'తండేల్' మూవీ రివ్యూ

తండేల్ మూవీ రివ్యూ
X

నటీనటులు: నాగ చైతన్య అక్కినేని, సాయి పల్లవి, దివ్య పిళ్ళై, ఆడుకాళం నరేన్, కరుణాకరన్ తదితరులు

సినిమాటోగ్రఫీ: షామ్ దత్

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

ఎడిటింగ్‌: నవీన్ నూలి

నిర్మాత: బన్నీ వాసు

దర్శకత్వం: చందూ మొండేటి

విడుదల తేది: 07-02-2025

నాగచైతన్య మోస్ట్ అవైటింగ్ మూవీ 'తండేల్' ఈరోజు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజయ్యింది. నాగచైతన్యకి జోడీగా సాయిపల్లవి నటించింది. గీతా ఆర్ట్స్ పై చందూ మొండేటి తెరకెక్కించిన ‘తండేల్‘ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ అంచనాలను అందుకుందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

రాజు(నాగ చైతన్య), బుజ్జి తల్లి (సాయి పల్లవి) చిన్నప్పటినుంచి ఒకరంటే ఒకరికి ఇష్టం. మచ్చలేశం అనే ఊరు వాళ్ళు గుజరాత్ కు తొమిది నెలలు పాటు సముద్రం మీద చేపల వేటకు వెళ్లి డబ్బులు సంపాదించి వస్తూ ఉంటారు. రాజు వాళ్ళ నాన్న కూడా అదే పని చేసేవాడు. రాజు కూడా అలాగే వెళ్లేవాడు. రాజు వేటకు వెళ్ళిన నెలలు బుజ్జి తల్లి రాజుని గుర్తు చేసుకుంటూ గడిపేస్తుంది.

తెలిసిన వాళ్లలో ఒకరు వేటకు వెళ్లి చనిపోవడంతో బుజ్జి తల్లికి రాజుకి కూడా ఏమైనా అవుతుందేమో అని కంగారు పడి వేటకు వెళ్లొద్దు అంటుంది. కానీ రాజు, బుజ్జి తల్లి మాట వినకుండా తనని నమ్ముకున్న మత్స్యకారుల కోసం వేటకు వెళ్తాడు. దీంతో బుజ్జి తల్లి రాజుని దూరం పెడుతుంది.

తన మాట వినకుండా వేటకు వెళ్ళిపోయాడని రాజుని మర్చిపోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది బుజ్జి తల్లి. పెళ్లి సంబంధం కూడా ఓకే చేస్తుంది. అంతలో రాజు, అతనితో వెళ్లిన వాళ్ళు అంతా సముద్రంలో తుఫాను రావడంతో అనుకోకుండా పాకిస్తాన్ జలాల్లోకి వెళ్లి అక్కడి నేవి ఆఫీసర్స్ కి చిక్కి పాకిస్తాన్ జైలుకి వెళ్తారు. మరి రాజు, మిగిలిన మత్య్సకారులు పాకిస్థాన్ జైల్లో ఎలాంటి ఇబ్బందులు పడ్డారు? వాళ్ల కోసం బుజ్జితల్లి ఏం చేసింది? అనేది మిగతా కథ.

విశ్లేషణ :

శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన 22 మంది మత్స్యకారులు గుజరాత్‌కు వేటకు వెళ్లి, అనుకోకుండా పాకిస్థాన్ సముద్ర జలాల్లోకి ప్రవేశించి అక్కడి అధికారులకు పట్టుబడిన వాస్తవ సంఘటన ‘తండేల్‘ చిత్రానికి ప్రేరణ.

తెలుగు ప్రేక్షకులకు ఇలాంటి కథలు కొత్తేమీ కాకపోయినా, ‘తండేల్‘ కథనంలో ఉండే నిజమైన భావోద్వేగాలు, శ్రీకాకుళం యాస, అక్కడి జీవన విధానం, మత్స్యకారుల పోరాటం వంటి అంశాలను దర్శకుడు చందూ మొండేటి అత్యంత సహజంగా మలిచాడు.

ఫస్ట్ హాఫ్ మొత్తం రాజు (నాగ చైతన్య) – బుజ్జితల్లి (సాయి పల్లవి) ప్రేమకథ, వారి మధ్య దూరం, రాజు వేటకు వెళ్లడం వంటి అంశాలను చక్కగా మలిచాడు డైరెక్టర్ చందూ మొండేటి. ఇంటర్వెల్‌లో రాజు ఇతర మత్స్యకారులు పాకిస్థాన్ అధికారులకు చిక్కిన షాక్ మూమెంట్ ఆసక్తిని రేకెత్తిస్తుంది.

సెకండ్ హాఫ్‌లో ప్రధానంగా మత్స్యకారుల జైలు జీవితాన్ని, బుజ్జితల్లి, ఊరి ప్రజలు వారిని వెనక్కి తీసుకొచ్చేందుకు చేసిన కృషిని ఎమోషనల్ కోణంలో చూపించారు. పాకిస్థాన్ జైలు సన్నివేశాలు కొంత సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నా, చివరి అరగంట ఆకట్టుకుంటుంది.

నాగ చైతన్య – సాయి పల్లవి మధ్య ప్రేమకథ హృదయాన్ని హత్తుకునేలా ఉంటుంది. వారి ప్రేమలోని నిస్సహాయత, దూరం వల్ల వచ్చే ఆవేదనను దర్శకుడు గొప్పగా చూపించాడు. చేపల వేట సన్నివేశాలు కూడా అత్యంత సహజంగా తెరకెక్కించారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు :

ఈ సినిమాలోని నాగ చైతన్య ను కొత్త కోణంలో చూస్తాము. ఇప్పటివరకూ లవర్ బాయ్ గా ఆకట్టుకున్న చైతూ.. ఈ సినిమాలో జాలరిగా, ప్రేమికుడిగా, నాయకుడిగా విభిన్న కోణాలో ఆకట్టుకుంటాడు. ముఖ్యంగా పాకిస్తాన్ జైలులో ప్రేయసి కోసం తను అనుభవించే బాధను అద్భుతంగా ప్రదర్శించాడు. సహజమైన నటనకు మారుపేరు సాయిపల్లవి. ముఖ్యంగా ఈ సినిమాలోని భావోద్వేగ సన్నివేశాల్లో ఆమె హావభావాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఆడుకాళం నరేన్, దివ్య పిళ్ళై, కరుణాకరన్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

చందూ మొండేటి కథ, పాత్రలు చాలా బలంగా రాశాడు. ప్రతి పాత్రకు తనదైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా పాకిస్థాన్ జైలు సన్నివేశాలు సినిమాటిక్ లిబర్టీ ఉన్నప్పటికీ, చివరి అరగంటలో ప్రేమ, బాధ్యత, నాయకత్వం అన్నీ మిళితమై హార్ట్ టచింగ్ ఎమోషన్ క్రియేట్ చేస్తాయి. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం బ్యాక్‌బోన్ అని చెప్పొచ్చు. ప్రేమకథా చిత్రాలకు ప్రత్యేకమైన మ్యూజిక్ కంపోజ్ చేసే డి.ఎస్.పి. 'తండేల్' కోసం పాటలే కాదు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొట్టాడు. సినిమాటోగ్రఫీ విషయానికొస్తే సముద్ర దృశ్యాలు, మత్స్యకారుల జీవితంను ఎంతో సహజంగా చూపించాడు షామ్ దత్. గీతా ఆర్ట్స్ ప్రొడక్షన్ వేల్యూస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

చివరగా :

‘తండేల్‘ – ప్రేమ, వేదన, పోరాటం!

Tags

Next Story