'కొత్తపల్లిలో ఒకప్పుడు' మూవీ రివ్యూ

కొత్తపల్లిలో ఒకప్పుడు మూవీ రివ్యూ
X
‘కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య‘ లాంటి చిత్రాలతో నిర్మాతగా నిరూపించుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి రూపొందించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’.

నటీనటులు: మనోజ్ చంద్ర, మోనిక.టి, ఉషా బోనెల, రవీంద్ర విజయ్, ప్రవీణ పరుచూరి, బెనర్జీ త‌దిత‌రులు

సినిమాటోగ్రఫీ: పెట్రోస్ ఆంటోనియాడిస్

సంగీతం: మణిశర్మ

ఎడిటింగ్ : కిరణ్ ఆర్

నిర్మాతలు: గోపాలకృష్ణ పరుచూరి, ప్రవీణ పరుచూరి, రానా ద‌గ్గుబాటి

దర్శకత్వం: ప్రవీణ పరుచూరి

విడుదల తేది: జూలై 18, 2025

‘కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య‘ లాంటి చిత్రాలతో నిర్మాతగా నిరూపించుకున్న ప్రవీణ పరుచూరి దర్శకురాలిగా మారి రూపొందించిన చిత్రం ‘కొత్తపల్లిలో ఒకప్పుడు’. ఈ సినిమాకి రానా మరో నిర్మాతగా వ్యవహరించాడు. మనోజ్ చంద్ర, మోనికా లీడ్ రోల్స్‌‌‌‌లో నటించిన రూరల్ డ్రామా ‘కొత్తపల్లిలో ఒకప్పుడు‘ ఈరోజు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.

కథ

మారుమూల గ్రామం కొత్తపల్లిలో 1997లో కథ ప్రారంభమవుతుంది. అక్కడి ఊరి పెద్ద రెడ్డి (బెనర్జీ) అందరికీ ఆదర్శంగా ఉంటాడు. అయితే, అతని కొడుకు అప్పన్న (రవీంద్ర విజయ్) మాత్రం భిన్నం. గ్రామ ప్రజలకు అప్పులు ఇచ్చి, వడ్డీపై వడ్డీ వేసి, బాధలు పెడుతుంటాడు. తండ్రి రెడ్డికి తన కొడుకు తీరుపై అసహనం.

మరోవైపు అదే గ్రామంలో పని చేస్తూ, రికార్డింగ్ డాన్సుల ద్వారా డబ్బు సంపాదించాలనే ఆశతో ఉంటాడు రామకృష్ణ (మనోజ్ చంద్ర). రామకృష్ణ.. రెడ్డి మనవరాలు సావిత్రిని (మౌనిక) ప్రేమిస్తాడు. ఆమెకు తన ప్రేమను తెలియజేసేందుకు ప్రయత్నించే రామకృష్ణ, మరో యువతి 'అందం' (ఉషా బోనెల) సహాయం కోరతాడు. కానీ ఆ సహాయం అతని జీవితాన్ని మలుపు తిప్పుతుంది. కొన్ని అపర్థాల కారణంగా ఊరిపెద్దలు పంచాయితీ పెట్టి, రామకృష్ణ–అందం పెళ్లే సరైందని నిర్ణయిస్తారు.

తాను ప్రేమించింది సావిత్రి అని తెలిసినా రామకృష్ణ ఎందుకు 'అందం'తో పెళ్లికి సిద్ధమవుతాడు? చివరికి రామకృష్ణ ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా? వడ్డీ వ్యాపారిగా ప్రజలను పీడించిన అప్పన్న ఏమయ్యాడు? అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ

నిర్మాత, దర్శకురాలు ప్రవీణ.. తన గత చిత్రాలు ‘కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య‘ తరహాలోనే పక్కా పల్లెటూరి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. ఈ సినిమా కథ కొత్తపల్లి అనే ఊర్లో సాగుతుంది. అప్పులిచ్చి వడ్డీలు వసూలు చేసే అప్పన్న, రికార్డింగ్ డ్యాన్సుల్లో పనిచేసే రామకృష్ణ, అతని ప్రేమ సావిత్రి, సావిత్రి వాళ్లింట్లో పనిచేసే అందం వంటి పాత్రలతో కథ సాగుతుంది.

ఫస్ట్ హాఫ్ సింపుల్‌గా, సరదాగా సాగిపోతూ ఇంటర్వెల్ దగ్గర ఓ చిన్న ట్విస్ట్‌తో ఆసక్తి కలిగిస్తుంది. అయితే సెకండ్ హాఫ్‌కి రాగానే కథ దెయ్యాలు, దేవుడిపై ఫిలాసఫీ వైపు మలుపు తీసుకుంటుంది. ‘దేవుడు అంటే నిజమో అబద్ధమో కాదు, ఓ నమ్మకం‘ అనే అంశాన్ని దర్శకురాలు చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది.

అయితే కొన్ని సన్నివేశాలు కొద్దిగా సాగదీసినట్లు అనిపించవచ్చు. ఫస్టాఫ్ రూరల్ బ్యాక్ డ్రాప్ లో నేచురల్ గా ఉంటే.. ఇంటర్వెల్ తర్వాత కొన్ని ఎపిసోడ్స్ మెలో డ్రామాటిక్‌గా కనిపిస్తాయి. కథలోని అంశాలు ఆలోచించదగ్గవే అయినా, వాటిని తెరపై ఆవిష్కరించడంలో గందరగోళంగా కనిపించింది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు

రామకృష్ణ పాత్రలో కొత్త నటుడైన మనోజ్ చంద్ర తన అమాయక హావభావాలతో ఆకట్టుకున్నాడు. వాయిస్ మాడ్యులేషన్ సహా నటనలో అతని కృషి స్పష్టంగా కనిపిస్తుంది. రవీంద్ర విజయ్ అప్పన్నగా తనదైన శైలిలో ఆకట్టుకున్నాడు. గత చిత్రాల కంటే డబ్బింగ్ పరంగా ఆయనలో మెరుగుదల కనిపించింది. బెనర్జీకి చాలా కాలం తర్వాత మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది.

ఉషా బోనెల (అందం)గా సహజ నటనతో మెప్పించగా, మౌనిక (సావిత్రి) ఫర్వాలేదనిపించింది. ఇతర పాత్రల్లో ప్రవీణ్ పరుచూరి, ప్రేమ సాగర్, బాబూ మోహన్, 'సత్యం' రాజేశ్, బొంగు సత్తి, ఫణి తదితరులు తామున్నంతలో బాగా చేశారు.

సాంకేతికంగా పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా విజువల్స్ ను సమకూర్చడంలో సినిమాటోగ్రాఫర్ పాత్ర బాగుంది.

చివరగా

సామాజిక సందేశంతో ‘కొత్తపల్లిలో ఒకప్పుడు‘

Tags

Next Story