'సింగిల్' రివ్యూ

సింగిల్  రివ్యూ
X
శ్రీవిష్ణు హీరోగా కార్తిక్‌రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం '#సింగిల్‌'. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవిష్ణుకి జోడీగా కేతిక శర్మ, ఇవానా నటించారు.

నటీనటులు: శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా, వెన్నెల కిషోర్ తదితరులు

సినిమాటోగ్రఫీ: ఆర్. వేల్‌రాజ్ ISC

సంగీతం: విశాల్ చంద్రశేఖర్

ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్.

నిర్మాతలు: విద్యా కొప్పినీడి, భాను ప్రతాప & రియాజ్ చౌదరి (గీతా ఆర్ట్స్ & కళ్యా ఫిల్మ్స్)

దర్శకత్వం: కార్తీక్ రాజు

విడుదల తేది: మే 9, 2025

శ్రీవిష్ణు హీరోగా కార్తిక్‌రాజు దర్శకత్వంలో రూపొందిన చిత్రం '#సింగిల్‌'. రొమాంటిక్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీవిష్ణుకి జోడీగా కేతిక శర్మ, ఇవానా నటించారు. ఇతర కీలక పాత్రలో వెన్నెల కిషోర్ కనిపించాడు. గీతా ఆర్ట్స్ వంటి బడా ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఈరోజే (మే 9) 'సింగిల్' ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరి.. ఈ చిత్రం ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

విజయ్ (శ్రీవిష్ణు) ఓ బ్యాంక్ ఉద్యోగి. స్నేహితుడు అరవింద్ (వెన్నెల కిషోర్)తో కలిసి సింగిల్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటాడు విజయ్. ఇంతలో విజయ్ జీవితంలోకి అడుగుపెడుతుంది పూర్వ (కేతిక శర్మ). ఓరోజు మెట్రోలో పూర్వ ను చూసిన విజయ్.. ప్రేమలో పడిపోతాడు.

ఆమె మనసు గెలవడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. కార్ షోరూంలో ఆమె పని చేస్తుందని తెలిసి, తాను కార్ కొనబోతున్నట్టు నమ్మిస్తూ దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. చివరకు ప్రపోజ్ చేసే సమయంలో, పూర్వ అసలు విషయం తెలుసుకుని అతని మీద కోపంతో వెళ్లిపోతుంది.

మరోవైపు విజయ్ అనుకోకుండా హరిణి (ఇవానా) అనే అమ్మాయిని కలుస్తాడు. హరిణికి విజయ్ అంటే ఇష్టం. అలా ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ చివరకు ఎలాంటి మలుపులు తీసుకుంది? విజయ్ ఎవరితో జీవితాన్ని కొనసాగించాడో తెలుసుకోవాలంటే? సినిమా చూడాల్సిందే!

విశ్లేషణ:

సాధారణంగా ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనగానే మనకు వచ్చేసే ఊహ – ఒక హీరో, ఇద్దరు హీరోయిన్లు, ప్రేమ, తర్జనభర్జన, చివరికి ఎవరు ఎవరిని ప్రేమిస్తారు? హీరో ఎవరితో ఉంటాడు? అనే ప్రశ్నలు. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ చూసినప్పుడే ఇదొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ అని అర్థమయ్యింది.

అయితే ఈ సినిమా కథను దర్శకుడు మలిచిన విధానం ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది. దర్శకుడు రెండు గంటల్లో ఎక్కడా బోర్ కొట్టకుండా స్పీడ్ రన్ చేశాడు. దర్శకుడు రాసిన కథకు, నందు, భాను అందించిన డైలాగ్స్ బాగున్నాయి.

పూర్వ తో విజయ్ ప్రేమలో పడటం, ఆమెను పొందేందుకు చేసే ప్రయత్నాలు కొత్తగా కనపడకపోయినా ఆసక్తిగా ఉంటాయి. ఇక హరిణి పాత్ర మాత్రం సినిమా అంతా ఓ నవ్వుల ప్రవాహంగా సాగింది. ఫస్ట్ హాఫ్ ఎంతో ఆసక్తిగా సాగుతుంది, ఎక్కడా బోర్ అనిపించదు. కానీ సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ ట్రాక్‌ని బలవంతంగా ఇరికించినట్టు అనిపిస్తుంది.

క్లైమాక్స్ అయితే పూర్తిగా ట్విస్టుల పరంపరే. గెస్ట్ అప్పీరెన్సులతో పాటు, కామెడీని గట్టిగా పేల్చే సన్నివేశాలు అదిరిపోయాయి. సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే డైలాగ్స్‌ను చక్కగా ఇరికించి, ప్రెజెంట్ జనరేషన్‌ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:

శ్రీవిష్ణు ఇటీవలి కాలంలో ఎంపిక చేసుకునే సబ్జెక్ట్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే కథలను ఎంచుకుంటూ, యూత్‌కి కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేస్తున్నాడు. 'సింగిల్' చిత్రం కూడా అదే కోవలోకి వస్తుంది. శ్రీ విష్ణు ఈ చిత్రంలో విజయ్ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశాడు. అతని డైలాగ్ డైలివరీ, కామెడీ టైమింగ్, వన్‌లైనర్స్ సినిమా ఆద్యంతం అలరిస్తాయి.

ముఖ్యంగా శ్రీవిష్ణు, వెన్నెల కిషోర్ ఇద్దరూ మంచి కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేశారు. వెన్నెల కిషోర్ కామెడీ ఈ సినిమాకి మరో అదనపు ఆకర్షణ. కేతిక శర్మ 'పూర్వ' పాత్రలో కనిపించింది. మొదట్లో ఆమె పాత్ర మామూలుగానే అనిపించినా, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆమె నటన మెప్పించింది. ఇక ‘లవ్ టుడే’ ద్వారా గుర్తింపు పొందిన ఇవానా, ఈ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. చురుకైన పాత్రలో ఇవానా ఎనర్జీ, కామెడీ టైమింగ్ బాగున్నాయి.

సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఓ చిన్న పాత్రలో కనిపించి, తక్కువ సమయంలోనే మంచి ఎమోషన్ పండించారు. తమిళ్ కమెడియన్ విటివి గణేష్ పాత్ర కూడా సినిమాకు మంచి హాస్యాన్ని అందించింది.

ఈ సినిమా టెక్నికల్‌గా అంశాలు బలంగా నిలిచాయి. సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌లోనే విజువల్‌ స్ప్లెండర్‌ను ఆవిష్కరించింది. పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా ఎమోషనల్, ఎలివేషన్ సీన్స్ లో మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది. ప్రెజెంట్ ట్రెండ్‌ను గుర్తించి, యూత్ ను ఆకట్టుకునేలా డైలాగ్స్ రాశారు. స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో రచయితల కృషిని మెచ్చుకోకుండా ఉండలేం. గీతా ఆర్ట్స్ నిర్మాణ విలువలు ఈ చిత్రాన్ని మరో స్థాయిలో నిలబెట్టాయి. నిర్మాణ విలువలు ప్రతీ ఫ్రేమ్‌లో స్పష్టంగా కనిపిస్తాయి.

చివరగా:

'సింగిల్'.. ఫ్యామిలీతో వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు.

Telugu 70mm Rating: 3/5

Tags

Next Story