బాలీవుడ్ సీనియర్ సింగర్ వివాదం.. వెల్లువెత్తుతున్న విమర్శలు

బాలీవుడ్ సీనియర్ సింగర్ వివాదం.. వెల్లువెత్తుతున్న విమర్శలు
X
పాట పాడుతూనే ఉదిత్ నారాయణ్ వారిని దగ్గరికి రప్పించి.. ముగ్గురు మహిళా అభిమానుల బుగ్గలపై ముద్దులు పెట్టారు.

ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ తన అభిమానులతో ప్రవర్తించిన తీరుపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల ముంబయిలో జరిగిన ఓ సంగీత కచేరీలో ఆయన మహిళా అభిమానుల‌కు ముద్దులు పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఒక కచేరీలో ‘టిప్ టిప్ బర్సా పానీ’ పాటను ఆలపిస్తున్న సమయంలో, కొందరు మహిళా అభిమానులు వేదికకు చేరుకొని ఆయనతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో.. పాట పాడుతూనే ఉదిత్ నారాయణ్ వారిని దగ్గరికి రప్పించి.. ముగ్గురు మహిళా అభిమానుల బుగ్గలపై ముద్దులు పెట్టారు.

ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ఆయన ప్రవర్తనపై నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ‘‘ఇది అసహ్యకరం’’ అని కొందరు వ్యాఖ్యానిస్తే, ‘‘గతంలోనూ ఇలాగే ప్రవర్తించారు’’ అని మరికొందరు అంటున్నారు. ‘‘ఉదిత్ నారాయణ్ ది లెజెండ్ కాదా..? కానీ ఇప్పుడు ఈ ప్రవర్తన చూస్తుంటే తార్కీ అనిపిస్తోంది..’’ అంటూ విమర్శలు వెల్లువెత్తాయి. అయితే ఈ వివాదంపై ఉదిత్ నారాయణ్ ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

అభిమానులపై తనకున్న ప్రేమను వ్యక్తీకరించేందుకే ఆలా చేశానని ఆయన వివరించారు. "నాకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. కొందరు దీనిని కావాలనే వివాదంగా మార్చుతున్నారు" అని ఉదిత్ నారాయణ్ స్పష్టం చేశారు. "నా అభిమానులు నన్ను ఎంతో అభిమానంగా చూస్తారు. కొందరు కరచాలనం చేయాలనుకుంటే, మరికొందరు ప్రేమతో ముద్దు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది కేవలం ఆత్మీయతకు సంబంధించిన అంశం. నేను సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తిని. ఎవరితోనూ తప్పుడు ప్రవర్తన చేయాలనే ఉద్దేశం నాకు లేదు" అని ఆయన వెల్లడించారు.

Tags

Next Story