‘అర్జున్ S/O వైజయంతి’ ట్విట్టర్ రివ్యూ
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’.;
నటీనటులు: నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి, సయీ మంజ్రేకర్, సోహైల్ ఖాన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రామ్ ప్రసాద్
సంగీతం: అజనీష్ లోక్‌నాథ్
ఎడిటింగ్ : తమ్మిరాజు
నిర్మాతలు: అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు
దర్శకత్వం: ప్రదీప్ చిలుకూరి
విడుదల తేది: ఏప్రిల్ 18, 2025
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘అర్జున్ S/O వైజయంతి’. లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఈ సినిమాలో మరో ప్రధాన పాత్రలో నటించారు. కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘అర్జున్ S/O వైజయంతి’ ఈరోజు ఆడియన్స్ ముందుకు వస్తోంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ప్రదర్శించారు. దాని ప్రకారం ‘అర్జున్ S/O వైజయంతి’కి ఎలాంటి రివ్యూస్ వస్తున్నాయో చూద్దాం.
కథ
కథ విషయానికొస్తే ‘అర్జున్ S/O వైజయంతి’ ఒక యాక్షన్-ఎమోషనల్ డ్రామా, ఇందులో తల్లి-కొడుకుల అనుబంధం కేంద్ర బిందువుగా నిలుస్తుందని తెలుస్తోంది. వైజయంతి (విజయశాంతి), ఒక గౌరవనీయమైన పోలీస్ ఆఫీసర్, చట్టం ప్రకారం సమాజంలో న్యాయం స్థాపించాలని కోరుకుంటుంది. ఆమె తన కొడుకు అర్జున్ (కళ్యాణ్ రామ్) కూడా తన బాటలోనే పోలీస్ అధికారిగా ఎదగాలని ఆశిస్తుంది. అయితే, అనుకోని పరిస్థితుల్లో అర్జున్ గుండాగా మారుతాడు, దీంతో తల్లి-కొడుకుల మధ్య సంఘర్షణ తలెత్తుతుంది. ఈ నేపథ్యంలో అర్జున్ తన తల్లి పట్ల ఉన్న ప్రేమను, సమాజంలో అన్యాయాలను ఎదిరించే తన పోరాటాన్ని ఎలా సమన్వయం చేస్తాడు? అనేది ఈ కథగా చెబుతున్నారు.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
అర్జున్ పాత్రలో కళ్యాణ్ రామ్ తన కెరీర్‌లో ఒక గుర్తుండిపోయే ప్రదర్శనను అందించాడనే రివ్యూస్ వస్తున్నాయి. యాక్షన్ సన్నివేశాల్లో తన మాస్ హీరో ఇమేజ్‌ను సమర్థవంతంగా ప్రదర్శించాడని.. అదే సమయంలో తల్లితో ఎమోషనల్ సన్నివేశాల్లో సహజమైన నటనతో ఆకట్టుకున్నాడనే రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అతని నటన ప్రేక్షకులను కన్నీళ్లు తెప్పిస్తుందని సోషల్ మీడియా రివ్యూలు సూచిస్తున్నాయి.
లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించిందనే ప్రశంసలు దక్కుతున్నాయి. ‘కర్తవ్యం’ సినిమాలో వైజయంతి పాత్రను గుర్తుచేసేలా, ఈ సినిమాలో ఆమె నటన చాలా బాగుందని రివ్యూస్ వస్తున్నాయి. ముఖ్యంగా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, డైలాగ్ డెలివరీ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచిందనేది రివ్యూల సారాంశం.
దర్శకుడు ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాను ఒక కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సమర్థవంతంగా తెరకెక్కించాడని.. తల్లి-కొడుకుల సంఘర్షణను ఎమోషనల్‌గా చూపించడంలో, అదే సమయంలో మాస్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే యాక్షన్ సన్నివేశాలను జోడించడంలో విజయం సాధించాడనేది ట్విట్టర్ టాక్. అయితే, కథలో కొన్ని రొటీన్ అంశాలు సినిమా ప్రభావాన్ని కొంత తగ్గించాయని కొందరు విమర్శించారు.
అజనీష్ లోక్‌నాథ్ అందించిన సంగీతం సినిమాకు ప్రధాన బలంగా తెలుస్తోంది. ముఖ్యంగా ‘ముచ్చటగా బంధాలే’ తల్లి-కొడుకుల అనుబంధాన్ని హృద్యంగా చూపించిందట. అతని బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ యాక్షన్, ఎమోషనల్ సన్నివేశాలకు అద్భుతమైన ఊతమిచ్చిందట. రామ్ ప్రసాద్ అందించిన విజువల్స్ బాగున్నాయని.. క్లైమాక్స్‌లోని ఫైట్ సీక్వెన్స్‌లు, ఎమోషనల్ సన్నివేశాలు విజువల్‌గా ఆకట్టుకున్నాయని చెబుతున్నారు.
చివరగా
సినిమాలోని ఎమోషనల్ సన్నివేశాలు, ముఖ్యంగా క్లైమాక్స్‌లోని చివరి 20 నిమిషాలు, ప్రేక్షకులను భావోద్వేగంతో కట్టిపడేస్తాయట. ఈ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయంటున్నారు.
కళ్యాణ్ రామ్ హీరోయిజం ఎలివేట్ అయ్యే సన్నివేశాలు మాస్ ఆడియన్స్‌కు పండగలా ఉన్నాయని.. విలన్‌తో జరిగే ఫైట్ సీక్వెన్స్‌లు థియేటర్లలో హోరెత్తించాయని ఫ్యాన్స్ చెబుతున్నారు.
అయితే.. కథలో కొన్ని భాగాలు ఊహించదగినవిగా, రొటీన్‌గా అనిపించాయని సయీ మంజ్రేకర్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం కొంత నిరాశను కలిగించిందని కొంతమంది అభిప్రాయాలు వెల్లిబుచ్చుతున్నారు.