ఈ వారం థియేటర్/ఓటీటీ చిత్రాలు

సెప్టెంబర్ నెల టాలీవుడ్‌కి కొత్త ఊపుని తీసుకొచ్చింది. ‘లిటిల్ హార్ట్స్, మిరాయ్, కిష్కింధపురి’ లాంటి చిత్రాలు బాక్సాఫీసు వద్ద హిట్ టాక్ సాధించాయి. ఇప్పటికే ఈ సినిమాలు థియేటర్లలో విజయవంతంగా కొనసాగుతుండగా, ఈ వారం మరికొన్ని సినిమాలు థియేటర్లకు క్యూ కడుతున్నాయి.
ముందుగా తెలుగు చిత్రాల విషయానికొస్తే మంచు లక్ష్మి నటించిన 'దక్ష' రేపు థియేటర్లలోకి వస్తోంది. మంచు లక్ష్మి పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్న ఈ క్రైమ్ థ్రిల్లర్‌లో మోహన్ బాబు, సముద్రఖని కీలక పాత్రల్లో నటించారు. వంశీకృష్ణ మల్లా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యాక్షన్, సస్పెన్స్ మేళవింపుతో ఆడియన్స్ అలరించడానికి వస్తోంది.
వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ప్రేమకథా చిత్రం 'బ్యూటీ'. అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన ఈ మూవీని జె.ఎస్.ఎస్. వర్ధన్ తెరకెక్కించారు. స్టార్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాని నిర్మించడం విశేషం. ప్రేమకథతో పాటు తండ్రీ–కూతుళ్ల అనుబంధం ఈ సినిమాలో హైలైట్ కానుందట. విజయ్ బుల్గానిన్ మ్యూజిక్ ఈ మూవీకి మరో పెద్ద ప్లస్ పాయింట్ అని భావిస్తోంది టీమ్. రేపు 'బ్యూటీ' ఆడియన్స్ ముందుకు వస్తోంది.
ఇంద్రాణి ధవళూరి నిర్మాతగా దర్శకురాలిగా తెరకెక్కించిన చిత్రం 'అందెల రవమిది'. ఈ చిత్రంలో విక్రమ్ కొల్లూరు, తనికెళ్ల భరణి, ఆదిత్య మీనన్, జయలలిత ఇతర కీలక పాత్రలు పోషించారు. క్లాసికల్ డ్యాన్స్ లో వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చిన ఇంద్రాణి రూపొందించిన ఈ మ్యూజికల్ డ్రామా 'అందెల రవమిది'.
రేపు తమిళం నుంచి అనువాద రూపంలో తెలుగులోకి వస్తోన్న చిత్రం 'భద్రకాళి'. కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో విజయ్ ఆంటోని 25వ చిత్రంగా 'భద్రకాళి' రూపొందింది. అరుణ్ ప్రభు దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కింది. ఒక సాధారణ వ్యక్తి మొత్తం రాజకీయాలను ఎలా కుదిపేశాడనే ఆసక్తికర అంశంతో ఎన్నికలు, డబ్బు, అధికారం, అవినీతి చుట్టూ ఓ సందేశాత్మక కథను ఈ సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీలో విజయ్ ఆంటోని గ్యాంగ్‌స్టర్‌గా, ప్రభుత్వ అధికారిగా విభిన్న షేడ్స్‌లో కనిపించనున్నాడు.
'కేజీయఫ్, సలార్' లాంటి యాక్షన్ చిత్రాలకు సంగీతం అందించి మ్యూజిక్ డైరెక్టర్‌గా ఒక సంచలనం సృష్టించిన రవి బస్రూర్.. ‘వీర చంద్రహాస’ చిత్రంతో దర్శకుడిగా కూడా సత్తా చాటారు. ఇప్పటికే కన్నడలో విజయాన్ని సాధించిన ఈ సినిమా రేపు తెలుగు ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఈ సినిమాలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషించారు.
బాలీవుడ్ నుంచి థియేటర్లలోకి వస్తోన్న చిత్రాలలో 'జాలీ ఎల్.ఎల్.బి 3' ఒకటి. 'జాలీ ఎల్.ఎల్.బి' ఫస్ట్ పార్ట్ లో నటించిన అర్షద్ వార్సీ, సెకండ్ పార్ట్ లో కనిపించిన అక్షయ్ కుమార్ కలిసి నటించిన చిత్రమిది. ఈ కామెడీ లీగల్ డ్రామా బాలీవుడ్ ఆడియన్స్‌కే కాకుండా తెలుగు రాష్ట్రాలలో మల్టీప్లెక్స్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే అవకాశం ఉంది.
మరోవైపు ఓటీటీ ఆడియన్స్ కోసం 'ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' రెడీ అయ్యింది. బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న వెబ్‌సిరీస్ ఇది. హిందీ చిత్ర పరిశ్రమ వెనక ఉన్న రహస్యాలు, చీకటి కోణాలు, సక్సెస్ కోసం చేసే పోరాటాలు ఇందులో ప్రధానంగా చూపించబడ్డాయి. లక్ష్య, బాబీ డియోల్, సహేర్, రాఘవ్ జూయల్ ముఖ్య పాత్రల్లో నటించగా, షారుక్, సల్మాన్, రణ్‌వీర్ సింగ్, రాజమౌళి గెస్ట్ అప్పియరెన్సెస్‌తో కనిపించారు. ఈరోజు నుంచే నెట్‌ఫ్లిక్స్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది.
-
Home
-
Menu