రోబో శంకర్ కన్నుమూత

తమిళ సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రఖ్యాత హాస్య నటుడు రోబో శంకర్ (46) ఇక లేరు. లివర్, కిడ్నీ సమస్యలతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం ఇటీవల బాగా క్షీణించింది. గురువారం (సెప్టెంబర్ 18) రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ వార్తతో కోలీవుడ్ మొత్తం షాక్‌కు గురైంది.
రోబో శంకర్ తన ప్రయాణాన్ని ఒక స్టాండప్ కమెడియన్‌గా ప్రారంభించారు. "కలక్క పావతు యారు" టెలివిజన్ షో ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, రోబోలా డ్యాన్స్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో "రోబో శంకర్" అన్న పేరు స్థిరపడింది. బుల్లితెరపై మెప్పించిన ఆయన తరువాత వెండితెరపై తనదైన స్టైల్‌లో చోటు సంపాదించుకున్నారు.
ధనుష్ హీరోగా వచ్చిన "మారి" చిత్రంలో రోబో శంకర్ పాత్ర బాగా హైలైట్ అయ్యింది. ఆ తర్వాత అజిత్ నటించిన "విశ్వాసం", శివకార్తికేయన్‌తో "వేలైక్కారన్", విజయ్‌తో "పులి", సూర్యతో "సింగం 3", విక్రమ్‌తో "కోబ్రా" వంటి చిత్రాల్లో ఆయన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
రోబో శంకర్‌కు భార్య ప్రియాంక శంకర్, కుమార్తె ఇంద్రజ ఉన్నారు. ఇంద్రజ కూడా విజయ్ నటించిన "బిగిల్" సినిమాతో నటిగా పరిచయమైంది. ఇటీవల విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన "పాగల్"లో కూడా కనిపించింది. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని చెన్నై వలసరవక్కలోని ఆయన నివాసంలో అభిమానుల సందర్శనార్థం ఉంచారు. ఈరోజు అంత్యక్రియలు జరగనున్నాయి.
-
Home
-
Menu