స్టార్ వారసుల కొత్త ప్రయాణం

సినీ ఇండస్ట్రీలో స్టార్ వారసులు సాధారణంగా కెమెరా ముందు హీరోలుగా, హీరోయిన్లుగా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు. కానీ ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. స్టార్ కిడ్స్ కెమెరా వెనుకకు వెళ్లి దర్శకులుగా తమ ప్రతిభను నిరూపించుకుంటున్నారు.
బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ హీరోగా మారతాడు అనుకుంటే.. డైరెక్టర్ అయ్యి అందరికీ షాక్ ఇచ్చాడు. తన డెబ్యూనే 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' అంటూ ఓ కాంట్రవర్శియల్ సబ్జెక్ట్‌ను ఎంచుకుని సక్సెస్ కొట్టాడు. ప్రస్తుతం ఈ సిరీస్ లో సెకండ్ పార్ట్ కోసం రెడీ అవుతున్నాడు.
తమిళ దళపతి విజయ్ తనయుడు కూడా దర్శకుడిగా సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. తండ్రి విజయ్ లా నటుడు కాకుండా జాసన్ సంజయ్ తాత ఎస్.ఎ.చంద్రశేఖర్ లా దర్శకుడిగా మారుతున్నాడు. టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా తొలి చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలా భాగం చిత్రీకరణ పూర్తి చేసుకుంది.
లేటెస్ట్ గా సూర్య – జ్యోతికల కుమార్తె దియా కూడా దర్శకురాలిగా తన టాలెంట్ ను చూపించేందుకు సిద్ధమైంది. 17 ఏళ్ల దియా ‘లీడింగ్ లైట్’ అనే 13 నిమిషాల డాక్యు-డ్రామా తెరకెక్కించింది. లైటింగ్ విభాగంలో గుర్తింపు తెచ్చుకున్న మహిళా టెక్నీషియన్ల పోరాటాన్ని చూపించిన ఈ చిత్రం ఆస్కార్-క్వాలిఫైయింగ్ రన్లో ప్రదర్శనకు ఎంపిక కావడం విశేషం.
టాలీవుడ్ లోనూ మాస్ మహారాజ రవితేజ తనయుడు మహాధన్ దర్శకత్వం వైపు అడుగులు వేస్తున్నాడు. ఇలా స్టార్ వారసులు నటన కంటే దర్శకత్వం వైపు మక్కువ చూపించడం విశేషమే. కొత్త తరం ఈ ప్రయత్నం సినీ ప్రపంచానికి కొత్త ఊపు తెచ్చేలా ఉందని చెప్పుకోవచ్చు.
-
Home
-
Menu