'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' మూవీ రివ్యూ

రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ రివ్యూ
X

నటీనటులు: దీప్‌ రంగనాథన్‌, అనుపమ పరమేశ్వరన్‌, కయాదు లోహర్‌, జార్జ్‌ మరియన్‌, కేఎస్‌ రవికుమార్‌, గౌతమ్‌ వాసుదేవ మేనన్‌, మిస్కిన్‌ తదితరులు

సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి

సంగీతం: లియోన్‌ జేమ్స్‌

ఎడిటింగ్‌: ప్రదీప్ ఈ రాఘవ్

నిర్మాతలు: కల్పాతి ఎస్‌ అఘోరం, కల్పాతి ఎస్‌ గణేష్‌, కల్పాతి ఎస్‌ సురేష్‌

దర్శకత్వం: అశ్వత్‌ మారిముత్తు

విడుదల తేది: 21-02-2025

‘లవ్ టుడే’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హీరో ప్రదీప్ రంగనాథన్. ఈ డైరెక్టర్ కమ్ హీరో ఈరోజు ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

ఒకప్పుడు టాపర్ అయిన డి. రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్), ఇంజినీరింగ్‌లోకి వచ్చిన తర్వాత 'డ్రాగన్ రాఘవన్' గా మారిపోతాడు. సరదా జీవితం కోసం చదువు మర్చిపోయి, ప్రేమ, స్నేహాలతో కాలం గడుపుతాడు. అతని ధోరణిని చూసి కీర్తి (అనుపమ పరమేశ్వరన్) ప్రేమలో పడుతుంది. అయితే కాలేజీ పూర్తయిన తర్వాత నిరుద్యోగిగా మిగిలిపోవడంతో కీర్తి కూడా అతన్ని వదిలి వెళ్లిపోతుంది.

ఆ సంఘటన అతనిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదలతో నకిలీ సర్టిఫికేట్లు తయారు చేసుకుని, మంచి ఉద్యోగం పొందుతాడు. విలాసవంతమైన జీవితం, కారు, ఇల్లు అన్నీ వచ్చాక, పెద్దింటి అమ్మాయి పల్లవి (కయాదు లోహర్)తో పెళ్లికి సిద్ధమవుతాడు.

అయితే ఇదంతా సజావుగా కొనసాగుతుందనుకునే లోపే ఓ పెద్ద ట్విస్ట్! రాఘవన్ నకిలీ సర్టిఫికేట్ వ్యవహారం కాలేజీ ప్రిన్సిపాల్ (మిస్కిన్) కు తెలిసిపోతుంది. కానీ, ఆ రహస్యం బయట పడకుండా ఉండాలంటే ఒక పని చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సూచిస్తాడు.

ఇంతకీ ప్రిన్సిపాల్ రాఘవన్‌ను ఏం చేయమన్నాడు? డ్రాగన్ తన తప్పులను సరిదిద్దుకుని నిజమైన విజేతగా మారాడా? పల్లవితో పెళ్లి జరిగిందా? అనేవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

'లవ్ టుడే'తో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' అంటూ మళ్లీ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌తో వచ్చాడు. కథలో కొత్తదనం లేకపోయినా సరైన కథనంతో ఈ సినిమా అందరినీ బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది. యువత మనస్తత్వానికి తగ్గట్టుగా 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్'ని తీర్చిదిద్దాడు డైరెక్టర్ అశ్వత్.

ఇపుడున్న యూత్ ట్రెండ్ కి తగట్టుగా రాసి తీసిన సన్నివేశాలు బాగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా హీరో ప్రదీప్ రంగనాథ్ కాలేజ్ స్టూడెంట్ గా, ఫ్రస్ట్రేటేడ్ ఎంప్లాయ్ పాత్రలో చక్కగా ఒదిగిపోయాడు. ఈ సినిమాలో అక్కడక్కడా 'లవ్ టుడే' సినిమా ఛాయలు కూడా కనిపిస్తాయి. హీరో ప్రదీప్ రంగనాథన్ క్యారెక్టర్ ను ఎస్టాబ్లిష్ చేసిన విధానం ఎక్సలెంట్ అని చెప్పవచ్చు.

ఫస్టాఫ్‌లో కాలేజీ సన్నివేశాలు నవ్విస్తాయి, కానీ కథనం కొత్తగా అనిపించదు. సెకండాఫ్‌లో అనుకోని ట్విస్టులు కొంత ఆసక్తిని పెంచుతాయి. హీరో – కాలేజీ ప్రిన్సిపాల్ (మిస్కిన్) మధ్య సాగే ఎపిసోడ్స్ హిలేరియస్. చివర్లో మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం ఉన్నప్పటికీ, అది బలంగా వర్కౌట్ కాలేదు. క్లైమాక్స్ మరింత గట్టిగా ప్లాన్ చేసి ఉంటే సినిమా ఇంపాక్ట్ బాగా పెరిగేదనిపిస్తుంది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:

ప్రదీప్ రంగనాథన్ తన పాత్రకు న్యాయం చేస్తూ కామెడీ, యాక్షన్, ఎమోషన్‌ను సమపాళ్లలో పంచాడు. అయితే అతని పోరాట సన్నివేశాల్లో సహజత్వం కనిపించదు. అనుపమ పరమేశ్వరన్ స్క్రీన్ టైమ్ తక్కువే అయినా, బలమైన పాత్ర కావడంతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. కయాదు లోహర్ పాత్రకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ లభించింది. ఆమె గ్లామర్, నటన సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ప్రిన్సిపల్ పాత్రలో మిస్కిన్ హాస్యంతో పాటు తీవ్రమైన సన్నివేశాల్లో ఆకట్టుకున్నాడు.

దర్శకుడు అశ్వత్ మారిముత్తు బాగా తెలిసిన కథను తీసుకొని, కొన్ని కొత్త అంశాలు జోడించి ఆసక్తికరంగా తెరకెక్కించాడు. క్యాంపస్ నేపథ్యంలో సాగే ఈ కథకు మ్యూజిక్, సినిమాటోగ్రఫీ కూడా చక్కగా కుదిరాయి.

చివరగా:

‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ - కొత్తదనం తక్కువే కానీ వినోదం పక్కా!

Tags

Next Story