జూన్ నెలలో సినిమాల పండగ!

సమ్మర్ సీజన్ ఎండింగ్ కు వచ్చేసింది. ఇప్పుడు టాలీవుడ్ ఆశలన్నీ జూన్ నెలపైనే. ఈ వేసవిలో పెద్ద సినిమాల పండగ పెద్దగా లేదు. కానీ జూన్ లో మాత్రం వరుసగా పాన్ ఇండియా మూవీస్ సందడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. ముందుగా జూన్ 5న కమల్ హాసన్ 'థగ్ లైఫ్' అనువాద రూపంలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
విశ్వనటుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం కలయికలో రూపొందిన చిత్రం 'థగ్ లైఫ్'. ఈ సినిమాలో శింబు, త్రిష వంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మణిరత్నం స్టైల్లో గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందిన ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. ఈనేపథ్యంలో అటు తమిళంతో పాటు ఇటు తెలుగులోనూ 'థగ్ లైఫ్'పై అంచనాలు పెరిగాయి.
జూన్ రెండో వారంలో వచ్చేస్తుంది 'హరిహర వీరమల్లు'. పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రాబోతున్న లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ఇది. పవన్ కళ్యాణ్ తొలిసారి కాస్ట్యూమ్ డ్రామాలో నటించిన చిత్రమిదే. మొఘలుల కాలం నాటి కథతో ఫిక్షనల్ స్టోరీగా రూపొందిన ఈ మూవీలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంతో వీరోచితంగా ఉంటుందట. తెలుగులో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ నుంచి వస్తోన్న పాన్ ఇండియా మూవీ ఇది. జూన్ 12న 'హరిహర వీరమల్లు' గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్ 'కుబేర'. టాలీవుడ్ కింగ్ నాగార్జున, కోలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ ధనుష్ కలయికలో రాబోతున్న సినిమా ఇది. ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటించింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. జూన్ 20న 'కుబేర' గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతుంది. శేఖర్ కమ్ముల తెరకెక్కించిన పక్కా యాక్షన్ థ్రిల్లర్ 'కుబేర'.
ఒకవైపు అగ్ర కథానాయకులతో భారీ బడ్జెట్ లో భారీ సినిమాలు నిర్మిస్తూనే.. మరోవైపు కంటెంట్ ఓరియెంటెడ్ మూవీస్ పైనా స్పెషల్ ఫోకస్ పెట్టింది నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ఈకోవలోనే మైత్రీ నుంచి వస్తోన్న సినిమా '8 వసంతాలు'. 'కుబేర' వస్తోన్న జూన్ 20న '8 వసంతాలు' సైతం విడుదలకు ముస్తాబవుతుంది. ఫణీంద్ర నార్సెట్టి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. 'మ్యాడ్' ఫేమ్ అనంతిక సనీల్ కుమార్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించబోతుంది.
జూన్ 20న రానున్న మరో పాన్ ఇండియా మూవీ 'సితారే జమీన్ పర్'. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ మళ్లీ తెరపైకి వస్తున్న చిత్రమిది.'తారే జమీన్ పర్'కి సీక్వెల్ గా వస్తోన్న ఈ మూవీలో మరో హృదయాన్ని తాకే కథతో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు మిస్టర్ పర్ఫెక్షనిస్ట్. ఈసారి స్పోర్ట్స్ నేపథ్యంలో ఒక వినూత్నమైన ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ పై ఆర్.ఎస్.ప్రసన్న దర్శకత్వం వహించిన 'సితారే జమీన్ పర్' ప్రచార చిత్రాలకు మంచి స్పందన వచ్చింది.
ఇక జూన్ నెల చివరిలో సందడి చేయడానికి సిద్ధమవుతుంది మంచు విష్ణు 'కన్నప్ప'. విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'కన్నప్ప' ఇప్పటికే పలుమార్లు వాయిదా పడి.. ఎట్టకేలకు జూన్ 27న విడుదలకు ముస్తాబవుతుంది. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ నటించడంతో 'కన్నప్ప'పై అందరిలోనూ ఆసక్తి పెరిగింది. మొత్తంగా.. జూన్ నెల తెలుగు సినిమాకి ఎలాంటి అనుభవాన్ని అందిస్తుందో చూడాలి.
-
Home
-
Menu