విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల సమస్యపై లోక్‌సభలో ఎంపీ ప్రశ్నలు

ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్లు ఎదుర్కొంటున్న ఇంటర్న్‌షిప్ సమస్యలపై తిరుపతి ఎంపి మద్దిల గురుమూర్తి లోక్‌సభలో ప్రశ్నించారు. ఇదే విషయంపై గతంలో కేంద్రానికి లేఖ రాసిన ఆయన, శుక్రవారం మరోసారి పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.
ఎంపి గురుమూర్తి అడిగిన ప్రశ్నలలో — ఆంధ్రప్రదేశ్‌లో మూడేళ్ల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి అని ఉన్న నిబంధన కేంద్ర ప్రభుత్వానికి తెలిసిందా? ఇది ఇతర రాష్ట్రాలో ఇంటర్న్‌షిప్ వ్యవధి, స్టైపెండ్‌కు భిన్నంగా ఉందా? ఈ వ్యత్యాసానికి కారణాలేమిటి? జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన నిబంధనలు ఉండేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలేవిటి? రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకుంటుందా? చేస్తే దాని వివరాలేమిటి? అన్న అంశాలు ఉన్నాయి.
ఈ ప్రశ్నకు కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియా పటేల్ సమాధానం ఇచ్చారు. ఆమె తెలిపిన ప్రకారం, విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు భారతదేశంలో వైద్యం చేసే హక్కు కలిగేందుకు నేషనల్ మెడికల్ కమిషన్ 2021 నిబంధనలు వర్తిస్తాయి. ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా సమానంగా అమలవుతాయి. కంపల్సరీ రొటేటింగ్ మెడికల్ ఇంటర్న్‌షిప్ నిర్వహణ కూడా ఈ నిబంధనల ప్రకారమే జరుగుతుందని చెప్పారు.
కోవిడ్ మహమ్మారి, యుద్ధాలు వంటి పరిస్థితుల వల్ల వచ్చిన విద్యా అంతరాలను దృష్టిలో ఉంచుకుని, 2023 డిసెంబర్ 7 మరియు 2024 జూన్ 19 తేదీలలో నేషనల్ మెడికల్ కమిషన్ కొన్ని మార్గదర్శకాలను జారీ చేసిందని మంత్రి తెలియజేశారు. వాటిలో ముఖ్యంగా మూడు వర్గాల విద్యార్థుల కోసం వివిధ నిబంధనలు ఉన్నాయి అని తెలియచేసారు.
ఆన్‌లైన్ ద్వారా కోర్సు పూర్తి చేసిన వారు ఒక సంవత్సరం క్లినికల్ క్లర్క్‌షిప్ చేసి, ఆ తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేయాలి,వీరు రెండు సంవత్సరాలు క్లినికల్ క్లర్క్‌షిప్ చేసి, ఆ తర్వాత ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ చేయాలి అని మరియు సరిపడా ప్రాక్టికల్ శిక్షణ పొంది ఉత్తీర్ణత పొందినవారు ఒక సంవత్సరం ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన తర్వాత పర్మనెంట్ రిజిస్ట్రేషన్‌కు అర్హులు అవుతారు అని కేంద్ర మంత్రి వివరించారు.ఈ నిబంధనలు దేశవ్యాప్తంగా సమానంగా ఉండేలా రూపొందించబడ్డాయని, రాష్ట్ర ప్రభుత్వాలు వీటిని మార్చలేవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఈ అంశంపై ఎంపి గురుమూర్తి తన ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో విదేశీ వైద్య గ్రాడ్యుయేట్లకు మూడేళ్ల ఇంటర్న్‌షిప్ తప్పనిసరి చేయడాన్ని తప్పుబట్టారు. ఇది ఇతర రాష్ట్రాల సరసన వెళ్తే అసమానతగా ఉందని పేర్కొన్నారు. ఈ విధానంతో విద్యార్థులు ఆర్థికంగా, వృత్తి పరంగా నష్టపోతున్నారని చెప్పారు.
ఇటీవల జరిగిన విదేశీ మెడికల్ గ్రాడ్యుయేట్ల నిరసనలో హింసాత్మక ఘటనల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని, జాతీయ వైద్య కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకే విధమైన నిబంధనలు అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
-
Home
-
Menu