ఒంగోలు రూరల్ పీఎస్ కు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ

ఒంగోలు రూరల్ పీఎస్ కు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ
X
సీఎం చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటో మార్ఫింగ్ కేసు విచారణలో దర్శకుడి మొబైల్ స్వాధీనం – రూ.2 కోట్ల ఆర్థిక లావాదేవీలపై ప్రశ్నలు

ప్రకాశం జిల్లా ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్‌లో దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి విచారణకు హాజరయ్యారు. గత సంవత్సరం నవంబర్‌లో మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. ఆ కేసులో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఫోటోలు ఆయన ‘వ్యూహం’ సినిమా ప్రచారం సమయంలో పోస్ట్ చేసినవని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో వర్మకు హైకోర్టు నుంచి బెయిల్‌ లభించింది. అయితే బెయిల్ షరతుల ప్రకారం, పోలీసుల విచారణకు తప్పనిసరిగా హాజరుకావాలి. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన మొదటి విచారణలో వర్మను ఐదు గంటలకు పైగా ప్రశ్నించారు. ఆ సమయంలో ఆయనతో పాటు న్యాయవాది కూడా హాజరయ్యారు. ఫోటోలు తన ఎక్స్ ఖాతా (ట్విట్టర్) నుంచి పోస్టు చేశానని ఆయన అంగీకరించారు.

ఆగస్టు 12, 2025 ఉదయం 11 గంటలకు వర్మ మళ్లీ ఒంగోలు రూరల్ పీఎస్‌కి వచ్చి విచారణకు హాజరయ్యారు. సీఐ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఆయన సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, ఆయనకు సుమారు రూ.2 కోట్లు ఫైబర్‌ నెట్ ద్వారా అందినట్లు ఉన్న ఆర్థిక లావాదేవీలపై కూడా పోలీసులు ప్రశ్నలు అడిగారు.

Tags

Next Story