'ది గేమ్: యు నెవర్ ప్లే ఎలోన్' రివ్యూ

నటీనటులు: శ్రద్ధా శ్రీనాథ్, సంతోష్ ప్రతాప్, చాందినీ తదితరులు
సినిమాటోగ్రఫీ: అఖిలేశ్
సంగీతం: సైమన్ కింగ్
ఎడిటింగ్ : మణిమారన్
దర్శకత్వం: రాజేశ్ ఎం.సెల్వ
విడుదల తేది: అక్టోబర్ 2, 2025 (నెట్‌ఫ్లిక్స్)
ఈమధ్య సినిమాలకు ధీటుగా సిరీస్ లకు ఆదరణ పెరుగుతుంది. ఈకోవలోనే లేటెస్ట్ గా ఓటీటీ జయంట్ నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది 'ది గేమ్: యు నెవ్వర్ ప్లే ఎలోన్'. శ్రద్ధా శ్రీనాథ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సిరీస్ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
కావ్య (శ్రద్ధా శ్రీనాథ్) ప్రతిభావంతమైన గేమ్ డెవలపర్. అదే సంస్థలో పనిచేసే అనూప్ (సంతోష్ ప్రతాప్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది. అక్కయ్య కూతురు తార బాధ్యతను కూడా తీసుకుంటుంది. గేమ్ డిజైనర్‌గా ఆమెకు మంచి పేరు, అవార్డులు దక్కుతాయి. అయితే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే కావ్య తరచూ ట్రోల్స్‌కు గురవుతూ ఉంటుంది.
తాను క్రియేట్ చేసిన గేమ్‌కి అవార్డు అందుకున్న రాత్రి ఆమెపై ముసుగు ధరించిన వ్యక్తులు దాడి చేస్తారు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత సోషల్ మీడియాలో ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతాయి. దీనివల్ల కావ్య–అనూప్ మధ్య దూరం ఏర్పడుతుంది. ఇదే సమయంలో కావ్యకు సంబంధించిన ఒక పాత వీడియో వైరల్ అవుతుంది, తార కూడా దేవ్ అనే యువకుడి బ్లాక్‌మెయిల్‌కు గురవుతుంది. ఇలాంటి పరిస్థితుల మధ్య కావ్య తనపై దాడి చేసిన వారిని కనుగొందా? తారను ఎలా కాపాడుతుంది? అన్నది తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
టెక్నాలజీ మన జీవితాన్ని ఈజీ చేసినప్పటికీ, అదే టెక్నాలజీని దుర్వినియోగం చేసే వారు పెరుగుతున్నారు. సెలబ్రిటీల ఫోటోలు మార్ఫింగ్ చేయడం, వ్యక్తిగత వివరాలను బయటపెట్టడం, ఏఐ ద్వారా అసభ్య వీడియోలు సృష్టించడం వంటి సంఘటనలు నిత్యం వార్తల్లో వినిపిస్తూనే ఉన్నాయి. ఇలాంటి అంశాలను ఇతివృత్తంగా తీసుకుని రూపొందించిందే ఈ సిరీస్.
సముద్ర తీరంలో గాయాలతో పడిన కావ్య (శ్రద్ధా శ్రీనాథ్)తో కథ మొదలవుతుంది. ఆమె వ్యక్తిగత, వృత్తి జీవితంలో ఎదుర్కొన్న అవమానాలు, సోషల్ మీడియా దాడులు, ఆఫీస్ రాజకీయాలు ఇలా సిరీస్ నెమ్మదిగా మిస్టరీగా ముందుకు సాగుతుంది. కావ్యపై దాడి జరిగిన తర్వాత కథ మరింత థ్రిల్లింగ్‌గా మారుతుంది.
డిజిటల్ ప్రపంచంలో ప్రైవసీ కోల్పోతున్న నేటి పరిస్థితిని దర్శకుడు బాగా చూపించాడు. అయితే కథ పరిమిత లొకేషన్లలో సాగడం, ఎక్కువ ఎమోషనల్ డెప్త్ లేకపోవడం వల్ల కొంత నిస్పృహ కలిగిస్తుంది. కుటుంబ అనుబంధాలు, భావోద్వేగాలను టచ్ చేయడంలో కొంత లోటు కనిపిస్తుంది. మొత్తంమీద.. మంచి సందేశాన్ని అందించే ప్రయత్నంగా రూపొందిన ఈ సిరీస్ నిర్మాణ పరంగా మెరుగ్గా ఉన్నా, కథనం మాత్రం సాధారణంగానే అనిపిస్తుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
శ్రద్ధా శ్రీనాథ్ తన నటనతో మెప్పించినప్పటికీ, ఆమె పాత్ర డిజైన్ మరింత మెరుగ్గా ఉండాల్సింది. సంతోష్ ప్రతాప్, చాందినీ వంటి ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. దర్శకుడు రాజేష్ తన కథను కొత్త పంథాలో స్క్రీన్‌పై చూపించాడు. అయితే, స్లో నేరేషన్ వలన కొన్ని సన్నివేశాలు బోరింగ్ గా అనిపిస్తాయి. అఖిలేశ్ ఫొటోగ్రఫీ, సైమన్ కింగ్ నేపథ్య సంగీతం ఫర్వాలేదు. మణిమారన్ ఎడిటింగ్ మరింత షార్ప్‌గా ఉంటే మంచి ప్రభావం ఉండేది.
చివరగా
'ది గేమ్'.. అంతా డిజిటల్ మాయాజాలం
-
Home
-
Menu