'దంగల్' చిత్రంపై పవన్ వ్యాఖ్యలు!

భారతీయ సినిమా రంగంలో ప్రామాణికంగా నిలిచే సినిమా ఏదంటే ఎంతోమంది చెప్పే పేరు ‘దంగల్’. నితీష్ తివారీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కేవలం బాక్సాఫీస్ విజయాన్ని కాదు, దేశభక్తిని, స్పూర్తిని నింపిన గొప్ప కంటెంట్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఇండియాలోకంటే చైనాలో ఈ చిత్రానికి ఎక్కువ వసూళ్లు దక్కాయి. అందుకే.. ఇప్పటికీ ఇండియన్ మూవీస్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'దంగల్' రికార్డు సృష్టించింది.
ఈ సినిమాపై అప్పట్లో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ కూడా తన మన్నన తెలియజేశారు. సాధారణంగా తను నటించిన సినిమాలనే తాను చూడనని చెప్పే పవన్, ఈ సినిమాను థియేటర్లో చూసి ప్రత్యేకంగా ప్రశంసించారు. 'ఇలాంటి సినిమాలు దేశ యువతకు మార్గదర్శకంగా ఉంటాయి. దేశభక్తిని చాటే సినిమాలు సమాజానికి అవసరం' అని అభిప్రాయపడ్డారు.
తాజాగా ఓ సమావేశంలో 'దంగల్'ను మరోసారి ప్రస్తావించిన పవన్, బాలీవుడ్‌లో ఒకప్పుడు వచ్చిన మంచి సినిమాల గురించి గుర్తు చేశారు. 'ఇప్పుడు ఆ స్థాయి ప్రభావవంతమైన సినిమాలు రావడం లేదు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గ కథలు అందించడంలో వారు వెనుకబడుతున్నారు' అని వ్యాఖ్యానించారు.
అలాగే టాలీవుడ్ గురించి మాట్లాడుతూ, ఇలాంటి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలకు ఇక్కడ అవకాశమే ఉండదని, నిర్మాతలు, హీరోలు ఎక్కువగా కమర్షియల్ ఫార్ములాలకే ఓటేస్తున్నారని అభిప్రాయపడ్డారు. ఇక తాను ఇప్పటివరకు చేసిన పాత్రల్లో ఏదీ తన మనసుకు పూర్తిగా దగ్గర కాలేదని పవన్ తెలిపారు. 'ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలే నచ్చాయి. నిజ జీవితంలో నేను ఎలా ఉంటానో, తెరపై కూడా అలా కనిపించాలని ఉంది. కానీ అలాంటి సినిమాలకు ప్రేక్షకుల ఆదరణ లభించకపోవచ్చు' అని చెప్పారు.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నుంచి 'హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాలు రాబోతున్నాయి. వీటిలో ఇప్పటికే 'వీరమల్లు, ఓజీ' షూటింగ్స్ పూర్తవ్వగా, 'ఉస్తాద్ భగత్ సింగ్' షూటింగ్ దశలో ఉంది. ముందుగా ‘హరిహర వీరమల్లు’ జులై 24న విడుదల కానుంది.
-
Home
-
Menu