'రాబిన్ హుడ్' రివ్యూ

రాబిన్ హుడ్  రివ్యూ
X
యూత్ స్టార్ నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘రాబిన్ హుడ్‘. 'భీష్మ' వంటి విజయం తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కిన సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ కి జోడీగా శ్రీలీల నటించింది.

నటీనటులు: నితిన్, శ్రీలీల, డేవిడ్ వార్నర్ దేవదత్త నాగే, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, శుభలేఖ సుధాకర్, షైన్ టామ్ చాకో, లాల్ తదితరులు

సినిమాటోగ్రఫీ: సాయి శ్రీరామ్

సంగీతం: జీవి ప్రకాష్

ఎడిటింగ్‌: కోటి

నిర్మాతలు: మైత్రి మూవీ మేకర్స్

దర్శకత్వం: వెంకీ కుడుముల

విడుదల తేది: 28-03-2025

యూత్ స్టార్ నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్‌లో రూపొందిన చిత్రం ‘రాబిన్ హుడ్‘. 'భీష్మ' వంటి విజయం తర్వాత వీరిద్దరి కలయికలో తెరకెక్కిన సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో నితిన్ కి జోడీగా శ్రీలీల నటించింది. ఇప్పటికే ఈ మూవీ ప్రమోషన్స్ లో అదరగొట్టింది టీమ్. మరి.. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘రాబిన్ హుడ్‘ ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

రామ్ (నితిన్) తన అనాథాశ్రమం కోసం రాబిన్ హుడ్‌లా మారిన యువకుడు. చిన్నతనం నుంచే దొంగతనాలు చేస్తూ, ఎవరికీ తెలియకుండా తన వాళ్ల అవసరాలు తీర్చుకుంటూ ఉంటాడు. కాలానుగుణంగా అతడు హై ప్రొఫైల్ వ్యక్తుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుంటూ, తనదైన శైలిలో దొంగతనాలు చేస్తుంటాడు.

ఈ తెలివైన దొంగను పట్టుకునేందుకు హోం మినిస్టర్ ఒక స్పెషల్ ఆఫీసర్‌ విక్టరీ వర్గీస్‌ (షైన్ టామ్ చాకో)ను నియమిస్తాడు. కానీ అతని ప్రయత్నాలు విజయవంతం కావు. ఇదే సమయంలో, ఆస్ట్రేలియాలోని ప్రముఖ వ్యాపారవేత్త అభినవ్ వాసుదేవ్ (షిజు) కూతురు నీర (శ్రీలీల) భారతదేశానికి రావాలని అనుకుంటుంది.

నీర ఇండియాకు రావడం, రామ్‌తో ఆమెకున్న అనుబంధం, రుద్రకొండ అనే ప్రాంతంతో వీరి జీవితాలకు ఉన్న సంబంధం ఏమిటి? రుద్రకొండను భయపెట్టే అన్యాయ శక్తులను రామ్ ఎలా ఎదుర్కొన్నాడు? అనేవి కథలో ఆసక్తికర మలుపులు.

విశ్లేషణ

తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడు వెంకీ కుడుములకి తనదైన శైలి ఉంది. వినోదాన్ని ప్రధానంగా మేళవిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునే దర్శకుల్లో ఆయన ఒకడు. ఇక 'రాబిన్‌హుడ్' అనే టైటిల్‌తోనే కథ ఎలా ఉంటుందో అందరికీ ముందే అర్థమైపోతుంది. హీరో దొంగతనాలు చేస్తాడు, కానీ తన కోసం కాదు – అనాథ పిల్లలకో, అవసరంలో ఉన్నవారికో సాయపడటానికి. ఈ సినిమాకీ అదే కథాంశంగా ఉంటుంది. అయితే, కొత్తదనం ఎక్కడా కనిపించదు.

వెంకీ కుడుముల తన పాత చిత్రాలు 'ఛలో, భీష్మ' సినిమాల్లో కనిపించిన మ్యాజిక్ ఇక్కడ మిస్ అయింది. కథ ప్రారంభంలోనే హీరో బాల్యం, అతడు దొంగగా మారాల్సిన పరిస్థితులు చూపించినా, అవి అంతగా ఇంప్రెసివ్‌గా అనిపించవు. దొంగతనాలు కొత్తగా ఉన్నాయా? అంటే అదీ లేదు. దొంగా - పోలీస్ ఆట ఆసక్తికరంగా ఉంటుందేమో అని భావిస్తే, అది కూడా నిరాశ పరుస్తుంది.

సెకండ్ హాఫ్ మొత్తం రుద్రకొండ నేపథ్యంలో సాగుతుంది. అక్కడ భీకరమైన పరిస్థితులు ఉంటాయని చూపించినా, కథకు అంతగా బలమైన మలుపులు రావు. హీరో-విలన్ మధ్య ఆసక్తికరమైన ఢీ అంటే ఢీ సీన్స్ ఉంటాయని అనుకుంటే, అది పూర్తిగా మిస్ అయింది. కొన్ని సంవత్సరాల క్రితం వచ్చిన రవితేజ 'కిక్' మాదిరిగా ఈ కథను ప్రెజెంట్ చేయాలని అనుకున్నారా అన్న సందేహం కలుగుతుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

నితిన్ ఈ సినిమాలో తన స్టైల్, ఎనర్జీతో ఆకట్టుకుంటాడు. ఈ తరహా పాత్రలు ఆయనకు సహజంగానే నప్పుతాయి, అందువల్ల అవలీలగా నటించి మెప్పించాడు. శ్రీలీల పాత్రకూ పెద్ద ప్రాధాన్యం లేకపోవడం నిరాశ కలిగిస్తుంది. ఆమె పాత్ర ప్రధానంగా గ్లామర్, పాటల కోసమే అనిపిస్తుంది. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్ ఎంట్రీతో కాస్త హాస్యం వస్తుంది. బ్రహ్మాజీ, షిజు పాత్రలు కొన్ని సీన్లకే పరిమితమయ్యాయి. డేవిడ్ వార్నర్ క్యారెక్టర్ ది అదే పరిస్థితి.

టెక్నికల్‌గా చూస్తే వెంకీ కుడుమల రచయితగా కొన్ని పంచ్ డైలాగ్స్ తో తన మార్కును చూపించాడు. అయితే కథ, కథనాల విషయంలో ఇంకాస్త కసరత్తు చేయాల్సింది. జీవీ ప్రకాష్ సంగీతం ఫర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని సన్నివేశాలను ఎలివేట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వేల్యూస్ రిచ్ గా ఉన్నాయి.

చివరగా

‘రాబిన్ హుడ్‘.. అన్ని ఎమోషన్స్ కలిపిన డీసెంట్ ఎంటర్టైనర్!

Tags

Next Story