చిరు రాజకీయాల్లోకి తిరిగొస్తారా?

చిరు రాజకీయాల్లోకి తిరిగొస్తారా?
X
రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నా... విమర్శలు మాత్రం ఆగడం లేదు

హైదరాబాద్‌లో ఫీనిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేసిన రక్తదాన కార్యక్రమం పెద్ద ఎత్తున విజయవంతమైంది. ఈ ప్రత్యేక ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై, తానే స్వయంగా రక్తదానం చేశారు. ఆయనతో పాటు యువ హీరో తేజా సజ్జా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తన వంతు బాధ్యతను నిర్వర్తించాడు.

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, "రక్తదానం అనే మాట వింటే నా పేరు గుర్తొస్తే, అది పూర్వజన్మ పుణ్యం,” అంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. తేజా సజ్జాను "నా బిడ్డ లాంటి వాడు" అంటూ ప్రేమతో అభినందించారు. తన సేవా యాత్రలో అభిమానుల భాగస్వామ్యం చూసి గర్వంగా ఉందన్నారు.

అంతేకాకుండా, రాజకీయాల గురించి కూడా చిరంజీవి స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. నేను పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నా, కొంతమంది నేతలు నన్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు. నాకు అది బాధగా అనిపించదు ఎందుకంటే నేను చేసిన మంచితనమే వారికి సమాధానం, అంటూ కుండబద్దలుగొట్టే ప్రకటన చేశారు.

సోషల్ మీడియాలో తనపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ, నన్ను నిందించేవారికి నేను ప్రత్యుత్తరం ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే నేను చేసిన మంచి, నా అభిమానుల ప్రేమే నాకు రక్షణ కవచం, అని ధైర్యంగా వ్యాఖ్యానించారు.

ఇటీవల ఓ రాజకీయ నాయకుడు చేసిన అసభ్య వ్యాఖ్యల ఘటనను గుర్తు చేసుకున్నారు చిరంజీవి. ఆ నాయకుడు ఓ గ్రామానికి వెళ్లినప్పుడు, ఓ మహిళ అతడిని అడ్డుకుని, చిరంజీవిని ఎందుకు తిట్టారు? ఆయన బ్లడ్ బ్యాంక్ వల్లే నా బిడ్డ ప్రాణాలతో ఉన్నాడు, అని చెప్పిందని చిరు భావోద్వేగంగా పంచుకున్నారు. ఆ మాటలు తన మనసును తాకినట్టు చెప్పారు.

ఈ సందర్భంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ స్థాపన వెనుక ఉన్న స్ఫూర్తిదాయక సంఘటనను కూడా గుర్తు చేశారు. “ఒక జర్నలిస్ట్ రాసిన ఆర్టికల్ చదివిన తర్వాతే రక్తదానానికి ప్రాధాన్యత తెలిసింది. ఇప్పటివరకు ఆ జర్నలిస్ట్‌ను కలవలేదుగాని, జీవితాంతం ఆయనను మర్చిపోలేను,” అంటూ చిరంజీవి భావోద్వేగానికి లోనయ్యారు.

తన అభిమానులు విదేశాల్లో కూడా రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్న విషయం తనను గర్వపడేలా చేసిందన్నారు. తనను ఆదర్శంగా తీసుకుని సేవా మార్గంలో నడుస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

ఇక తాజాగా సీఎం రేవంత్ రెడ్డిని చిరంజీవి కలవడం, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఆయనను బరిలోకి దింపాలన్న ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసి కేంద్ర మంత్రిగా పని చేసిన చిరంజీవికి ఇప్పటికీ కాంగ్రెస్ సభ్యత్వం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తారన్న ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలతో ఆ ప్రచారానికి బలహీనత వచ్చిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Tags

Next Story