'ఛావా' రివ్యూ

ఛావా  రివ్యూ
X

నటీనటులు: విక్కీ కౌశల్, రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, దివ్య దత్తా, డయానా పెంటి తదితరులు

సినిమాటోగ్రఫీ: సౌరభ్ గోస్వామి

సంగీతం: ఏఆర్ రెహమన్

ఎడిటింగ్‌: మనీష్ ప్రధన్

నిర్మాత: దినేష్ విజన్

దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్

విడుదల తేది: 07-03-2025 (తెలుగు)

భారత దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన వీరయోధుల్లో ఛత్రపతి శంభాజీ మహారాజ్ ని ఒకరుగా చెబుతారు. ఆయన వీరగాథను వెండితెరపై ఆవిష్కరించిన చిత్రం 'ఛావా'. విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన 'ఛావా' ఈరోజు తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఈ సినిమాని తెలుగులో విడుదల చేసింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:

ఛత్రపతి శివాజీ మహారాజ్‌ పరమపదించిన తర్వాత, మరాఠా సామ్రాజ్యం బలహీనపడిందని భావించిన మొఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్ (అక్షయ్‌ ఖన్నా) ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని సంకల్పిస్తాడు. తన సామంతులను పంపి ప్రజలపై భారం మోపిస్తూ, పన్నుల పేరుతో దోచుకుంటూ, వ్యతిరేకించే వారిపై హింసకు పాల్పడతాడు. అయితే, మొఘల్‌ ఆక్రమణవాదానికి అడ్డుగా నిలిచే శక్తిగా ఛత్రపతి శంభాజీ మహారాజ్‌ (విక్కీ కౌశల్‌) ఎదుగుతాడు.

ప్రజల పట్ల పాలకుల ఆగడాలను అరికట్టడానికి తనదైన వ్యూహాన్ని రచిస్తాడు శంభాజీ. మరాఠా శౌర్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటాలనే సంకల్పంతో, తన సైన్యాన్ని సమాయత్తం చేస్తాడు. ఈ విషయాలు ఔరంగజేబ్‌ దృష్టికి చేరడంతో, మరాఠా సామ్రాజ్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు అతను స్వయంగా రంగంలోకి దిగుతాడు.

శక్తిమంతమైన మొఘల్‌ సేనను ఎదుర్కొనే క్రమంలో శంభాజీ అనేక సవాళ్లను ఎదుర్కొంటాడు. యుద్ధ క్షేత్రంలో తాను చిత్తశుద్ధితో పోరాడుతున్నా, కొందరు స్వార్థపరులు శత్రువుతో చేతులు కలిపి ద్రోహానికి పాల్పడతారు. మరి.. చివరకు శంభాజీ తన ప్రజలను రక్షించగలిగాడా? శంభాజీ ఏమయ్యాడు? వంటి విశేషాలను తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

భారత చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్‌ అంటే ఓ పోరాట సంకేతం. తన ధైర్యం, వ్యూహాలతో మౌఘల్‌ చక్రవర్తి ఔరంగజేబ్‌కు గుండెల్లో మంటపుట్టించిన శక్తి. ఆయన తరువాత మరాఠా సామ్రాజ్యాన్ని ముందుకు నడిపిన వారిలో శంభాజీ మహారాజ్‌ ఒకరు. శంభాజీ పాలన ఎక్కువ కాలం సాగకపోయినా, ఆయన జీవితం అంతా యుద్ధాలు, ధైర్యం, దేశభక్తితో మరాఠా గర్వంగా నిలిచిపోయింది.

ఈ అద్భుతమైన చరిత్రని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరపై ‘ఛావా’ రూపంలో ప్రేక్షకులకు అందించాడు. శంభాజీ వ్యక్తిగత జీవితంలోని వివాదాలు పక్కన పెట్టి, మరాఠా సామ్రాజ్య పరిరక్షణ కోసం సాగించిన పోరాటాన్ని ప్రధానంగా ఫోకస్‌ చేయడం ఈ చిత్రానికి పెద్ద ప్లస్‌.

పొలిటికల్‌ డ్రామా, వార్ డ్రామాని మేళవించి దర్శకుడు కథను నడిపించిన తీరు విశేషంగా నిలిచింది. కథ ప్రారంభంలోనే షాబుద్దీన్‌ ఫిరోజంగ్‌ (లవి పజ్ని) కోటపై దాడితో శంభాజీ మహారాజ్‌ ధైర్యాన్ని, అతని నేతృత్వాన్ని హైలైట్‌ చేయడం, ఈ యాక్షన్‌ ఎపిసోడ్‌ ప్రేక్షకుల హృదయాల్లో ఉత్కంఠను రేపడం ఆసక్తికరం.

ఔరంగజేబ్‌ స్వయంగా రంగంలోకి దిగిన తర్వాత కథ మళ్లీ మలుపు తిరుగుతుంది. మొఘల్‌ సైన్యాన్ని అడ్డుకోవడంలో శంభాజీ అమలు చేసిన గెరిల్లా యుద్ధతంత్రాలు ఉత్కంఠ రేపుతాయి. 'జై భవానీ', 'హర హర మహదేవ్' నినాదాలతో మరాఠా వీరులు పోరాడే సన్నివేశాలు థియేటర్లను గంభీరంగా మారుస్తాయి. సెకండ్ హాఫ్‌ పూర్తిగా యుద్ధభూమిగా మారిపోతుంది.

అయితే శంభాజీ చుట్టూ ఉన్నవారిలో కొందరు విశ్వాస ఘాతం చేస్తారు. ఆ నయవంచనతో ఔరంగజేబ్‌ సైన్యం రాత్రికిరాత్రే మెరుపుదాడి చేస్తుంది. తక్కువ మందితోనే శంభాజీ ఆ దాడిని ఎదుర్కొనే విధానం శక్తివంతంగా చిత్రీకరించారు. మరాఠా యోధులు ఒక్కొక్కరిగా వీరమరణం పొందుతున్నప్పుడు, ప్రేక్షకుల మనసు కూడా ఆ గోసను అనుభవిస్తుంది.

ఔరంగజేబ్‌ చెరలో చిక్కిన శంభాజీపై సాగించిన హింసాత్మక సన్నివేశాలు హృదయాన్ని కదిలిస్తాయి. శత్రుసైనికులకే కనికరం కలిగించేలా ఉన్నప్పటికీ, శంభాజీ మాత్రం తన ఆత్మగౌరవాన్ని వదలకుండా నిలబడతాడు. ‘ఛావా’ ద్వారా శంభాజీ మహారాజ్‌ వీరత్వాన్ని, మరాఠా సామ్రాజ్య పోరాట శక్తిని మరోసారి ప్రేక్షకుల ముందు తీసుకురావడంలో దర్శకుడు విజయవంతమయ్యాడు.

మైనస్ లా విషయానికొస్తే ఫస్ట్ హాఫ్‌లో కథ సాగదీతగా అనిపించే క్షణాలు ఉంటాయి. శంభాజీ మహారాజ్‌ పాత్రలో విక్కీ కౌశల్‌ అద్భుతంగా నటించినా, ఆ పాత్రలోని ఉదాత్తతను, సంక్లిష్టతను ఇంకాస్త ప్రభావవంతంగా చూపించేందుకు స్క్రీన్‌ప్లే మరింత గ్రిప్పింగ్‌గా ఉండాల్సింది.

నటీనటులు, సాంకేతిక నిపుణులు:

నటీనటుల విషయానికొస్తే ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ తన శక్తివంతమైన నటనతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌లో అతని హావభావాలు, డైలాగ్ డెలివరీ, తడుముకోని పోరాటస్ఫూర్తి ప్రేక్షకులకు గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. అతడి స్క్రీన్ ప్రెజెన్స్ మరాఠా వీరత్వాన్ని ప్రతిబింబించేలా ఉంటుంది.

రష్మిక మందన్న తన పాత్రకు న్యాయం చేసినప్పటికీ, ఆమె స్క్రీన్ టైమ్ పరిమితంగానే ఉంది. ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా తనదైన స్టైల్‌లో అభినయించి, మొఘల్ చక్రవర్తిగా ఓ బలమైన ఆరాని చూపించాడు. ఇంకా అశుతోష్ రానా, దివ్య దత్తా, డయానా పెంటీ లాంటి ఇతర నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

‘ఛావా’లో టెక్నికల్ అంశాల విషయానికొస్తే.. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం, నేపథ్య సంగీతం సినిమాని నిలబెట్టింది. సౌరభ్ గోస్వామి సినిమాటోగ్రఫీ యుద్ధ సన్నివేశాలను అత్యద్భుతంగా హైలైట్ చేసింది. దినేష్ విజన్ నిర్మాణంలో ఖర్చుకు ఏమాత్రం వెనుకాడలేదు. ప్రతీ ఫ్రేములోనూ హై ప్రొడక్షన్ వేల్యూస్ కనిపించాయి. ఇక ఈ సినిమాని తెలుగులో అనువదించడానికి గీతా ఆర్ట్స్ చేసిన ప్రయత్నం మెచ్చుకోదగ్గది. సినిమా చూస్తున్నంతసేపూ ఓ స్ట్రెయిట్ మూవీని చూసిన అనుభూతిని ఈ అనువాదం అందించింది.





చివరగా:

మరాఠా గాథకు న్యాయం చేసిన ‘ఛావా’

Tags

Next Story