పులివెందులలో రాజకీయ ఉద్రిక్తత

పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రాంతీయ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. తాజాగా, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరోసారి చర్చకు వస్తోంది. ఈ కేసులో విచారణ ముగిసిందని సీబీఐ ఇటీవల సుప్రీంకోర్టుకు నివేదించిన సంగతి తెలిసిందే. అయితే, నిందితుల బెయిల్ రద్దుపై దాఖలు చేసిన పిటిషన్ ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది.
ఈ తరుణంలో, మాజీ ఎంపీ వివేకా కుమార్తె సునీత రెడ్డి, కడప జిల్లా ఎస్పీ అశోక్ కుమార్‌ను కలిసారు. ఆమె ఈ సందర్భంగా కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు. నాన్నను ఆదినారాయణ రెడ్డి, సతీష్ రెడ్డి, బీటెక్ రవి చంపినట్లు ఒక లేఖపై సంతకం చేయమని అప్పట్లో నాపై ఒత్తిడి చేశారు. కానీ నేను సంతకం చేయలేదు అని సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు.
అలాగే, ఉప ఎన్నికల సందర్భంగా పులివెందులలో రెండు రోజులుగా చోటు చేసుకుంటున్న ఘటనలు తమ కుటుంబంపై కుట్రలో భాగమేనని ఆమె ఆరోపించారు. ఈ ఘటనలు చూస్తుంటే, నాన్న హత్య జరిగిన రోజులే గుర్తుకు వస్తున్నాయి అని, ఆయనను గొడ్డలితో చంపి, దాన్ని గుండెపోటుగా మలిచిన తీరుని ఇప్పటికి మరచిపోలేకపోతున్నాము అని, హత్యకు సంబంధించిన క్రైమ్ సీన్‌ను తుడిచి వేసిన సంఘటనలను ఆమె గుర్తు చేసారు.
సునీత రెడ్డి తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ, గత ఆరు ఏళ్లుగా ఈ కేసుతో పోరాడుతున్నాను, కానీ ఇప్పటికీ నిందితులకు శిక్ష పడలేదు. నా పై, నా భర్తపై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారు. నిజమైన నేరస్థులకు శిక్ష పడాలి అని డిమాండ్ చేసారు.
ఈ సందర్భంగా ఆమె కుటుంబసభ్యుడైన సురేష్‌పై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేశారన్న అనుమానాన్ని కూడా వ్యక్తం చేశారు. ఇప్పుడు పులివెందులలో జరుగుతున్న ఘటనలు చూస్తే, రాజకీయంగా బెదిరింపులు తిరిగి ప్రారంభమైనట్టు అనిపిస్తోంది అని సునీతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేసారు.
-
Home
-
Menu