పులివెందుల, ఒంటిమిట్ట ఉప ఎన్నికలు రద్దు చేయాలి

మాజీ ముఖ్యమంత్రి, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ, పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు పూర్తిగా అక్రమాలు, దౌర్జన్యాలతో నిండిపోయాయని ఆరోపించారు. పోలింగ్ కేంద్రాల్లో వైయస్సార్‌సీపీ ఏజెంట్లను అనుమతించకపోవడం, పోలీసుల సహకారంతో రిగ్గింగ్ చేయడం ప్రజాస్వామ్యంపై పెద్ద దెబ్బ అని ఆయన అన్నారు. వెంటనే ఈ ఎన్నికలను రద్దు చేసి, కేంద్ర బలగాల పర్యవేక్షణలో మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జగన్ మాట్లాడుతూ, పోలింగ్‌లో ఏజెంట్లు దొంగ ఓట్లు ఆపడం, ఓటర్ల జాబితాను పరిశీలించడం వంటి బాధ్యతలు వహిస్తారని చెప్పారు. కానీ ఈసారి టీడీపీ, పోలీసులు కలిసి ఏజెంట్ల ఫారమ్‌లను చించి, బూత్‌లకు రావనివ్వలేదని ఆయన ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య చరిత్రలో చూడని దౌర్జన్యం అని అన్నారు.పులివెందులలో ఆరు పంచాయతీల్లో 15 పోలింగ్ కేంద్రాల వద్ద 700 మంది పోలీసులు, దాదాపు 8 వేల టీడీపీ కార్యకర్తలు ఉన్నారని జగన్ తెలిపారు. ఇలా ఒక్కో ఓటరుకు ఒక రౌడీని కేటాయించినట్లు పరిస్థితి ఉందన్నారు. ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన వారు దొంగ ఓట్లు వేసిన ఆధారాలు కూడా మీడియాకు చూపించారు.
టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాలను పంచుకొని అక్కడే మకాం వేసి దౌర్జన్యాలు చేశారని జగన్ ఆరోపించారు. వైయస్సార్‌సీపీ ఏజెంట్లపై దాడులు చేసి, ఓటర్ స్లిప్‌లు లాక్కుని దొంగ ఓట్లు వేశారని చెప్పారు. మహిళలను కూడా బెదిరించారని, పోలీసులే దీనికి సహకరించారని అన్నారు.డీఐజీ కోయ ప్రవీణ్ ఆధ్వర్యంలో హ్యాండ్‌పిక్డ్ అధికారులను పెట్టి, ఎన్నికల నిర్వహణ పేరుతో అక్రమాలు జరిగాయని జగన్ ఆరోపించారు. పోలింగ్ సజావుగా సాగకుండా, బహిరంగంగా పక్షపాతంగా ప్రవర్తించారని ఆయన విమర్శించారు.
మీరు నిజంగా మంచి పాలన చేశారని నమ్మితే, కేంద్ర బలగాల పర్యవేక్షణలో మళ్లీ ఎన్నికలు జరపండి. వెబ్‌కాస్టింగ్, సీసీ ఫుటేజ్ బయటపెట్టండి అని జగన్ సవాల్ విసిరారు. లేదంటే ప్రజలు మీకే తీర్పు చెబుతారని హెచ్చరించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తిగా మూగబోయిందని, ప్రజాస్వామ్యాన్ని రక్షించే బాధ్యతను నిర్వర్తించడం లేదని జగన్ విమర్శించారు. కోర్టులో కేసులు వేసి న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల అక్రమాలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని, చంద్రబాబుతో హాట్‌లైన్ టచ్‌లో ఉన్నారని జగన్ ఆరోపించారు.గ్రామాల్లో మీరు పెంచుతున్న కక్షలు, రేపు మీకే ఎదురవుతాయి. ఇవి మీ ఆఖరి ఎన్నికలు కావచ్చు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి అని జగన్ హెచ్చరించారు.
-
Home
-
Menu