‘పొన్మాన్’ రివ్యూ

‘పొన్మాన్’  రివ్యూ
X

చిత్రం : ‘పొన్మాన్’

ఓటీటీ స్ట్రీమింగ్ తేదీ : మార్చ్ 14, 2025

ఓటీటీ ప్లాట్ ఫామ్ : జియో హాట్ స్టార్

నటీనటులు : బేసిల్ జోసెఫ్, సజిన్ గోపు, లిజో మోల్ జోస్, దీపక్ పరంబోల్, రాజేశ్ శర్మ, జయా కరుప్, సంధ్యా రాజేంద్రన్ తదితరులు

సినిమాటోగ్రఫీ : సనూ జాన్ వర్గీస్

సంగీతం : జెస్టిన్ వర్గీస్

నిర్మాణం : అజిత్ వినాయకన్ ఫిల్మ్స్

దర్శకత్వం : జోతిష్ శంకర్

'జయ జయ జయ జయహే', 'సూక్ష్మదర్శిని' వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన బేసిల్ జోసెఫ్ నటించిన తాజా మలయాళ చిత్రం 'పొన్మాన్'. మార్చి 14న జియో హాట్‌స్టార్‌ ఓటీటీలో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? తెలుగు ప్రేక్షకులకు ఏ మేరకు కనెక్ట్ అవుతుంది అనే విషయాలు ఈ రివ్యూలో తెలుసుకుందాం...

కథ:

అజేష్ (బేసిల్ జోసెఫ్) ఒక బంగారు నగల అమ్మకపు ఏజెంట్. అతను వివాహాది శుభకార్యాలు జరిగే ఇళ్లలో అప్పుగా బంగారు నగలు అందజేస్తాడు. వివాహ సమయంలో వచ్చిన బహుమతుల నుంచి తనకు రావాల్సిన భాగాన్ని తీసుకుంటాడు. స్టెఫీ (లిజోమోల్ జోస్) పెళ్లి కోసం బ్రూనో (ఆనంద్ మన్మథన్) కుటుంబం అజేష్ నుండి 25 సవర్ల బంగారం తీసుకుంటుంది. కానీ, చదివింపుల ద్వారా వచ్చిన డబ్బు 13 సవర్లకు మాత్రమే సరిపోతుంది. మిగతా 12 సవర్లను తిరిగి పొందేందుకు అజేష్ చేసే ప్రయత్నాలే మిగతా కథ.

కథాకథనాల విశ్లేషణ:

పొన్‌మాన్' కథ సాదాసీదా పాయింట్‌ను ఆధారంగా తీసుకొని, రెండు గంటల పాటు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా రూపొందించబడింది. దర్శకుడు జోతిష్ శంకర్, రచయితలు జీఆర్ ఇందుగోపన్, జస్టిన్ మాథ్యూ చిన్న పాయింట్‌ను తీసుకొని, అద్భుతమైన స్క్రీన్‌ప్లే ద్వారా కథను ముందుకు తీసుకెళ్లారు. ప్రతి పాత్రను సహజంగా చూపించడంలో వారు సఫలీకృతులయ్యారు.

సినిమా పూర్తి నెమ్మదిగా నడుస్తుంది. మలయాళ సినిమాల్లో సహజత్వం, నెమ్మదైన కథనానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఇది అందరికీ నచ్చకపోవచ్చు కానీ ఎవరైతే ఈ తరహా కథనాన్ని ఆస్వాదిస్తారో, వారికి సినిమా బాగా కనెక్ట్ అవుతుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

అజేష్ పాత్రలో తన సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు బేసిల్ జెసెఫ్ . అతడి భావోద్వేగాల ప్రదర్శన ప్రతి దృశ్యంలోనూ చాలా బలంగా ఉంటుంది. స్టెఫీ పాత్రలో లిజోమోల్ జోస్ అద్భుతంగా నటించింది. ఆమె పాత్ర చిన్నదైనా కథలో కీలకంగా ఉంటుంది. బ్రూనో పాత్రలో ఆనంద్ మన్మథన్ ధీటైన ప్రదర్శన ఇచ్చాడు. అతని నాటకీయత కథలో ముఖ్యమైన మలుపుల్ని తెస్తుంది.

సాంకేతిక అంశాలు:

దర్శకుడు జోతిష్ శంకర్ కథను సహజంగా, నెమ్మదిగా నడిపించినా.. ప్రేక్షకులను ఉత్కంఠలో ఉంచడంలో తన మార్కు చూపాడు. సినిమా పూర్తిగా వాస్తవికతను ఆధారంగా చేసుకుని ఉండటంతో చాలా చోట్ల సహజత్వం కనిపిస్తుంది. కథ చెప్పే విధానం కొత్తగా అనిపించకపోయినా, స్క్రీన్‌ప్లేను ఆసక్తికరంగా మలచడం దర్శకుడి ప్రత్యేకత.

విజువల్ ప్రెజెంటేషన్ చాలా సహజంగా ఉంది. గ్రామీణ పరిసరాలను చూపించిన విధానం ప్రశంసించదగినది. నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన బలం. హృదయాన్ని హత్తుకునే సంగీతంతో కథను మరింత బలంగా మలచారు. సినిమా నెమ్మదిగా నడిచినప్పటికీ, అవసరమైన చోట ఎడిటింగ్ మెళకువలు పాటించడంతో కథ అనవసరమైన సన్నివేశాలతో విసుగు కలిగించదు.

ప్లస్ పాయింట్స్ :

బసిల్ జోసెఫ్ సహజమైన నటన

హృదయాన్ని హత్తుకునే కథ

రియలిస్టిక్ మేకింగ్

సహజమైన నేపథ్య సంగీతం

మైనస్ పాయింట్స్ :

కథలో అంతగా కొత్తదనం లేకపోవడం

కథనం చాలా నెమ్మదిగా ఉండడం

కొన్ని సన్నివేశాలు అనవసరం అనిపించడం.

చివరిగా..

‘పొన్‌మాన్’ ఒక వాస్తవిక, భావోద్వేగపూరిత డ్రామా. ఇది అందరికీ నచ్చే సినిమా కాదేమో కానీ సహజత్వాన్ని, సున్నితమైన హ్యూమర్‌ని, మంచి కథనాన్ని ఆస్వాదించే ప్రేక్షకులకు మాత్రం ఇది తప్పక నచ్చుతుంది. ఓటీటీలో వీక్షించదగిన చిత్రం.

Tags

Next Story