అక్టోబర్ లో బాక్సాఫీస్ సందడి

సెప్టెంబరులో సక్సెస్ ఫుల్ సినిమాలతో బాక్సాఫీస్‌కి పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈనెలలో వచ్చిన ‘కొత్త లోక, లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి, మిరాయ్, ఓజీ’ ఘన విజయాలు నమోదు చేసుకున్నాయి.;

By :  S D R
Update: 2025-09-27 07:11 GMT

సెప్టెంబరులో సక్సెస్ ఫుల్ సినిమాలతో బాక్సాఫీస్‌కి పండుగ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈనెలలో వచ్చిన ‘కొత్త లోక, లిటిల్ హార్ట్స్, కిష్కింధపురి, మిరాయ్, ఓజీ’ ఘన విజయాలు నమోదు చేసుకున్నాయి. ఇదే ఊపుతో అక్టోబర్ నెల కూడా వరుస సినిమాలతో రసవత్తరంగా సాగబోతుంది. దసరా, దీపావళి సెలవులు రావడంతో థియేటర్లు సందడిగా మారబోతున్నాయి.

ముందుగా అక్టోబరు 1న ధనుష్‌ దర్శకత్వం వహించిన 'ఇడ్లీ కొట్టు' చిత్రం రాబోతుంది. తమిళంలో 'ఇడ్లీ కడై'గా రూపొందిన ఈ చిత్రాన్ని ధనుష్ స్వయంగా తెరకెక్కించడం విశేషం. ఈ చిత్రంలో ధనుష్ కి జోడీగా నిత్యా మీనన్ నటించింది. అక్టోబర్ 2న దసరా కానుకగా రిషబ్ శెట్టి నటించి, దర్శకత్వం వహించిన కాంతార: చాప్టర్ 1 భారీ స్థాయిలో రానుంది. హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాని నిర్మించింది. పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో రాజుల కాలం నాటి కథతో ఈ చిత్రం తెరకెక్కింది.

దసరా బరిలో అనువాద చిత్రాలు ‘ఇడ్లీ కొట్టు, కాంతార‘ వస్తుంటే.. దీపావళి కానుకగా వరుసగా సినిమాలు మళ్లీ థియేటర్లకు క్యూ కట్టబోతున్నాయి. అక్టోబర్ 16న 'మిత్రమండలి', అక్టోబర్ 17న సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా', అక్టోబర్ 17న ప్రదీప్ రంగనాథన్ 'డ్యూడ్', అక్టోబర్ 18న కిరణ్ అబ్బవరం కె-ర్యాంప్ సినిమాలు దీపావళికి సందడి చేయబోతున్నాయి.

ఇక అక్టోబర్ నెలాఖరులో మాత్రం పెద్ద సంచలనం 'బాహుబలి: ది ఎపిక్' రాబోతుంది. 'బాహుబలి' రెండు భాగాలను కలిపి రీ మాస్టర్డ్, రీ కట్ తో మూడున్నర గంటల నిడివితో ‘బాహుబలి.. ది ఎపిక్‘ను తీసుకొస్తున్నారు. అక్టోబర్ 31న ఈ చిత్రం థియేటర్లలో మాత్రమే విడుదలకానుంది.

Tags:    

Similar News