వై.వి.ఎస్.చౌదరి తల్లి రత్నకుమారి కన్నుమూత

ప్రముఖ దర్శకుడు వై.వి.ఎస్.చౌదరి తల్లి యలమంచిలి రత్నకుమారి నిన్న సాయంత్రం 8.31 గంటలకు కన్నుమూశారు. ఆమె వయసు 88 సంవత్సరాలు. తన తల్లి మరణ వార్తను తెలుపుతూ వై.వి.ఎస్. ఓ ఎమోషనల్ నోట్ ను పంచుకున్నారు.
'మన పెద్దలు చదువుకోని వాళ్లను చూసి తరచూ ఒక సామెత వాడేవారు – “పొట్ట కోస్తే అక్షరం ముక్క రాదు, ఎందుకు పనికొస్తార్రా మీరు?” అని. కానీ ఆ మాటకే అక్షర సత్యం లాంటి ప్రత్యామ్నాయం చూపిన స్త్రీ శక్తి – యలమంచిలి రత్నకుమారి గారు.
ఒక లారీ డ్రైవర్ అయిన యలమంచిలి నారాయణరావు గారి సాధారణమైన నెలసరి సంపాదనతో.. ముగ్గురు పిల్లల పెంపకం, పౌష్టికాహారం, బట్టలు, అద్దె ఇల్లు, చదువు, వైద్యం అన్నింటినీ సమన్వయం చేస్తూ.. అలాగే సినిమాలు చూపించడం, దేవాలయ దర్శనాలు, పండగల పిండి వంటలు, నిల్వ పచ్చళ్ళు, కుటుంబ వేడుకలు అన్నింటికీ ప్రత్యేక బడ్జెట్ కేటాయించి జీవితం సవ్యంగా నడిపించారు.
ఆర్థిక లెక్కల్లో ఆమెకు ఎటువంటి పాఠశాలా, విద్యా లేదు. అయినా ప్రతీ రూపాయి విలువ తెలిసిన ఆర్థిక నిపుణురాలిగా నిలిచారు. కుటుంబాన్ని కేవలం గృహిణిగా కాకుండా ఒక పరిపూర్ణ నిర్వాహకురాలిగా తీర్చిదిద్దారు.
తెల్లవారుజామున లేచి పనిమనిషి సహాయం లేకుండా, అన్నీ తానే చేసుకునే క్రమశిక్షణతో పిల్లల పెంపకాన్ని అంకితం చేసిన ఆదర్శమూర్తి ఆమె. రత్నకుమారి గారి జీవన విధానం, బడ్జెట్ లెక్కలు, విలువైన నిర్ణయాలు – ఏ పాఠశాలలోనూ నేర్పించలేనివి.' అంటూ తన నోట్ లో తెలిపారు వై.వి.ఎస్.
-
Home
-
Menu