విశాల్ – ధన్సిక ప్రేమకథ

విశాల్ – ధన్సిక ప్రేమకథ
X
యాక్షన్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య సంబంధం ఉందంటూ ఊహాగానాలు ఊపందుకోగా, చివరకు తామిద్దరం ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నామని స్వయంగా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

యాక్షన్ స్టార్ విశాల్, హీరోయిన్ సాయి ధన్సిక పెళ్లి చేసుకోబోతున్నారు. గత కొన్ని రోజులుగా వీరిద్దరి మధ్య సంబంధం ఉందంటూ ఊహాగానాలు ఊపందుకోగా, చివరకు చెన్నైలో జరిగిన ‘యోగీ దా‘ సినిమా ఈవెంట్ వేదికగా తామిద్దరం ఆగస్టు 29న పెళ్లి చేసుకోబోతున్నామని స్వయంగా ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. విశాల్ పుట్టిన రోజునే వీరి వివాహం జరగబోతుండడం గమనార్హం.

తమ మధ్య పరిచయం ప్రేమగా మారిందని ఇద్దరూ తెలిపారు. ‘విశాల్ ఎప్పుడూ ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను‘ అని ధన్సిక చెప్పగా, ‘మేం కలిసి అద్భుతమైన జీవితాన్ని ప్రారంభించబోతున్నాం‘ అని విశాల్ అన్నాడు. అలాగే ధన్సిక మంచి నటి మాత్రమే కాదు, మంచి వ్యక్తిత్వం గలదని విశాల్ ఆమెను ప్రశంసించాడు. పెళ్లి తర్వాత కూడా ఆమె నటన కొనసాగుతుందని స్పష్టంగా తెలిపాడు.

ఇక సాయి ధన్సిక తమిళనాడులోని తంజావూరులో 1990 నవంబర్ 20న జన్మించింది. సూపర్‌స్టార్ రజనీకాంత్‌ ‘కబాలి‘ సినిమాలో ఆయన కుమార్తె పాత్ర ద్వారా విపరీతమైన గుర్తింపు పొందింది ధన్సిక. ఆ తర్వాత ‘షికారు, అంతిమ తీర్పు, దక్షిణ‘ వంటి తెలుగు చిత్రాలలోనూ నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది.

మరోవైపు విశాల్‌కు సంబంధించి గతంలో పలు రూమర్లు వెలువడ్డాయి. ముఖ్యంగా నటీమణి వరలక్ష్మి శరత్ కుమార్‌తో ఆయనకు సంబంధం ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. అలాగే లక్ష్మీ మీనన్ వంటి హీరోయిన్స్ పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. అయితే వాటన్నింటికీ చెక్ పెడుతూ, నడిగర్ సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని వెల్లడించిన విశాల్, ఇప్పుడు తన జీవిత భాగస్వామిగా ధన్సికను ప్రకటించడం సినీ వర్గాల్లో సంచలనంగా మారింది.

Tags

Next Story