ఫోన్ ట్యాపింగ్ కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్‌కు నోటీసులు

తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం క్లైమాక్స్‌కు చేరుకుంటోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలపై విచారణ జరుపుతున్న ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) తాజాగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కు నోటీసులు జారీ చేసింది.
ఈ నెల 24న ఉదయం 11 గంటలకు ఆయన విచారణకు హాజరుకావాలని సిట్ అధికారులు ఆదేశించారు. అయితే కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న నేపథ్యంలో, బండి సంజయ్ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేయడానికి పోలీసు బృందం హైదరాబాద్‌లోని దిల్‌కుష్ ప్రభుత్వ అతిథి గృహంలో విచారణ చేపట్టనున్నది.
బండి సంజయ్‌తో పాటు, ఆయన పీఆర్వో పసునూరు మధు, పీఏ బోయినిపల్లి ప్రవీణ్ రావు, మాజీ పీఏ పోగుల తిరుపతిలకు కూడా నోటీసులు అందాయి. ఈ నాలుగురి స్టేట్‌మెంట్లను అదే రోజున రికార్డు చేయనున్నట్టు సమాచారం.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని బహిర్గతం చేసిన మొదటి నాయకుడు బండి సంజయ్. అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ, ప్రజా వ్యతిరేక విధానాలను ఎత్తి చూపుతూ అనేక ఉద్యమాలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆయనను అడ్డుకునేందుకు, ఆయనపై నిఘా పెట్టేందుకునే ట్యాపింగ్‌కు పాల్పడ్డారని ఆయన ఆరోపించారు.
2022లోనే తనతో పాటు కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బంది ఫోన్లను ట్యాప్ చేస్తున్నారన్న ఆరోపణలు బండి సంజయ్ మోపారు.ప్రతిపక్ష నేతలు, సినీ తారలు, జడ్జీలు, కొందరు బీఆర్ఎస్ నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు.
బండి సంజయ్ ఆరోపణల ప్రకారం, ట్యాపింగ్ ద్వారా పొందిన సమాచారంతోనే తనపై "టెన్త్ పేపర్ లీక్" అనే తప్పుడు కేసు మోదీ చేశారని పేర్కొన్నారు. అప్పట్లో అర్ధరాత్రి సమయంలో తన నివాసంపై పోలీస్ దాడి జరిపి, ఆయనను అరెస్టు చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
"భార్యాభర్తల మధ్య సంభాషణలను ట్యాప్ చేసి జీవితాల్లో చిచ్చు పెట్టారు" అంటూ కేసీఆర్, కేటీఆర్‌లపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిట్ ఈ అంశంపై లోతుగా దర్యాప్తు జరుపుతూ బండి సంజయ్ ఆరోపణల్లో నిజం ఉందని ధృవీకరిస్తోంది.
బీజేపీ నేతగా, ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ 24న సిట్ విచారణకు హాజరుకానున్నారు. ఆయన వద్ద ఉన్న సమాచారం, ఆధారాలను సిట్ ఎదుట వుంచాలని నిర్ణయించినట్టు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఏయే పెద్ద పేర్లు బయటపడతాయన్న ఉత్కంఠ నెలకొంది.
-
Home
-
Menu