'23' మూవీ రివ్యూ

నటీనటులు: తేజ, తన్మయ, వేద వ్యాస్, యాంకర్ ఝాన్సీ, తాగుబోతు రమేష్, పవన్ రమేష్, ప్రణీత్ తదితరులు
సినిమాటోగ్రఫీ: సన్నీ కూరపాటి
సంగీతం: మార్క్ కే రాబిన్
ఎడిటింగ్ : అనిల్ ఆలయం
నిర్మాత: స్టూడియో 99
దర్శకత్వం: రాజ్ రాచకొండ
విడుదల తేది: మే 16, 2025
'మల్లేశం, 8 AM మెట్రో' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు రాజ్ రాచకొండ తెరకెక్కించిన చిత్రం '23'. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. వరుసగా కంటెంట్ డ్రివెన్ మూవీస్ ను అందిస్తూ వస్తోన్న రానా దగ్గుబాటి తన స్పిరిట్ మీడియా ద్వారా ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేయడం విశేషం. స్టూడియో 99 నిర్మాణంలో రూపొందిన '23' చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి.. ఈ సినిమా ఎలా ఉందో? ఈ రివ్యూలో చూద్దాం.
కథ
గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో దళిత కుటుంబానికి చెందిన సాగర్ (తేజ), సుశీల (తన్మయ) ప్రేమించుకొంటారు. తమ కులాలు, కుటుంబ పరమైన స్థితిగతులు ఏమైనా, ఇద్దరూ ఒకరినొకరు విడవలేని అనుబంధంతో మమేకమవుతారు. కానీ పెళ్లి కాకముందే శారీరకంగా ఏకమవడం వల్ల సుశీల గర్భవతవుతుంది.
సొంతంగా ఓ ఇడ్లీ సెంటర్ పెట్టి జీవితం కొత్తగా ప్రారంభించాలనే ఆశతో సాగర్ ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. కానీ ఆర్థిక ఇబ్బందులు, మారిన పరిస్థితులు అతడిని అప్పుల బారిన పడేస్తాయి. అప్పుల్ని తీర్చాలనే ఒత్తిడిలో వ్యసనాలకు బానిసవుతాడు. వాటితో పాటు, అక్రమ మార్గాల్లో డబ్బు సంపాదించాలన్న ఆలోచన వేగంగా పెరిగుతుంది.
తన స్నేహితుడు దాస్‌తో కలిసి బస్సు దోపిడీ చేయాలనే పథకం వేస్తాడు సాగర్. అయితే దోపిడీకి వెళ్లిన రాత్రి... కాలం, పరిస్థితి, విధి – అన్నీ ఒక్కసారిగా మారిపోతాయి. ఊహించని విధంగా బస్సు దహనం అయి, అందులో 23 మంది పౌరులు ప్రాణాలు కోల్పోతారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనమవుతుంది.
బస్సు దహనం కేసుతో వారికి సంబంధం ఉందా? కోర్టు మరణశిక్ష విధించిన తర్వాత సాగర్, సుశీల కుటుంబాల పరిస్థితి ఏమిటి? చివరకు వారికి జరిగిన న్యాయన్యాయాలు ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
ఈ సినిమా సాంఘిక వ్యవస్థలో దాగి ఉన్న అసమానతల్ని ప్రశ్నించే ఒక ధైర్యమైన ప్రయోగం. అగ్ర వర్గాలు, అణగారిన వర్గాల మధ్య ఉన్న న్యాయ వ్యత్యాసాన్ని ప్రధానంగా చూపిస్తుంది. ఒకే రకమైన నేరానికి ఇద్దరు వ్యక్తులు – ఒకరికి 24 గంటల్లో బెయిల్, మరొకరికి రెండు సంవత్సరాలైనా జామీన్ రాకపోవడం – ఈ దేశంలోని శోచనీయమైన వ్యవస్థపై వేలెత్తి చూపే ఉదాహరణగా నిలుస్తుంది.
1991లో చుండూరు మారణకాండ, 1997లో జూబ్లీహిల్స్ బాంబు పేలుడు ఘటనల్లోనూ ప్రాణాలు పోయాయి. కానీ నేరస్తులకు శిక్షలు ఎందుకు పడలేదు? అదే సమయంలో చిలకలూరిపేట బస్సు దహనం కేసులో నిందితుడు దళితుడు కావడంతో కఠిన శిక్ష విధించబడింది. ఈ వ్యత్యాసం కేవలం సంఘటనల పరంగా కాదు – సామాజిక పరంగా అని చూపించే సినిమా ఇది.
మూడు వేర్వేరు సంఘటనలను ఒక త్రాటిపైకి తెచ్చి ఆయా ఘటనలలో న్యాయం ఎలా జరిగిందో చెప్పే ప్రయత్నం చేశాడు దర్శకుడు రాజ్ రాచకొండ. కొన్ని చోట్ల సినిమాకంటే డాక్యుమెంటరీగా అనిపించినా, ఈ కథ ద్వారా చూపే కొత్త దృక్కోణం ప్రశంసించదగినది. దర్శకుడు తీసుకున్న రిస్క్, చెప్పాలనుకున్న ప్రశ్న – 'న్యాయం అందరికీ సమానమేనా?' అనేది మనల్ని ఆలోచింపజేస్తుంది.
నటీనటులు, సాంకేతిక నిపుణులు
ఈ చిత్రానికి నటీనటుల ప్రదర్శన ఓ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. కథలో సాగర్, సుశీల పాత్రలు చాలా ప్రధానమైనవి. అనుభవం తక్కువగా ఉన్నప్పటికీ, తమ ప్రతిభతో తేజ, తన్మయ ఇద్దరూ ఈ పాత్రలను సజీవంగా తీర్చిదిద్దడంలో విజయం సాధించారు. ఝాన్సీ, తాగుబోతు రమేష్ లాంటి పేరుగాంచిన నటులు తమ టాలెంట్‌తో సినిమాకు మరింత బలం చేకూర్చారు.
సాంకేతిక నిపుణుల విషయానికొస్తే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ మేటి స్థాయిలో నిలిచాయి. సన్నీ కూరపాటి చిత్రీకరించిన సన్నివేశాలు సహజమైన అనుభూతిని ఇస్తాయి. మార్క్ కే రాబిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని కీలక సన్నివేశాలకు ప్రాణం పోసింది. పాటలు అంతగా క్యాచీగా లేవు.
చివరగా
'23'.. ఆలోచింపజేసే ప్రయత్నం
-
Home
-
Menu