టీటీడీలో AI సిస్టమ్‌తో 3 గంటల్లోనే దర్శనం పూర్తి

టీటీడీలో AI సిస్టమ్‌తో 3 గంటల్లోనే దర్శనం పూర్తి
X
ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు ఎప్పుడైనా టికెట్ పొందే సౌకర్యం - భక్తుల వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గించడమే లక్ష్యం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) భక్తుల సౌకర్యం కోసం శ్రీవాణి దర్శన టికెట్ల జారీలో కొత్త మార్పులు చేసింది. ఇకపై తెల్లవారుజామున నుంచే క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. ఆలస్యాన్ని నివారించేందుకు టోకెన్ పద్ధతిని అమలు చేస్తున్నారు.

భక్తులు తమ ఆధార్ కార్డు జిరాక్స్‌పై టోకెన్ నంబర్ తీసుకుంటారు. ఆ టోకెన్‌తో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల మధ్య ఎప్పుడైనా టికెట్ కౌంటర్‌కి వెళ్లి డబ్బు చెల్లించి టికెట్ పొందవచ్చు. దీని వల్ల గంటల తరబడి క్యూలో నిలబడే ఇబ్బందులు తొలగిపోతాయి. ప్రస్తుతం ఈ విధానం వల్ల రెండు కేంద్రాల్లోనూ క్యూలు చాలా తగ్గిపోయాయి అని టీటీడీ అధికారులు తెలియచేసారు.

ఆగస్టు 1 నుంచి శ్రీవాణి దర్శన టికెట్ పొందిన భక్తులకు అదే రోజు దర్శనం కల్పించే విధానం మొదలైంది. ఉదయం టికెట్ తీసుకున్న వారు సాయంత్రం 4.30 గంటలకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 వద్ద దర్శనానికి హాజరుకావచ్చు. గతంలో 3 రోజులు పట్టే దర్శనం ఇప్పుడు అదే రోజున పూర్తవుతుంది.

తిరుమలలో రోజుకు 800 ఆఫ్‌లైన్ టికెట్లు, రేణిగుంట విమానాశ్రయంలో రోజుకు 200 ఆఫ్‌లైన్ టికెట్లు అందుబాటులో ఉంటాయి. రేణిగుంట ఎయిర్‌పోర్ట్‌లో ఉదయం 7 గంటల నుంచే టికెట్లు ఇస్తారు. ఇప్పటికే అక్టోబర్ 31 వరకు ఆన్‌లైన్‌లో టికెట్లు పొందిన వారికి పాత సమయమైన ఉదయం 10 గంటలకు దర్శనం ఉంటుంది.

ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ — రెండు రకాల శ్రీవాణి దర్శన టికెట్లు పొందిన భక్తులకు నవంబర్ 1 నుంచి సాయంత్రం 4.30 గంటలకు మాత్రమే దర్శనం ఉంటుంది.భక్తుల వేచిచూడే సమయాన్ని తగ్గించడానికి టీటీడీ AI ఆధారిత వ్యవస్థను కూడా ప్రణాళికలో పెట్టింది. దీని ద్వారా దర్శనం సమయాన్ని గరిష్టంగా 3 గంటల్లో పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నారు.

Tags

Next Story