తేజ సజ్జపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం ఒక సైన్స్-ఫిక్షన్ యాక్షన్ డ్రామాగా ఉంటుందని, విజువల్ గా తెలుగు సినిమాకి ఓ కొత్త స్టాండార్డ్ సెట్ చేస్తుందనే అంచనాలున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ లో 'మిరాయ్' దూసుకుపోతుంది.

సెప్టెంబర్ 12న బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘కిష్కిందపురి’ కూడా రాబోతుంది. ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్, సాంగ్ ఆకట్టుకున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ జంటగా నటించిన చిత్రమిది. బెల్లంకొండ ఇప్పటివరకూ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా హారర్ ఎలిమెంట్స్ తో సరికొత్తగా తయారయ్యింది.

ఇక దసరా కానుకగా సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజి’ విడుదల కానుంది. ఈ చిత్రం గురించి ఇప్పటికే భారీ హైప్ ఉంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ బేస్ కారణంగా ఈ సినిమాకు థియేటర్లలో భారీ ఓపెనింగ్ ఖాయం. నిర్మాత డి.వి.వి. దానయ్యకు పంపిణీదారులు రికార్డు స్థాయి రేట్లను ఆఫర్ చేస్తున్నారు. గ్యాంగ్‌స్టర్ డ్రామాగా సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ఒక ముఖ్యమైన చిత్రంగా నిలవనుందని భావిస్తున్నారు.

మరోవైపు దసరా బరిలో బాలకృష్ణ 'అఖండ 2' కూడా ఉన్నప్పటికీ ఈ చిత్రం వాయిదా పడిందనే ప్రచారం జరుగుతుంది. ఇక తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్న తమిళ హీరోలు శివ కార్తికేయన్, విజయ్ ఆంటోని కూడా సెప్టెంబర్ లో కొత్త సినిమాలతో వస్తున్నారు. శివ కార్తికేయన్ నటించిన 'మదరాసి' చిత్రం సెప్టెంబర్ 5న రాబోతుంది. మురుగదాస్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.

విజయ్ ఆంటోని నటించిన 'భద్రకాళి' సెప్టెంబర్ 12న విడుదలకు ముస్తాబవుతుంది. 'మదరాసి, భద్రకాళి' రెండు చిత్రాలు తెలుగు సినిమాలతో పోటీ పడనప్పటికీ, మల్టీప్లెక్స్‌లలో స్క్రీన్ షేర్‌ల కోసం కొంత ప్రభావం చూపవచ్చు. మొత్తంగా సెప్టెంబర్ నెల టాలీవుడ్‌కి సమ్‌థింగ్ స్పెషల్ గా ఉండబోతుంది.

Tags:    

Similar News