బాక్సాఫీస్ వద్ద బాలయ్య Vs రవితేజ!

ప్రస్తుతం తెలుగులో రీ-రిలీజుల ట్రెండ్ జోరుగా కొనసాగుతుంది. ఈనెలలో ఆడియన్స్ ముందుకు వచ్చిన ప్రభాస్ 'సలార్' రీ-రిలీజులోనూ కోట్ల వర్షం కురిపిస్తుంది. ఇక ఏప్రిల్ మొదటి వారంలో మళ్లీ పాత సినిమాలు సరికొత్తగా థియేటర్లలోకి వస్తున్నాయి. ఈకోవలో ఒక్క రోజు గ్యాప్ లో థియేటర్లలోకి రాబోతున్నాయి రెండు క్లాసిక్ మూవీస్.
తెలుగు సినిమా పరిశ్రమలో సైన్స్ ఫిక్షన్ సినిమాలకు బాలకృష్ణ 'ఆదిత్య 369' ఒక మార్గదర్శక చిత్రంగా నిలిచింది. టైమ్ మెషీన్ బ్యాక్‌డ్రాప్ లో గతం, వర్తమానం, భవిష్యత్ మూడు కాలాల కథతో సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాని అద్భుతంగా మలిచారు. ఇళయరాజా సంగీతం ఈ చిత్రానికి ప్రాణంగా నిలిచింది.
ముందుగా వర్తమానం.. ఆ తర్వాత గతంలో శ్రీకృష్ణదేవరాయుల కాలాన్ని దర్శించడం, అనంతరం భవిష్యత్ లో అణ్వాయుధాల ప్రభావంతో ప్రపంచం ఎలా మారుతుందో చూపించడం వంటివి ఈ సినిమాని ఎంతో ప్రత్యేకంగా నిలిపాయి. ఈ చిత్రంలో రెండు పాత్రల్లో బాలకృష్ణ నట విశ్వరూపం చూపించాడు. శ్రీదేవి మూవీస్ నిర్మించిన 'ఆదిత్య 369' ఏప్రిల్ 4న 4కె వెర్షన్ లో మళ్లీ థియేటర్లలోకి వస్తోంది.
ఇక మాస్ మహారాజా రవితేజ తన ప్రేక్షకులకు ఎప్పుడూ ఎనర్జీ, వినోదం పంచే సినిమాలు అందిస్తుంటాడు. అయితే ‘నా ఆటోగ్రాఫ్: స్వీట్ మెమరీస్’ చిత్రంతో మాస్ రాజా కొంచెం విభిన్నమైన ఎమోషనల్ జర్నీతో అలరించాడు.
ఈ సినిమా రవితేజ కెరీర్‌లో ప్రత్యేకమైనదిగా నిలిచింది. బాల్యం నుంచి యవ్వనం వరకు ఓ మనిషి జీవిత ప్రయాణాన్ని, ప్రేమను, విరహాన్ని, జ్ఞాపకాలను హృద్యంగా ఆవిష్కరించిన కథ ఇది. ఈ సినిమా మన జీవితంలోని పాత జ్ఞాపకాలను తిరిగి తెస్తుంది. అప్పటి ముచ్చట్లు, తొలి ప్రేమ, స్నేహాలు వంటి భావోద్వేగాలను గుర్తుకు తెస్తుంది. అందుకే ‘నా ఆటోగ్రాఫ్: స్వీట్ మెమరీస్’ సినిమా రవితేజ అభిమానులకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది.
'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్' మూవీ ఏప్రిల్ 5న మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. మొత్తంగా ఒక్క రోజు గ్యాప్ లో బాలకృష్ణ 'ఆదిత్య 369', రవితేజ 'నా ఆటోగ్రాఫ్' మూవీస్ బాక్సాఫీస్ వద్ద పోటీకి సిద్ధమవుతున్నాయి.
-
Home
-
Menu