మనసా దేవి ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మృతి

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్‌లో ఉన్న మనసా దేవి ఆలయంలో ఆదివారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఆలయ మెట్ల వద్ద జరిగిన తొక్కిసలాటలో 8 మంది భక్తులు మృతి చెందగా, 34 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది.
ఒక పుకారు వల్ల ఈ తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తుంది. ఓవర్‌హెడ్ విద్యుత్ తీగ తెగి నడక దారిపై పడిందన్న వార్త విస్తరించడంతో భయంతో జనాలు పరుగులు తీశారు. దీంతో గందరగోళం ఏర్పడి తొక్కిసలాట జరిగింది. అయితే విద్యుత్ తీగ కింద పడలేదని, విద్యుత్ షాక్ వల్ల ఎవ్వరూ గాయపడలేదని అధికారులు స్పష్టం చేశారు. అసలు కారణం అధిక రద్దీ మరియు నియంత్రణ లోపం అని భావిస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ బృందాలు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడినవారిని ఆసుపత్రికి తరలించారు. కొందరికి మెరుగైన చికిత్స కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. బాధితుల్లో 20 మంది పురుషులు, 8 మంది మహిళలు, 7 మంది చిన్నారులు ఉన్నారు.
ఈ ఘటన జరిగిన ప్రాంతం చాలా ఇరుకుగా ఉండటంతో, ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడంతో రద్దీ అధికమైంది. శ్రావణ మాసం సందర్భంగా కన్వర్ యాత్ర కోసం వేలాది మంది భక్తులు హరిద్వార్‌కు వచ్చారు. శని, ఆదివారాలు కావడం వల్ల భక్తుల సంఖ్య మరింత పెరిగింది.
గఢ్వాల్ డివిజన్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే, హరిద్వార్ ఎస్పీ ప్రమేంద్ర దోబాల్ సహా అధికారులు స్వయంగా సహాయక చర్యలు పర్యవేక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఈ ఘటనపై స్పందిస్తూ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మనసా దేవి ఆలయ రద్దీని తగ్గించేందుకు రోప్‌వే నిర్మాణం, 10 కిలోమీటర్ల పొడవైన సొరంగం వంటి ప్రాజెక్టులపై ప్రభుత్వ యంత్రాంగం ఆల్రెడీ పనిచేస్తోంది. వీటి వల్ల భక్తులకు భద్రత కలిగే అవకాశం ఉంది.
ఉత్తరాఖండ్ పవర్ కార్పొరేషన్ (UPCL) చెబుతున్నది ప్రకారం, విద్యుత్ తీగలు అన్ని ఇన్సులేట్ అయినవే, ఎక్కడా ఓపెన్ లైన్లు లేవు. కరెంట్ షాక్ కారణంగా కాకుండా, భయం, అప్రమత్తత లోపమే ఈ ప్రమాదానికి కారణమని వారు పేర్కొన్నారు.
-
Home
-
Menu