జగన్ ఇంటికి షర్మిల?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. వైసీపీ అధినేత జగన్ ఇంటికి ఆయన సోదరి, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వెళ్లబోతున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపధ్యంలో ఈ భేటీ జరగబోతుందన్నది హాట్ టాపిక్‌గా మారింది.
దేశవ్యాప్తంగా ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికలు పెద్ద చర్చగా మారాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డిని తమ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయన ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. రాజకీయాలతో సంబంధం లేని వ్యక్తి అయినా, ఆయనకు గెలుపు అవకాశాలు పెరగాలంటే కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.
ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంపీలను ఒప్పించే బాధ్యత రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులకు అప్పగించారు. ఆ దిశగా ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల ముందడుగు వేస్తున్నారు. ఇప్పటికే ఆమె ఒక ప్రకటన చేస్తూ టీడీపీ, జనసేన, వైసీపీ వంటి పార్టీలను సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు.
అంతేకాకుండా షర్మిల ఈ పార్టీల అధినేతలను నేరుగా కలిసేందుకు కూడా షెడ్యూల్ సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. వచ్చే నెల 9న పోలింగ్ జరగనుండటంతో, ఆ వరకు ప్రచారాన్ని వేగవంతం చేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.
దీని భాగంగా షర్మిల తొలుత టీడీపీ అధినేత చంద్రబాబును, ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను కలవనున్నారు. వారికి సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేయనున్నారు.
అయితే అసలైన సంచలనం జగన్‌తో జరగబోయే భేటీ. సోదరుడు అయిన జగన్‌తో ఆమెకు విభేదాలు ఉన్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ పార్టీ అధిష్టానం సూచనల మేరకు షర్మిల ఆయనను కలవబోతున్నారు. వైసీపీ ఎంపీల మద్దతు సుదర్శన్ రెడ్డికి దక్కేలా జగన్‌ను కోరనున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి జగన్ స్పందనపై ఉంది. సోదరి షర్మిల అభ్యర్థనకు ఆయన ఏ విధంగా స్పందిస్తారనేది పెద్ద ప్రశ్నగా మారింది.
-
Home
-
Menu