మాంచెస్టర్ టెస్ట్ డ్రా - రాణించిన జడేజా, సుందర్

మాంచెస్టర్ టెస్ట్ డ్రా - రాణించిన జడేజా, సుందర్
X
0 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన భారత్ - 56 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన జంట

ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్‌లో జరిగిన నాల్గవ టెస్టు మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ముగిసి, చివరికి డ్రాగా తేలింది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 669 పరుగుల రికార్డ్ స్థాయి భారీ స్కోరు చేసి భారత్ ముందు ఉంచింది. జో రూట్ 150, కెప్టెన్ బెన్ స్టోక్స్ 141 పరుగులు చేసి మెరిశారు. భారత జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 358 పరుగులకే ఆలౌట్ అయింది.

రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఆరంభమే సడేలింది. యశస్వి జైస్వాల్, సాయి సుదర్శన్ డకౌట్ కావడంతో భారత జట్టు స్కోరు బోర్డుపై ఏ స్కోరు లేకుండానే రెండు వికెట్లు కోల్పోయింది. అయితే కెఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్ అద్భుతంగా పోరాడారు. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యం అందించారు.

కెఎల్ రాహుల్ 90 పరుగులు చేసి బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో అవుట్ కాగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 103 పరుగులు చేసి జోఫ్రా ఆర్చర్ బౌలింగ్‌లో అవుటయ్యాడు. లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 222 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అప్పటికి భారత్ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే ఇంకా రెండు సెషన్ల పాటు బ్యాటింగ్ చేయాల్సి ఉంది.

ఇప్పటికే రిషబ్ పంత్ గాయంతో బరిలోకి రాకపోవడంతో భారత్‌పై ఒత్తిడి పెరిగింది. అయితే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ జాగ్రత్తగా, నిలకడగా ఆడి ఇంగ్లాండ్ బౌలర్లను ఎదుర్కొన్నారు . వీరిద్దరూ కలిసి 56 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలకడగా ఆడి భారత్ ను ఓటమి భారీ నుంచి తప్పించారు.

జడేజా 5వ టెస్టు సెంచరీ నమోదు చేయగా, వాషింగ్టన్ సుందర్ తన టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ సాధించాడు. వీరిద్దరూ సెంచరీల దగ్గరే ఉన్న సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ డ్రా ప్రతిపాదించాడు. కానీ జడేజా సెంచరీ చేసేవరకు డ్రా అంగీకరించలేదు. చివరికి హ్యారీ బ్రూక్, జో రూట్ లాంటి పార్ట్ టైమ్ బౌలర్లను తెచ్చి, ఇంగ్లాండ్ డ్రాకి సై అన్నట్టయింది.

ఇది పక్కా డ్రాగా మారడంతో ఇంగ్లాండ్ ప్రయత్నాలు విఫలమయ్యాయి. భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి 425 పరుగులు చేసింది. మొత్తం మీద 143 ఓవర్లు బ్యాటింగ్ చేయడం విశేషం.

ఈ టెస్టులో 6 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ చేసిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.ఐదు టెస్ట్ సిరీస్ ల భాగంగా 2 - 1 తేడాతో ఇంగ్లాండ్ ఆధిక్యంలో ఉంది, సిరీస్ చివరి టెస్టు జూలై 31 నుంచి కెన్నింగ్టన్ ఓవల్‌లో జరగనుంది.ఈ టెస్ట్ లో భారత్ జట్టు నిలకడగా రాణించి విజయం సాధిస్తేనే సిరీస్ సమం అవుతుంది.

Tags

Next Story