హ్యాపీ బర్త్డే ఎస్వీ కృష్ణారెడ్డి

తూర్పు గోదావరి జిల్లా నుండి మద్రాస్ వెళ్లిన ఎస్వీ కృష్ణారెడ్డి, నటుడిగా సినీ జీవితం మొదలుపెట్టినా, దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించారు. ‘కొబ్బరి బోండాం‘ సినిమాతో కథకుడిగా మారిన ఆయన, ‘రాజేంద్రుడు గజేంద్రుడు‘ సినిమాతో దర్శకుడిగా విజయవంతమైన అరంగేట్రం చేశారు.
ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో కథే హీరో. అతిశయోక్తులు లేని, హృదయాన్ని తాకే కథనాలతో, హాస్యాన్ని ఆరోగ్యంగా పండించే కథలతో ఆయన ప్రేక్షకులను మెప్పించారు. రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి మిడిల్ రేంజ్ హీరోలతో కలిసి విజయాల పరంపర కొనసాగించారు.
ఫ్లాపుల మధ్య ఇబ్బంది పడుతున్న సూపర్ స్టార్ కృష్ణతో ‘నెంబర్ వన్’ సినిమాను రూపొందించి మళ్లీ అతన్ని స్టార్డమ్కు చేర్చిన ఘనత ఎస్వీకే దక్కుతుంది. అదే సమయంలో అలీతో చేసిన ‘యమలీల’ సినిమా ఇండస్ట్రీ హిట్గా నిలిచింది.
‘శుభలగ్నం, మావి చిగురు‘ లాంటి కుటుంబ కథా చిత్రాలతో ఎస్వీ కుటుంబ ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. భార్య భర్తల మధ్య బంధాన్ని సున్నితంగా చిత్రీకరించిన ఈ సినిమాలు, ఆయనకు బాపు, జంధ్యాల తరహా దర్శకుడిగా గుర్తింపు తెచ్చాయి.
అయితే, టాప్ హీరోలతో చేసిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. తాను హీరోగా నటించిన ‘ఉగాది, అభిషేకం’ వంటి సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక తన స్వంత సంగీతంతో సినిమాల్లో పాటల్ని అద్భుతంగా మిళితం చేసిన ఎస్వీ, దర్శకత్వంతో పాటు సంగీత దర్శకత్వంలోనూ తనదైన ముద్ర వేశారు.
ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాలంటే కుటుంబ సమేతంగా చూడదగిన చిత్రాలు అన్న ముద్ర మాత్రం ఎప్పటికీ చెరగదు. ఈరోజు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేస్తుంది తెలుగు 70 ఎమ్.ఎమ్.
-
Home
-
Menu