TCSలో భారీ ఉద్యోగాల తగ్గింపు – 12,200 మందికి షాక్

భారతదేశంలో అతిపెద్ద ఐటీ సంస్థలలో ఒకటైన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తాజాగా భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించే నిర్ణయం తీసుకుంది. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన మొత్తం ఉద్యోగులలో సుమారుగా 2 శాతం మందిని తొలగించనుంది. ఈ నిర్ణయంతో దాదాపు 12,200 మంది ఉద్యోగులు ప్రభావితమయ్యే అవకాశం ఉంది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యంత పెద్ద లే ఆఫ్ అని పరిగణిస్తున్నారు.
ఈ తొలగింపులు ప్రధానంగా సీనియర్ మరియు మిడిల్ లెవెల్ ఉద్యోగులపై ప్రభావం చూపనున్నాయి. చాలా మంది మేనేజ్మెంట్ స్థాయిలో ఉన్నవారు ఈ వడపోతకు గురవుతారని కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఇప్పటికే ఈ ఉద్యోగాలపై రీ-ట్రైనింగ్, రీ-డిప్లాయ్‌మెంట్ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, అన్ని పోస్టులకు తిరిగి నియామకం సాధ్యం కాలేదని పేర్కొంది.
TCS ఈ ఉద్యోగాల తగ్గింపులు తమ వ్యూహాత్మక రీ-స్ట్రక్చరింగ్ లో భాగమని తెలిపింది. కొత్త మార్కెట్లలోకి విస్తరించడమే కాకుండా, అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీలను స్వీకరించడం, ఆపరేషన్స్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగాన్ని పెంచడం వంటి అంశాల కారణంగా సంస్థలో మార్పులు తీసుకువస్తున్నట్టు వెల్లడించింది. కంపెనీ క్లయింట్లకు అందించే సేవలపై ఎలాంటి ప్రభావం పడకుండా ఈ మార్పులు జరుగుతాయని స్పష్టం చేసింది.
ఈ నెల ప్రారంభంలో టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కే. కృతివాసన్ మాట్లాడుతూ, ప్రాజెక్ట్ ఆమోదాలు ఆలస్యమవుతుండడం, క్లయింట్లు నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం జరగడం వలన కంపెనీ వృద్ధి ప్రణాళికలు ప్రభావితమవుతున్నాయని తెలిపారు. దీంతో సంస్థ వ్యూహాత్మకంగా తన కార్యకలాపాలను సమీక్షించి, ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తోంది అని తెలిపారు.
ఈ ఉద్యోగాల తగ్గింపు వార్త వెలువడిన వెంటనే టీసీఎస్ షేరు ధరలు దాదాపు 1.6 శాతం పడిపోయాయి. తద్వారా ఐటీ రంగంలో ఇతర ప్రముఖ కంపెనీలు అయిన ఇన్ఫోసిస్, విప్రో వంటి కంపెనీల షేర్లు కూడా 2-3 శాతం మేర కోల్పోయాయి. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ కూడా 1.6 శాతం వరకు పడిపోయినట్లు నివేదికలు వెల్లడించాయి.
ఉద్యోగుల సంఘాలు టీసీఎస్ తీసుకున్న ఈ నిర్ణయంపై తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్యోగులపై ఒత్తిడి పెంచి తద్వారా వారిచేతే స్వయంగా రాజీనామా చేయాలన్న విధంగా ప్రభావితం చేయవద్దని, వారి హక్కులను పరిరక్షించాల్సిన అవసరం ఉందని సంఘాలు పేర్కొన్నాయి.
ఇది కేవలం ఉద్యోగుల తొలగింపుగా కాకుండా, మొత్తం భారత ఐటీ రంగానికి ఒక హెచ్చరికగా నిలుస్తోంది. టీసీఎస్ వంటి అగ్ర స్థాయిలో ఉన్న సంస్థ ఈ స్థాయిలో ఉద్యోగాలను తగ్గించడం అనేక కుటుంబాల జీవనంపై, భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అయితే సంస్థ వైపు నుంచి ఈ మార్పులు బలమైన వ్యూహాత్మక మార్పుల భాగమని చెబుతున్నప్పటికీ... వాస్తవానికి సంస్థ చెబుతున్న ప్రకారం నిజానికి ఇది టెక్నాలజీ ఆధారంగా పనులను మెరుగుపర్చే దిశగా చేసిన ఒక కఠిన నిర్ణయం. ఇది సంస్థకు, ఉద్యోగులకు ఒక పరీక్షల సమయం లాంటిదే.
-
Home
-
Menu