దేవభూమిలో ప్రకృతి విలయ తాండవం

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తరకాశీ జిల్లాలో ఆగస్టు 5 న మంగళవారం మధ్యాహ్నం సంభవించిన ఆకస్మిక వరదలు ధారాళీ గ్రామాన్ని అతలాకుతలం చేశాయి. క్లౌడ్‌బస్ట్ కారణంగా భారీగా కురిసిన వర్షాల వలన ఖీర్‌గంగా నదీ పరీవాహక ప్రాంతం ఒక్కసారిగా ఉప్పొంగి భారీ బురదలదొరగా మారింది. సునామీలా విరుచుకుపడిన ఈ వరద ధారాళీ గ్రామాన్ని పూర్తిగా మట్టికరిపించింది. ఈ ప్రాంతంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, హోంస్టేలు, మార్కెట్ భవనాలు, చారిత్రక ఆలయాలు ధ్వంసమయ్యాయి. గంగోత్రి మార్గంలో ఉన్న ఈ ముఖ్య విశ్రాంతి కేంద్రం కొన్ని నిమిషాల్లోనే మట్టితో ముంచెత్తిన్ది .
ఈ బీభత్సానికి సమీపంలోని హర్షీల్ ఆర్మీ శిబిరం కూడా తీవ్రంగా దెబ్బతింది. గ్రామానికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ సైనిక శిబిరంలో ఉన్న సైనికులపై వరద ప్రభావం చూపింది. సైనిక వర్గాల సమాచారం ప్రకారం, దాదాపు 10 మందికిపైగా జవాన్లు గల్లంతయ్యారు. శిబిరంలోని హెలిప్యాడ్, ఇతర స్థిర సమీకరణలన్నీ కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.సమీపంలోని భాగీరథి నది తీరంలో వర్షపు నీటి ప్రవాహం తీవ్రమై, కొండలపై నుంచి దిగిన మట్టి, బురదతో కూడిన ఉప్పొంగిన వరద ధారాళీ గ్రామాన్ని పూర్తిగా కప్పేసింది.
ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇప్పటివరకు కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. కాగా, మరికొంత సమాచారాన్ని బట్టి ఇప్పటి వరకు కనీసం 4 మృతదేహాలు మాత్రమే గుర్తించబడ్డాయి. 50 నుంచి 100 మందికిపైగా గల్లంతయ్యారని స్థానిక నివేదికలు తెలియజేస్తున్నాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. చాలా మంది ఇప్పటికీ శిథిలాల్లో చిక్కుకున్న అవకాశముందని రెస్క్యూ బృందాలు భావిస్తున్నాయి.
భారత సైన్యం, NDRF, SDRF, ITBP బృందాలు తక్షణమే రంగంలోకి దిగాయి. మొదటి పది నిమిషాల్లోనే ఆర్మీ 150 మందితో కూడిన బృందాన్ని ఘటన స్థలానికి తరలించింది. డ్రోన్లు, ట్రాకర్ డాగ్స్, భారీ తవ్వే యంత్రాలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు సుమారు 130 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగా, ప్రాథమిక వైద్య సహాయం అందిస్తున్నారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్వయంగా ఘటనా ప్రదేశాన్ని సందర్శించి, సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది.
భారీ వర్షాలు రాష్ట్రాన్ని వణికిస్తున్న నేపథ్యంలో, భారత వాతావరణ శాఖ (IMD) ఉత్తరాఖండ్ రాష్ట్రం కోసం ఆగస్టు 10 వరకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మళ్లీ మరింత వర్షపాతం కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు వెలువడ్డాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో వాతావరణం ఎప్పటికప్పుడు మారే అవకాశం ఉండటంతో, సహాయక చర్యలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ తరహా వరదలకు పర్యావరణ మార్పులు, భూకొలతలు, హిమాలయాల్లో జరుగుతున్న ఆకస్మిక కరుగుదల వంటి కారణాలు ఉన్నాయని పర్యావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బహుళ పర్యాటక అభివృద్ధి, నియంత్రణలేని నిర్మాణాలు కూడా క్లౌడ్‌బస్ట్‌ల తీవ్రతను పెంచుతున్నాయని చెబుతున్నారు. ధారాళీ గ్రామం సముద్రమట్టానికి దాదాపు 2,680 మీటర్ల ఎత్తులో ఉండటంతో, ఇది మరింత ప్రమాదకరంగా మారింది.
‘దేవభూమి’గా పేరుగాంచిన ఉత్తరాఖండ్, ఈసారి ప్రకృతి విలయానికి వేదికైంది. పర్యాటక ప్రాంతంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు తెచ్చుకున్న ధారాళీ... కొన్ని గంటల వ్యవధిలోనే దహనభూమిగా మారింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, ఆధ్యాత్మిక విలువల నష్టం అన్నీ కలగలిపిన ఈ విషాద ఘటన, ప్రకృతితో మనం ఎలా వ్యవహరించాలో మనకు గుర్తుచేస్తోంది.
-
Home
-
Menu