'దిల్‌ రూబా' రివ్యూ

దిల్‌ రూబా రివ్యూ
X

'దిల్‌ రూబా'

నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్షోర్ థిల్లాన్, నాజియా డేవిసన్, సత్య, జాన్ విజయ్ తదితరులు

సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డేనియల్

సంగీతం: సామ్ సిఎస్

ఎడిటింగ్‌: ప్రవీణ్ కె.ఎల్.

నిర్మాతలు: విక్రమ్ మెహ్రా, సిద్ధార్థ్ ఆనంద్ కుమార్, రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి

దర్శకత్వం: విశ్వ కరుణ్

విడుదల తేది: 14-03-2025

టాలీవుడ్ యంగ్ హీరోస్ లో తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకున్నాడు కిరణ్ అబ్బవరం‘. ‘క‘ మూవీతో రూ.50 కోట్ల క్లబ్ లోకి చేరిన కిరణ్.. ఇప్పుడు ‘దిల్ రూబా‘తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. హోలీ కానుకగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వస్తోన్న 'దిల్ రూబా'కి ముందుగానే ప్రీమియర్స్ వేశారు. మరి.. ఈ సినిమా ఎలా ఉంది? ఆడియన్స్ అంచనాలను అందుకుందా? వంటి విశేషాలను ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

సిద్ధార్థ్ రెడ్డి (కిరణ్ అబ్బవరం) ప్రేమలో తీవ్రంగా గాయపడిన యువకుడు. తన ప్రేయసి మ్యాగీ (నజియా డేవిసన్) బ్రేకప్ చెప్పి అమెరికా వెళ్లిపోవడంతో, ప్రేమపైనే కాకుండా సంబంధాల మీదే విరక్తి పెంచుకుంటాడు. తండ్రి మరణం అనంతరం "థాంక్స్, సారీ" అనే మాటలను పూర్తిగా విస్మరించాలని నిర్ణయించుకుంటాడు.

అయితే, అతని జీవితంలోకి అంజలి (రుక్సార్) ప్రవేశించడం కొత్త మలుపు తిప్పుతుంది. తొలుత ఎలాంటి ఆసక్తి లేకపోయినా, ఆమె ప్రేమలో పడతాడు. అయితే, కాలేజీలో విక్కీ (క్రాంతి కిల్లి) కారణంగా వారి అనుబంధం దూరమవుతుంది.

ఈ సమయంలో మ్యాగీ తిరిగి వచ్చి, సిద్ధార్థ్-అంజలి మధ్య జరిగిన విభేదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తుంది. కానీ వారి జీవితాల్లోకి లోకల్ డాన్ జోకర్ (జాన్ విజయ్) ప్రవేశించడం మరింత సమస్యలను తెస్తుంది.

జోకర్ ఎందుకు సిద్ధార్థ్ బృందాన్ని టార్గెట్ చేశాడు? మ్యాగీ ప్రయత్నం ఫలిచిందా? చివరికి సిద్ధార్థ్ తన ప్రేమను స్వీకరించాడా? వీటికి సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

ఈ సినిమా కథ కొత్తదేమీ కాదు. ప్రియురాలి విడిపోవడం, తండ్రి మరణం వంటి సంఘటనల వల్ల మూర్ఖంగా మారిన ఒక యువకుడు, మరో యువతి జీవితంలోకి వచ్చినప్పటికీ తన గత అనుభవాల ప్రభావంతో మారడానికి నిరాకరించటం ప్రధాన ఇతివృత్తం.

హీరో క్యారెక్టర్ డిజైన్ బాగా చేయబడింది, అయితే తెరపై ఆ పాత్రను సమర్థంగా ప్రదర్శించడంలో మాత్రం కొంత తడబాటు కనిపిస్తుంది. ప్రేమకథతో పాటు కొన్ని ఇతర అంశాలు గత సినిమాలను గుర్తు తెస్తాయి. అయినప్పటికీ దర్శకుడు వాటిని భిన్నంగా మలచడానికి ప్రయత్నించాడు. రుక్సర్ థిల్లాన్ పాత్ర కొంత వరకు బాగుంది. తండ్రి – కూతుళ్ల మధ్య సెంటిమెంట్ ఒక మోతాదులో ఆకట్టుకుంటుంది.


ఫస్ట్ హాఫ్‌లో కొన్ని ఆసక్తికరమైన మోమెంట్స్ ఉన్నా, సెకండ్ హాఫ్ పూర్తిగా గాడితప్పినట్లు అనిపిస్తుంది. క్లైమాక్స్ కూడా భావోద్వేగాలను కలిగించలేకపోయింది. యాక్షన్ సీక్వెన్సులు, భారీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అవసరం లేకుండా చేరినట్లు అనిపిస్తుంది. కిరణ్ అబ్బవరం తన మాస్ ఇమేజ్‌ను ఫోకస్ చేయడం కంటే కంటెంట్ బేస్డ్ కథలను ఎంచుకుంటే బెటర్.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:

కిరణ్ అబ్బవరం తన నటనలో కొత్తదనం చూపించే ప్రయత్నం చేశాడు. ఆయన లుక్స్ ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాల్లో నటన కొద్దిగా అతిశయోక్తిగా అనిపిస్తుంది. రుక్సర్ మాత్రం తన నటనతో సహజత్వాన్ని మేళవించి, ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.

నజియా మ్యాగీ పాత్రలో ఓకే అనిపించినా ప్రేక్షకులపై గట్టి ప్రభావాన్ని చూపలేకపోయింది. కమెడియన్ సత్య కొన్ని సన్నివేశాల్లో నవ్వించేందుకు ప్రయత్నించినా, పూర్తిగా తన కిక్‌ను అందించలేకపోయాడు. నరేన్, క్రాంతి, జాన్ విజయ్, తులసి, విజయ్ రంగరాజు తదితరులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్‌గా చూస్తే, సంగీత దర్శకుడు సామ్ సి.ఎస్. ఈ క్రాఫ్ట్ కు న్యాయం చేశాడు. పాటలతో పాటు బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. కెమెరా పనితనం రిచ్‌గా ఉండటంతో పాటుగా, ఫైట్స్ కూడా స్టైలిష్‌గా డిజైన్ చేశారు. చిత్రీకరణలో ఖర్చు గట్టిగానే పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

చివరగా:

'దిల్‌ రూబా'.. కాంప్లెక్స్ లవ్, సింపుల్ ఎమోషన్స్!

Tags

Next Story