‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ రివ్యూ

‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’  రివ్యూ
X

చిత్రం : ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ (తెలుగు)

విడుదల తేదీ : మార్చ్ 14, 2025

నటీనటులు : కుంచాక్కో బోబన్, ప్రియమణి, జగదీష్, విశాఖ్ నాయర్, ఆడుకళాం నరేశ్, వైశాఖ్ శంకర్, మీనాక్షి అనూప్, అజ్మల్ అమీర్ తదితరులు

సినిమాటోగ్రఫీ : రోబీ వర్గస్ రాజ్,

సంగీతం : జేక్స్ బిజాయ్

నిర్మాణం : మార్టిన్ ప్రకాట్ ఫిల్మ్స్

దర్శకత్వం : జీతు అష్రఫ్

క్రైమ్ థ్రిల్లర్‌ జానర్‌లో మంచి ఆసక్తి ఉన్న ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే సినిమా ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’. మలయాళ స్టార్ హీరో కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మలయాళంలో మంచి హిట్ సాధించడంతో తెలుగులోకి అనువాదమైంది. మరి ఈ చిత్రం తెలుగులోనూ అదే స్థాయిలో ఆకట్టుకుంటుందా? అందుకు కారణమైన అంశాలు ఏమిటో ఈ రివ్యూలో తెలుసుకుందాం.

కథ:

హరి శంకర్ (కుంచకో బోబన్) ఒక నిస్వార్థమైన, నిజాయితీ గల పోలీస్ అధికారి. ఒక సాదారణ నకిలీ బంగారు గొలుసు కేసును విచారణ చేస్తున్న సమయంలో.. అనుకోకుండా మరిన్ని హత్యలు, ఆత్మహత్యలు, ఇతర మిస్టీరియస్ కేసులతో సంబంధం ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ కేసును టేకప్ చేయడానికి మొదట హరి శంకర్‌కు పెద్దగా ఆసక్తి ఉండదు. కానీ ఆ తర్వాత.. ఈ కేసు వెనుక ఉన్న నిజాలు అతనికి అర్థమవుతాయి. నేరస్తులను పట్టుకోవడానికి అతను అమలు పరిచిన వ్యూహాలు, ఎదురైన సవాళ్లు, చివరకు అతను ఏం చేసాడు అన్నదే మిగతా కథ.

విశ్లేషణ:

సినిమా ప్రారంభం చాలా సరళంగా ఉంటుంది. ఒక సాధారణ కేసును విచారణ చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ కథగానే మొదలవుతుంది. కానీ కథ క్రమంగా మలుపులు తిరుగుతూ మిస్టరీ అంశాలను పెంచుతుంది. మొదటి అరగంట సినిమా బలమైన ఆసక్తిని రేకెత్తిస్తుంది. నెమ్మదిగా కథలోకి కొత్త క్యారెక్టర్లు ప్రవేశించడం జరుగుతుంది. కథ మిస్టరీ వైపు మళ్లినప్పుడు.. ప్రేక్షకులను థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కుర్చీలకు కట్టేస్తుంది. ఇంటర్వెల్ సమయానికి సినిమా నాటకీయంగా ఓ మలుపు తీసుకుని.. కొత్త కోణాన్ని చూపిస్తుంది. హరి శంకర్ తీసుకున్న ఒక చిన్న నిర్ణయం అతన్ని మరింత పెద్ద ముఠాకు దగ్గరగా తీసుకువెళ్తుంది.

సెకండ్ హాఫ్ కథ కాస్త నెమ్మదిస్తుంది. చాలా ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాలు కథను కాస్త బలహీనంగా చేస్తాయి. కొన్ని సీన్స్ కథను నడిపించడానికి బదులుగా లెంగ్త్ పెంచినట్లు అనిపిస్తుంది. అయితే చివరి 30 నిమిషాల్లో మాత్రం మళ్లీ కథ మంచి మలుపు తీసుకుని ఉత్కంఠ రేకెత్తిస్తుంది. క్లైమాక్స్ చాలా రిచ్‌గా ఉండాల్సిన చోట కొంత పరిమితమైన స్కోప్ ఉన్నట్టు అనిపిస్తుంది. కథను ముందుకు నడిపించే మిస్టరీ వాతావరణం చాలా బాగుంది. మలయాళ సినిమాలకి ఉన్న నేచురల్ నేరేషన్ ఇక్కడ కూడా ఉంది. కథలో పోలీస్ విచారణలను చాలా రియలిస్టిక్‌గా చూపించారు. ఫస్ట్ హాఫ్ మిస్టరీ బిల్డప్ చాలా బాగుంటే.. సెకండ్ హాఫ్ కొంత డల్లు అవుతుంది. చివరి 10 నిమిషాల్లో కథను మరింత ఇంటెన్స్‌గా చేసి ఉంటే బాగుండేది.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

పోలీస్ పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కుంచకో బోబన్ ఈ చిత్రంలో కూడా తన మార్క్ చూపించాడు. హరీష్ శంకర్ పాత్రలో ఆచితూచి మాట్లాడే స్ట్రాంగ్ పోలీస్ ఆఫీసర్‌గా ఆకట్టుకున్నాడు. కొన్నిచోట్ల ఎమోషనల్ గా కూడా కనిపించాడు, అయితే పాత్రలో చాలా చోట్ల స్ట్రైట్‌ఫార్వర్డ్ పోలీస్ గా చూపించడం వల్ల ప్రేక్షకులు అతనికి అంతగా కనెక్ట్ కాలేకపోయే అవకాశముంది.

ప్రియమణి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించారు. అయితే ఆమె పాత్రకు ఎక్కువ స్కోప్ లేదు. కొంతవరకు కథను ముందుకు తీసుకెళ్లే పాత్ర అయినప్పటికీ, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ ఎక్కువ సమయం లేదు. ఈ సినిమాలోని విలన్ పాత్రల్ని బలంగా రాశారు. జగదీష్, విశాక్ నాయర్ వంటి నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. ప్రతినాయకుల క్యారెక్టరైజేషన్ బాగానే ఉన్నప్పటికీ.. వారి వెనుకున్న డెప్త్ మాత్రం పూర్తిగా చూపించలేదు.

సాంకేతిక విభాగం:

జీతూ అష్రఫ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక స్ట్రాంగ్ క్రైమ్ థ్రిల్లర్ గా ఉండాల్సిన చోట కొంత మెల్లగా నడుస్తుంది. కథలోని కొన్ని భాగాలు ఆసక్తికరంగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్ కొంచెం నెమ్మదిగా సాగుతుంది. దీనివల్ల సినిమా మొత్తం కొంత తగ్గిన ఫీలింగ్ కలిగించవచ్చు. రాబీ వర్గీస్ రాజ్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో కొన్ని మంచి విజువల్ షాట్స్ పడ్డాయి.

జేక్స్ బిజోయ్ సంగీతం చిత్రం మూడ్‌కు తగ్గట్టు ఉంది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కొన్ని కీలక సన్నివేశాల్లో బాగా పని చేసింది. అయితే, పాటలు అంతగా గుర్తుండిపోయేలా లేవు. కొన్నిచోట్ల ఎడిటింగ్ మరింత క్రిస్ప్‌గా ఉండాల్సిన అవసరం ఉంది. రెండు మూడు సీన్స్ కథను ఆలస్యం చేసినట్లు అనిపించవచ్చు.

ప్లస్ పాయింట్స్:

కుంచకో బోబన్ నటన

కథలో ఉండే సస్పెన్స్, ట్విస్టులు

విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

మొదటి అర్ధభాగం మంచి పేస్‌లో సాగడం

మైనస్ పాయింట్స్:

కథనం కొంచెం నెమ్మదిగా సాగడం

ప్రియమణి పాత్రకు తక్కువ స్కోప్

కొన్ని చోట్ల లాజిక్ మిస్ అవ్వడం

చివరిగా:

‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ ఒక స్ట్రాంగ్ థ్రిల్లర్ అని చెప్పాలి. కుంచాకో బోబన్ నటన, కొన్ని సస్పెన్స్ మూమెంట్స్ సినిమాను చూడదగినదిగా చేస్తాయి. ఈ సినిమా ఎక్కువగా క్రైమ్ థ్రిల్లర్ లవర్స్‌కి నచ్చే అవకాశం ఉంది. పేషెన్స్ తో చూస్తే కొన్ని ఇంట్రెస్టింగ్ మూమెంట్స్ ఉంటాయి. అయితే, ఫాస్ట్ పేస్డ్ థ్రిల్లర్ కోసం చూస్తున్న వారికి ఇది కొంచెం నెమ్మదిగా అనిపించవచ్చు.

Tags

Next Story