‘హిట్ 3’ రివ్యూ

చిత్రం : ‘హిట్ 3’
విడుదల తేదీ: మే 1, 2025
తారాగణం: నాని, శ్రీనిధి శెట్టి, అడివి శేష్, విశ్వక్ సేన్, రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్ తదితరులు.
సంగీతం: మిక్కీ జే మేయర్
సినిమాటోగ్రఫీ: సాను జాన్ వర్గీస్
నిర్మాతలు: ప్రశాంతి తిపిర్నేని, నాని
దర్శకుడు: శైలేష్ కొలను
"హిట్: ది థర్డ్ కేస్" చిత్రం శైలేష్ కొలను రూపొందించిన "హిట్" ఫ్రాంచైజీలో మూడవ చిత్రం. ఈ మూడో భాగానికి మంచి హైపు ఇవ్వడానికి నేచురల్ స్టార్ నానీని రంగంలోకి దింపారు. అర్జున్ సర్కార్ అనే సీనియర్ హిట్ (హై ఇంటెన్సిటీ టీమ్) అధికారిగా నానీ నటించాడు. ఈరోజే థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా మొదటి రెండు భాగాల్ని మించే రేంజ్ లో ఉందా? ఈ మూవీ ఏ మేరకు ఆడియన్స్ ను థ్రిల్ చేస్తుంది? అన్న విషయాలు రివ్యూలో చూద్దాం.
కథ
సినిమా అర్జున్ సర్కార్ (నాని) అనే సీనియర్ హిట్ (హోమీసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్) అధికారి చుట్టూ తిరుగుతుంది. విశాఖపట్నం నుంచి జమ్మూ కాశ్మీర్‌లో జరిగే ఒక హై-ప్రొఫైల్ కేసును పరిశోధించేందుకు అతన్ని పంపిస్తారు. కొంతమంది కనిపించకుండా పోవడం, దాని వెనుక ఉన్న సైకో గ్యాంగ్‌ను ఛేదించడం కథాంశం. అర్జున్ ఈ కేసును ఎలా పరిష్కరిస్తాడు, దానిలోని ట్విస్టులు ఏమిటి అనేది కథలోని కీలక అంశం.
కథాకథనాల విశ్లేషణ
కథ ఒక స్ట్రెయిట్‌ఫార్వర్డ్ క్రైమ్ థ్రిల్లర్ ఫార్మాట్‌ను అనుసరిస్తుంది, ఇది ఫ్రాంచైజీ లోని మునుపటి చిత్రాలైన హిట్ 1, హిట్ 2 ఫార్మేట్ ను కంటిన్యూ చేస్తుంది. సైకో గ్యాంగ్ థీమ్, హై-స్టేక్స్ ఇన్వెస్టిగేషన్ ద్వారా సస్పెన్స్‌ను నిర్మించడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు. సెకండ్ హాఫ్‌లో ట్విస్టులు కథను ఆసక్తికరంగా మార్చాయి.
కథ పరంగా పెద్దగా కొత్తదనం లేదు. సైకో కిల్లర్, మిస్సింగ్ పర్సన్స్ కేస్ వంటి అంశాలు గతంలో చాలా థ్రిల్లర్ సినిమాల్లో చూసినవే. ఫస్ట్ హాఫ్‌లో కథ స్లోగా సాగుతుంది, కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపిస్తాయి. కథలో ఎమోషనల్ డెప్త్ కూడా పరిమితంగా ఉంది. అయితే రేసీ సీన్స్ వల్ల కథనంగా థ్రిల్లింగ్ గానే సాగుతుంది.
ఈ మూవీ స్క్రీన్‌ప్లే బలం సెకండ్ హాఫ్‌లో ఉంటుంది. ముఖ్యంగా చివరి 40 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు మరియు యాక్షన్ సీక్వెన్సెస్. హిట్ 1, హిట్ 2 కేసులతో ఈ కథను ముడిపెట్టిన విధానం ఫ్రాంచైజీ అభిమానుల్ని బాగా ఆకట్టుకుంటుంది. ప్రీ-క్లైమాక్స్‌లో 50 నిమిషాల సింగిల్-లొకేషన్ యాక్షన్ బ్లాక్ స్క్రీన్‌ప్లే హైలైట్. ఈ భాగం హాలీవుడ్ సినిమాలైన "కిల్ బిల్" లాంటి సినిమాను గుర్తుకు తెస్తుంది.
నటీనటుల పెర్ఫార్మెన్స్
అర్జున్ సర్కార్ గా నానిది ఒక బ్రూటల్, వైలెంట్ పాత్ర. అందులో నానీ చెలరేగి పోయాడు. నాని మాస్ హీరో ఇమేజ్‌ను ఈ పాత్ర సమర్థవంతంగా ఉప యోగించుకుంది. ‘దసరా, సరిపోదా శనివారం’ చిత్రాలతో యాక్షన్ హీరో ట్యాగ్ ను అందుకున్న నానీ ‘హిట్ 3’ తో దాన్ని కంటిన్యూ చేశాడని చెప్పాలి.
హీరోయిన్ శ్రీనిధి శెట్టి పాత్ర ఒక యాక్షన్-ఓరియెంటెడ్ రోల్‌గా కనిపిస్తుంది, కానీ ఆమె బ్యాక్‌స్టోరీ లేదా మోటివేషన్ సరిగ్గా వివరించలేదు. ఇంక రావు రమేష్, బ్రహ్మాజీ, మాగంటి శ్రీనాథ్ వంటి నటులు తమ పాత్రల్లో బాగా రాణించారు. వారి పాత్రలు కథలో పరిమిత ప్రభావం చూపాయి. అడివి శేష్, విశ్వక్ సేన్ కామియోలు ఫ్రాంచైజీ కొనసాగింపును స్ట్రాంగ్ చేశాయి. చివరిలో హిట్ 4 హీరోగా ఎవరు నటిస్తారు అన్న విషయాన్ని ఒక క్యామియోతో రివీల్ చేశారు. సైకో గ్యాంగ్‌లోని విలన్ పాత్రలు భయానకంగా, ఆకర్షణీయంగా ఉన్నాయి.
సాంకేతిక బృందం
సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ సినిమాకు ఒక రిచ్ మరియు గ్రాండ్ విజువల్ టోన్‌ను అందించింది. జమ్మూ కాశ్మీర్, విశాఖపట్నం, హైదరాబాద్ లొకేషన్స్‌ను అద్భుతంగా ఫ్రేమ్ చేశారు. మిక్కీ జే మేయర్ అందించిన సాంగ్స్ సినిమాకు బాగా కుదిరాయి, ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్సెస్‌లో ఉపయోగించిన థీమ్ సాంగ్ హీరో ఎలివేషన్‌కు తోడ్పడింది. సాంగ్స్ కమర్షియల్ అప్పీల్‌ను జోడించాయి, ప్రీ-రిలీజ్ హైప్‌ను సమర్థవంతంగా పెంచాయి.
ప్లస్ పాయింట్స్:
నానీ నటన
యాక్షన్ సీన్స్
ప్రొడక్షన్ వేల్యూస్
కథలోని ట్విస్టులు
మైనస్ పాయింట్స్
సాధారణ కథ, స్ర్కీన్ ప్లే,
అతి వయోలెన్స్
చివరిగా..
"హిట్ 3" నాని అభిమానులకు, మాస్ యాక్షన్ థ్రిల్లర్స్ ఇష్టపడే ప్రేక్షకులకు ఒక పర్ఫెక్ట్ సమ్మర్ ఎంటర్‌టైనర్. నానీ బీస్ట్ మోడ్ పెర్ఫార్మెన్స్, హై-ఇంటెన్సిటీ యాక్షన్ సీన్స్, ట్విస్టులతో కూడిన సెకండ్ హాఫ్ సినిమాను నిలబెట్టాయి. మొత్తంగా, హిట్ 3 ఒక యావరేజ్ టు అబోవ్ యావరేజ్ రేంజ్ ఎంటర్‌టైనర్, నాని ఫ్యాన్స్‌కు మాత్రం ఫుల్ ట్రీట్.
Telugu70mm Rating:3.25/5
-
Home
-
Menu