భారత్-శ్రీలంక మధ్య ఆగస్టులో టీ20 సిరీస్

శ్రీలంక క్రికెట్ బోర్డు (SLC) గుప్తంగా పెద్ద ప్లాన్ వేసింది. ఈ ఆగస్టులో భారత్‌ను ఒక చిన్న పరిమిత ఓవర్ల సిరీస్‌కి ఆహ్వానించేందుకు చురుగ్గా పని చేస్తోంది. అసలు ప్లాన్ ప్రకారం ఆగస్టు 17 నుంచి టీమిండియా బంగ్లాదేశ్‌లో 3 వన్డేలు, 3 టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. కానీ ఆ పర్యటనను భద్రతా కారణాల వల్ల 2026 సెప్టెంబరుకు వాయిదా వేశారు.
ఇంగ్లాండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ ఆగస్టు 4తో ముగియనుండటంతో టీమిండియాకి ఆగస్టు మద్యలో చిన్న గ్యాప్ లభించింది. ఇదే గ్యాప్‌ను ఉపయోగించుకుని శ్రీలంక క్రికెట్ బోర్డు భారత్‌ను ఆహ్వానించేందుకు ప్రయత్నిస్తోంది. ఇప్పటికే చర్చలు మొదలయ్యాయని, సింగపూర్‌లో జరగనున్న ఐసీసీ సమావేశాల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశముందని ఎస్ ఎల్ సి ప్రతినిధి వెల్లడించారు. ఇంకా 2-3 రోజుల్లో స్పష్టమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం అని ఆయన తెలిపారు.
ఈ సిరీస్ ఆమోదం పొందితే మ్యాచ్‌లు కొలంబో, కాండీలో నిర్వహించేందుకు అవకాశం ఉంది. వన్డేలు, టీ20లు రెండూ ఆడే అవకాశాలు ఉన్నా, ప్రధానంగా టీ20లపై దృష్టి ఉంటుంది. ఎందుకంటే 2026లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌కు భారత్, శ్రీలంకలు సంయుక్త నిర్వాహక దేశాలుగా ఉండనుండటంతో ముందు నుంచే సన్నాహకాలు ప్రారంభం అవుతున్నాయి.
ఇక లంక ప్రీమియర్ లీగ్ (LPL) కూడా వాయిదా పడటంతో ఆ సమయంలో ఖాళీ ఏర్పడింది. ఆటగాళ్లకు తగిన ఆట అవకాశం కల్పించడమే కాక, అభిమానులకి మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ ప్రయత్నం చేస్తోంది.
ఇటీవలే శ్రీలంక టీ20 జట్టు బంగ్లాదేశ్ చేతిలో 2-1తో ఓడిపోయింది. టీ20 ఫార్మాట్‌లో ఇదే వారి తొలి సిరీస్ ఓటమి కావడం గమనార్హం. ఈ ఓటమిపై తాత్కాలిక కెప్టెన్ చరిత్ అసలంక తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వరల్డ్ కప్‌కి సిద్ధం కాకుండా వెళ్లే పరిస్థితిలో మేం ఉండలేం అని ఆయన చెప్పాడు. జట్టులో కొన్ని స్థానాలు ఇంకా ఖరారు కాలేదని, ఇలాంటి శక్తివంతమైన జట్లతో ఆడడం మాకు చాలా అవసరమని అన్నారు.
ఈ నేపథ్యంలో భారత్-శ్రీలంక సిరీస్ జరిగితే అది రెండు జట్లకూ వరల్డ్ కప్‌కు ముందు సరైన ప్రిపరేషన్ అవుతుంది.
-
Home
-
Menu