'రామం రాఘవం' మూవీ రివ్యూ

నటీనటులు: సముద్రఖని, ధనరాజ్, హరీష్ ఉత్తమన్, ప్రమోదిని, సత్య, పృథ్వీరాజ్, సునీల్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు
సినిమాటోగ్రఫీ: దుర్గా ప్రసాద్
సంగీతం: అరుణ్ చిల్లివేరు
ఎడిటింగ్: మార్తాండ్ కె.వెంకటేష్
నిర్మాత: పృథ్వీ పోలవరపు
దర్శకత్వం: ధనరాజ్
విడుదల తేది: 21-02-2025
ప్రేక్షకులను కామెడీతో అలరించిన ధనరాజ్ ఇప్పుడు దర్శకుడిగా తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమయ్యాడు. ‘రామం రాఘవం’ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా తనలోని మల్టీటాలెంట్ ను ప్రదర్శించాడు. ఈ చిత్రంలో సముద్రఖని మరో ప్రధాన పాత్రలో కనిపించాడు. ఈరోజు థియేటర్లలో విడుదలకు ముస్తాబైన 'రామం రాఘవం' చిత్రాన్ని ముందుగానే మీడియాకి ప్రదర్శించారు. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
సబ్-రిజిస్ట్రార్ దశరథ రామం (సముద్రఖని) నిజాయితీకి మారుపేరు. ఆయన జీవిత లక్ష్యం తన కొడుకు రాఘవ (ధనరాజ్)కు మంచి భవిష్యత్తును అందించడమే. చిన్నప్పటి నుంచి అతనిని ఎంతో ప్రేమగా పెంచి, డాక్టర్‌గా చూడాలని కలలు కంటాడు. అయితే, రాఘవ తన తండ్రి ఆశయాలకు విరుద్ధంగా, చదువును మధ్యలోనే వదిలేసి చెడువాటాలకు లోనవుతాడు. మద్యం, ధూమపానం అలవాటుగా మార్చుకుని, ఇన్‌స్టెంట్ మనీ కోసం అనేక తప్పులు చేస్తుంటాడు.
ఒక సందర్భంలో, డబ్బు కోసం చేసిన చిన్న తప్పు అతనికి తీవ్ర పరిణామాలను తెచ్చిపెడుతుంది. చట్టాన్ని విశ్వసించే రామం, తన కొడుకు చేసిన తప్పుని క్షమించకుండా, స్వయంగా పోలీసులకు అప్పగిస్తాడు. ఈ ఘటన రాఘవ మనసులో అసంతృప్తిని, ప్రతీకారాన్ని రగిలిస్తుంది. పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చిన రాఘవ, తన తండ్రినే చంపాలని నిర్ణయించుకుంటాడు. అతని ప్రయత్నాల్లో భాగంగా, లారీ డ్రైవర్ దేవా (హరీస్ ఉత్తమన్)తో హత్య కోసం ఒప్పందం కుదుర్చుకుంటాడు.
అయితే, రాఘవ తన దురాగతాన్ని నిజంగా అమలు చేసాడా? దేవా అతనికి సహకరించాడా? తండ్రిని హతమార్చాలనుకున్న రాఘవలో చివరకు ఎలాంటి మార్పు వచ్చింది? రామం తండ్రిగా చివరకు ఏ నిర్ణయం తీసుకున్నాడు? ఈ ఆసక్తికరమైన కథను తెలుసుకోవాలంటే ‘రామం రాఘవం’ సినిమాను చూడాలి.
విశ్లేషణ:
పిల్లలకు తండ్రి వారి ఇంటిపేరు ఇవ్వగలడు, కానీ నిజమైన మంచి పేరు మాత్రం వారు సొంతంగా సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఇదే అంశాన్ని ‘రామం రాఘవం’ చిత్రంలో దర్శకుడు ధనరాజ్ స్పష్టంగా చూపించాడు. నేటి యువతలో కొందరు చెడు అలవాట్లకు బానిసై తల్లిదండ్రుల ప్రేమను అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈజీ మనీ కోసం పెద్ద తప్పులు చేస్తూ, చివరకు డబ్బు కోసమే కన్న తల్లిదండ్రులను కూడా హత్య చేసే స్థాయికి పడిపోతున్నారు.
తండ్రిని చంపాలనే అగాథంలో రాఘవ ఎలా దిగజారిపోయాడు? అతను తీసుకున్న ప్రతి నిర్ణయం వెనుక ఉన్న భావోద్వేగాల్ని దర్శకుడు ధనరాజ్ ఎంతో చక్కగా అందించాడు. ముఖ్యంగా, కథను కేవలం సీన్‌ల సమాహారంగా కాకుండా, ఓ సహజమైన సంఘటనల పరంపరగా మలచిన తీరు ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ హాఫ్‌లో రాఘవ చేసే తప్పులు, తండ్రికి దొరికిపోవడం, వారి మధ్య జరిగే భావోద్వేగ భరిత సంభాషణలు ప్రధానంగా ఉంటాయి. ధనరాజ్ లవ్ ట్రాక్ కాస్త కథను మందకొడిగా మార్చినట్టు అనిపిస్తుంది. కానీ ఇంటర్వెల్ సీన్ మాత్రం ఆసక్తిని రేకెత్తించేలా ఉంది.
సెకండ్ హాఫ్‌లో కథ మరింత ఉత్కంఠభరితంగా మారుతుంది. తండ్రిని చంపాలని రాఘవ నిర్ణయం తీసుకున్న తర్వాత కథపై నిన్నటి కంటే ఎక్కువ ఆసక్తి పెరుగుతుంది. అతని ప్రవర్తనలో అనేక మలుపులు రావడం, ఆ మార్పు నిజమేనా అనే సందేహాలను ప్రేక్షకుల్లో పెంచడం కథను మరింత బలంగా నిలబెడతాయి.
ముఖ్యంగా, చివరి 20 నిమిషాలు ఎమోషనల్‌గా నడుస్తాయి. హాస్పిటల్ సీన్ గుండెను పిండేస్తుంది. క్లైమాక్స్‌ను కాస్త డిఫరెంట్‌గా మలిచిన దర్శకుడి ప్రయత్నం కొంతవరకు ఆకట్టుకుంటుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
సముద్రఖని నటనా ప్రతిభ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ పాత్రలో అయినా ఒదిగిపోతూ, తన నటనతో ఆ పాత్రకు ప్రాధాన్యతను పెంచడంలో ఆయన దిట్ట. ఈ సినిమాలోనూ ‘రామం’ పాత్రలో ఆయన ఆకట్టుకున్నాడు. తండ్రిగా తన బాధను, ప్రేమను, కోపాన్ని సహజంగా వ్యక్తీకరించాడు. ముఖ్యంగా, ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయన నటన ప్రేక్షకులను ప్రభావితం చేయడం ఖాయం.
ఇక ధనరాజ్, ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా, రాఘవ పాత్రలో నటిస్తూ డ్యూయల్ రోల్ పోషించాడు. ఇది అతని తొలి సినిమా అయినా, కథను చాలా బాగా డీల్ చేశాడు. అనవసరమైన సన్నివేశాలను జోడించకుండా, తన ప్రధానమైన పాయింట్‌ను నిక్షిప్తంగా తెరపై చూపించేందుకు ప్రయత్నించాడు. దర్శకుడిగా పరిపక్వతను కనబరిచిన ధనరాజ్, నటుడిగానూ రాఘవ పాత్రలో జీవించేశాడు.
ఇంకా హరీశ్ ఉత్తమ్, సత్య, ప్రమోదిని, పృథ్వి రాజ్, సునీల్, మోక్ష, శ్రీనివాస్ రెడ్డి తదితర నటీనటులు కూడా తమ పాత్రల పరిమితిలోనే మంచి ప్రదర్శన ఇచ్చారు. హరీశ్ ఉత్తమ్ పాత్ర నిడివి తక్కువైనా, తన నటనతో ప్రాభవాన్ని చూపించగలిగాడు. సత్య తనదైన హాస్యంతో సినిమా మూడ్‌ను లైట్‌గా మార్చే ప్రయత్నం చేశాడు.
సాంకేతికంగా చూసుకుంటే, అరుణ్ చిల్లివేరు అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలాన్ని అందించింది. పాటలు భారీ స్థాయిలో ఆకట్టుకునేలా లేకపోయినా, కథా ప్రవాహానికి అడ్డంకిగా మారలేదు. దుర్గా ప్రసాద్ సినిమాటోగ్రఫీ సినిమాకు అనుగుణంగా ఉంటుంది. సినిమా స్థాయికి తగ్గట్టు నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
చివరగా:
‘రామం రాఘవం’.. పితృ ప్రేమ vs పుత్ర ద్వేషం
-
Home
-
Menu