జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలకు త్రిసభ్య కమిటీ

జూబ్లీహిల్స్‌లో ఉప ఎన్నికలకు త్రిసభ్య కమిటీ
X
జనాభా మార్పుల నేపథ్యంలో స్థానికులకే ప్రాధాన్యత ఇస్తున్న అధికార పార్టీ.

బీఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మరణంతో ఖాళీ అయిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈ సీటును గెలుచుకోవాలనే ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతోంది. ఇటీవల చోటుచేసుకున్న జనాభా మార్పుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ స్థానిక అభ్యర్థిని రంగంలోకి దింపాలని నిర్ణయించుకుంది.

ఈ సీటు కోసం ముగ్గురు స్థానిక నేతలు పోటీలో ఉన్నారు. వారిలో టీజీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మోహమ్మద్ అజహరుద్దీన్, నవీన్ యాదవ్ మరియు రహమత్ నగర్ కార్పొరేటర్ సి.ఎస్. రెడ్డి ఉన్నారు. హైదరాబాద్ ఇన్‌చార్జ్ మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పటికే "స్థానిక అభ్యర్థికే అవకాశం" అనే విషయాన్ని స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌కు మద్దతు తెలిపే ఎంఐఎం పార్టీ మాత్రం మోహమ్మద్ అజహరుద్దీన్ అభ్యర్థిత్వానికి వ్యతిరేకంగా ఉంది. దీంతో కాంగ్రెస్ లోపల అభ్యర్థి ఎంపికపై ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అజహరుద్దీన్‌కు తిరుగులేని బ్రాండ్ వాల్యూతో పాటు పాతబస్తీలో మైనారిటీ ఓటర్లు ఉన్నప్పటికీ, ఎంఐఎం వ్యతిరేకత వల్ల ఆయన అవకాశాలు తక్కువయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

ఫైనల్ అభ్యర్థిని ఎంపిక చేసేందుకు కాంగ్రెస్ పార్టీ మూడు సర్వేలను నిర్వహించనుంది. ఒకటి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, మరొకటి టీపీసీసీ నిర్వహణలో, మూడవది ఏఐసీసీ పర్యవేక్షణలో జరుగుతుంది. ఈ సర్వేల ఫలితాల ఆధారంగానే అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. జూబ్లీహిల్స్ అధికార కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ సీటు కాకపోయినా, ఈ ఉప ఎన్నిక ఫలితం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఒక పరీక్షగా మారనుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.

ఈ ఉప ఎన్నికకు ప్రాధాన్యతను చాటుతూ కాంగ్రెస్ పార్టీ 6 డివిజన్లకు మూడు మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. హైదరాబాద్ ఇన్‌చార్జ్ పొన్నం ప్రభాకర్, వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక శాఖ మంత్రి వివేక్ వేంకటస్వామి – ఈ ముగ్గురు నేతలు స్థానిక సమస్యలను గుర్తించి, ప్రజల్లో అనుకూల వాతావరణాన్ని సృష్టించేందుకు కృషి చేయనున్నారు. వారితో పాటు 7 మంది కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర నాయకులు కలిసి మద్దతుగా పని చేయనున్నారు.

మొత్తంగా చూస్తే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓ సాధారణ ఎన్నిక కాదని, రేవంత్ రెడ్డి నాయకత్వానికి అసలు పరీక్షగా మారనున్న ఎన్నికగా మారుతోంది. అభ్యర్థి ఎంపిక, స్థానిక సమస్యల పరిష్కారం, మైనారిటీ ఓట్ల ప్రభావం – ఇవన్నీ కలిసివచ్చి ఈ ఎన్నికను రసవత్తరంగా మార్చనున్నాయి.

Tags

Next Story