శ్రీవాణి దర్శనానికి టీటీడీ కొత్త ప్రయోగం

శ్రీవాణి దర్శనానికి టీటీడీ కొత్త ప్రయోగం
X
భక్తులకి వచ్చిన రోజే దర్శనం కల్పించే ప్రయోగాత్మక విధానం అమలులోకి - తిరుమలలో ప్రత్యేక కౌంటర్లలో టికెట్లు ప్రతి రోజూ విడుదల

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు తీపి కబురు. టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) శ్రీ‌వాణి దర్శన టికెట్లపై ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. భక్తులకు మరింత వేగవంతమైన, అందుబాటులో ఉండే సేవలందించాలనే లక్ష్యంతో ఆగస్టు 1 నుంచి 15, 2025 వరకు ఈ విధానం అమలులో ఉంటుంది. తిరుమల గోకులంలో జరిగిన సమీక్షా సమావేశంలో అదనపు ఈవో శ్రీ సి. హెచ్. వేంకయ్య చౌదరి ఈ విషయం వెల్లడించారు.

ఇప్పటికే ఉన్న విధానంలో శ్రీ‌వాణి టికెట్లు పొందిన భక్తులు దర్శనం పొందేందుకు సుమారు మూడు రోజుల సమయం పట్టుతోంది. దీని వల్ల అత్యంత భక్తిశ్రద్ధలతో వచ్చే వారికి తీవ్ర అసౌకర్యం ఏర్పడుతోంది. ఈ పరిస్థితిని మారుస్తూ, టికెట్ తీసుకున్న ఆదే రోజునే దర్శనం చేసే అవకాశాన్ని కల్పించేందుకు టీటీడీ ముందుకు వచ్చింది.

టీటీడీ ప్రవేశపెట్టిన నూతన ప్రయోగాత్మక విధానం 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ కాలంలో భక్తులకు టికెట్ తీసుకున్న రోజునే దర్శన అవకాశం కల్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి.

తిరుమలలో ఉదయం 10 గంటల సమయంలో, శ్రీ‌వాణి టికెట్లు ఆఫ్‌లైన్ విధానంలోనే జారీ చేయబడతాయి. టికెట్లు మొదట వచ్చే భక్తులకు ముందు ఇచ్చే విధంగా, అంటే "ఫస్ట్ కం – ఫస్ట్ సర్వ్" ఆధారంగా అందించబడతాయి.

భక్తులు టికెట్ పొందిన అదే రోజు సాయంత్రం 4:30 గంటలకు, తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్–1 వద్ద దర్శనానికి హాజరుకావలసి ఉంటుంది.అలాగే, రేణిగుంట విమానాశ్రయంలో కూడా భక్తుల కోసం ఉదయం 7 గంటల నుంచి, రోజువారీ కోటా మేరకు టికెట్లు జారీ చేస్తారు. టికెట్ల కేటాయింపులో తిరుమలలో 800 టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో 200 టికెట్లు అందుబాటులో ఉంచబడతాయి.

ఇప్పటికే ఆన్‌లైన్‌లో అక్టోబర్ 31 వరకు టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు, యధాపూర్వంగా ఉదయం 10 గంటలకే దర్శనానికి హాజరుకావచ్చు. నవంబర్ 1 నుంచి, ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ టికెట్లున్న వారందరికీ సాయంత్రం 4:30 గంటలకు దర్శన అనుమతి ఉంటుంది. భక్తులు తప్పనిసరిగా ఉదయం 10 గంటలకు టికెట్ జారీ కౌంటర్లకు చేరుకోవాలని టీటీడీ కోరుతోంది, ఆలస్యంగా రాకుండా ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని సూచిస్తోంది.

ఈ నూతన విధానం వల్ల భక్తులకు ఎక్కువ రోజులు తిరుమలలో ఉండాల్సిన అవసరం ఉండదు. టికెట్ తీసుకున్న రోజునే దర్శనం జరుగుతుండటంతో, సమయాన్ని ఆదా చేసుకునే అవకాశం, తక్కువ ఖర్చుతో పూజించేందుకు సౌకర్యవంతమైన మార్గం లభిస్తుంది.

ఈ విధానం విజయవంతం అయితే భవిష్యత్తులో దీన్ని స్థిర విధానంగా మార్చే అవకాశముంది.

Tags

Next Story