'ఓదెల 2' రివ్యూ

నటీనటులు: తమన్నా భాటియా, హెబ్బా పటేల్, వశిష్ట ఎన్ సింహ, యువ, నాగ మహేష్, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజా రెడ్డి తదితరులు
సినిమాటోగ్రఫీ: సౌందర్ రాజన్. ఎస్
సంగీతం: అజనీష్ లోక్ నాథ్
నిర్మాత: డి మధు
దర్శకత్వం: అశోక్ తేజ
క్రియేటర్: సంపత్ నంది
విడుదల తేది: 17-04-2025
మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో సంపత్ నంది కథతో రూపొందిన చిత్రం ‘ఓదెల 2‘. ‘ఓదెల రైల్వే స్టేషన్‘కి సీక్వెల్ గా ఈ చిత్రం రూపొందింది. ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో కనిపించే తమన్నా ఈ సినిమా కోసం శివశక్తిగా నాగసాధు పాత్రలో కనిపించింది. భారీ అంచనాల మధ్య పాన్ ఇండియా లెవెల్ లో ఈరోజు ‘ఓదెల 2‘ రిలీజయ్యింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ:
‘ఓదెల 2‘ కథ మొదటి భాగం ముగింపు నుంచి ప్రారంభమవుతుంది. రాధ (హెబ్బా పటేల్) తిరుపతి (వసిష్ఠ సింహ)ని చంపి జైలుకు వెళ్తుంది. తిరుపతి మృతదేహాన్ని ఊరివాళ్లు కాల్చకుండా, అతని ఆత్మకు మోక్షం దక్కకుండా చేసేందుకు సమాధి శిక్ష విధిస్తారు. శవాన్ని నిలువుగా పాతిపెట్టి, ఆత్మను బంధించేలా చేస్తారు. దీంతో తిరుపతి ఆత్మ ఊరిపై ప్రతీకారం తీర్చుకోవడం మొదలుపెడుతుంది.
ఆరు నెలల తర్వాత ఊరిలో వివాహాలు జరుగుతాయి. మొదటి భాగంలో తిరుపతి స్వయంగా చేసిన నేరాలను ఇప్పుడు అతని ఆత్మ, ఇతరుల శరీరాల్లోకి ప్రవేశించి, శోభనం రోజు నూతన వధువులను చంపేస్తుంది. మొదట్లో ఈ హత్యలకు ఇతరులే కారణమని భావించిన పోలీసులు, ఊరివాళ్లు వారిని శిక్షిస్తారు. కానీ, తర్వాత ఇవన్నీ తిరుపతి ఆత్మ చేసినవని తెలుస్తుంది.
ఈ సమస్యకు పరిష్కారం కోసం ఊరివాళ్లు జైల్లో ఉన్న రాధను కలుస్తారు. రాధ, తన అక్క భైరవి (తమన్నా) గురించి చెబుతుంది. భైరవి చిన్నతనంలోనే కుటుంబాన్ని విడిచి, శివభక్తితో శివశక్తుల్లో లీనమైంది. ఊరివాళ్లు భైరవిని సంప్రదించి, ఊరిని రక్షించమని వేడుకుంటారు.
భైరవి ఈ సవాలును ఎలా ఎదుర్కొంటుంది? తిరుపతి ఆత్మకు మోక్షం ఎలా లభిస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెరపై చూసి తెలుసుకోవాలి.
విశ్లేషణ:
‘ఓదెల 2‘ మొదటి భాగం సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఉంటే, రెండో భాగం ఆత్మలు, దైవశక్తుల చుట్టూ తిరుగుతూ మరో రకమైన అనుభవాన్ని అందిస్తుంది. సినిమా ఆరంభంలోనే తిరుపతి ఆత్మ హత్యలు చేస్తుందని చూపించడంతో కథ సాధారణ హారర్ కథనంలా అనిపిస్తుంది. అయితే, ఊరివాళ్లకు ఈ దుష్టశక్తి గురించి తెలిసిన తర్వాత కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్‌లో భైరవి (తమన్నా) ప్రవేశంతో సెకండ్ హాఫ్‌పై ఉత్కంఠ పెరుగుతుంది.
సెకండ్ హాఫ్‌లో తిరుపతి ఆత్మ సృష్టించే విధ్వంసాన్ని అత్యంత గ్రాండ్‌గా చిత్రీకరించారు. కథ ‘తర్వాత ఏం జరుగుతుంది?‘ అనే ఉత్సుకతతో వేగంగా సాగుతుంది. అయితే, క్లైమాక్స్ కాస్త సాగదీసినట్టు అనిపిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాలు, గూస్‌బంప్స్ కలిగించే సీన్స్ బాగున్నప్పటికీ, క్లైమాక్స్‌ను మరింత ఉత్కంఠభరితంగా చూపించి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
సంపత్ నంది రాసిన డైలాగ్‌లు శక్తివంతంగా ఉన్నాయి. శివతత్వాన్ని, ఆధ్యాత్మిక అంశాలను హైలైట్ చేసే సంభాషణలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. అయితే కథలో కొత్తదనం పెద్దగా లేదు. ‘అరుంధతి‘ వంటి చిత్రాలతో పోలికలు తప్పవు. చివర్లో నంది, శివుడు ప్రత్యక్షమవడం చూపించినా, శివుడి చిత్రణను మరింత గంభీరంగా రూపొందించి ఉంటే బాగుండేది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఇప్పటివరకూ ఎక్కువగా కమర్షియల్ మూవీస్ లో గ్లామరస్ రోల్స్ లో మెప్పించిన తమన్నా.. ఈ సినిమాలో నాగసాధువు పాత్రలో ఆకట్టుకుంది. ఆమె లుక్, డైలాగ్ డెలివరీ, శివశక్తి రూపంలో ఆకట్టుకునే నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ పాత్ర ఆమె కెరీర్‌లో మైలురాయిగా నిలిచే అవకాశం ఉంది. నెగిటివ్ రోల్‌లో వశిష్ఠ సింహ తన నటనతో సినిమాకు బలం చేకూర్చాడు. తిరుపతి ఆత్మగా అతని భయంకర రూపం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. హెబ్బా పటేల్ కి ఈ సీక్వెల్ గా పెద్దగా స్కోప్ లేదు. ఇంకా శ్రీకాంత్ అయ్యంగార్, నాగ మహేష్, మురళి శర్మ వంటి సహాయ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.
‘ఓదెల 2‘ చిత్రం సాంకేతికంగా ఉన్నత స్థాయిలో నిలిచింది. కథ మామూలుదే అయినా దాన్ని గ్రాండియర్‌గా మలిచాడు సంపత్ నంది. అజనీష్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. అయితే, పాటలు మాత్రం సాధారణంగా అనిపించాయి. సౌందర్‌రాజన్ ఎస్ అందించిన విజువల్స్ సినిమాకు అదనపు ఆకర్షణ. నిజమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ, గ్రామీణ వాతావరణం, ఆధ్యాత్మిక సన్నివేశాలు అద్భుతంగా కనిపిస్తాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఫర్వాలేదు. అయితే క్లైమాక్స్‌లో శివుడి చిత్రణను ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది. సినిమాను ఖర్చుకు వెనుకాడకుండా గ్రాండ్ స్కేల్‌లో నిర్మించారు.
చివరగా:
‘ఓదెల 2‘.. దుష్టశక్తిపై దైవ యుద్ధం
T70mm Rating : 2.5/5
-
Home
-
Menu