ఏపీలో అనధికారిక లేఅవుట్లకు చట్టబద్ధత

ఏపీలో అనధికారిక లేఅవుట్లకు చట్టబద్ధత
X
సీఆర్డీఏ మినహా మిగిలిన అన్ని పురపాలక సంస్థలకు ఎల్ఆర్ఎస్ వర్తింపు

2014 నుంచి 2019 మధ్యకాలంలో ప్రభుత్వం లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్), బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీం (బీపీఎస్) అనే పథకాలు అమలు చేసింది. వాటి ద్వారా అనధికారికంగా ఉన్న లే అవుట్లు, ఇళ్లు, క్రమబద్ధంగా చట్టబద్ధం అయ్యే అవకాశం ఇచ్చారు. అప్పట్లో దాఖలైన దరఖాస్తుల్లో సుమారుగా 65 శాతం దాకా సమస్యలు పరిష్కరించబడ్డాయి.

ఈ పథకాలకు గడువు ముగిసిన తర్వాత ప్రభుత్వం వాటిని కొనసాగించలేదు. దాంతో, ఆ తర్వాత కాలంలో రాష్ట్రవ్యాప్తంగా అనధికారికంగా, ప్రభుత్వ అనుమతి లేకుండానే అనేక లే అవుట్లు అభివృద్ధి చేయబడ్డాయి. అధికారులు అంచనా ప్రకారం, ఇలాంటి అక్రమ లే అవుట్లు 20 వేలకుపైగా ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ అనధికారిక లే అవుట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాలు గుంటూరు, కడప, చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, ప్రకాశం, తూర్పు గోదావరి, అనకాపల్లి జిల్లాలు అని అధికారులు చెబుతున్నారు. ఇక్కడ చాలామంది ప్రభుత్వం అనుమతి లేకుండానే లేఅవుట్లు డెవలప్ చేసి, ప్రజలకు ప్లాట్లు అమ్ముతున్నట్టు గుర్తించారు.

ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్లాట్లు కొనుగోలు చేసిన వారు, తమ స్థలాన్ని చట్టబద్ధంగా మార్చుకోవాలంటే ఎల్ఆర్ఎస్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో విద్యుత్, నీరు, రోడ్లు వంటి మౌలిక వసతులు పొందటానికి సులభంగా మారనుంది. అలాగే ప్లాట్ల విలువ కూడా పెరుగుతుంది అని అధికారులు తెలియచేసారు.

ఇప్పుడు రాష్ట్రంలో అనుమతులు లేకుండా వేసిన లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ఏపీ ప్రభుత్చం అవకాశం కల్పిస్తోంది. LRS కోసం తాజాగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)కు మాత్రం మినహాయింపు ఇచ్చారు. సీఆర్డీఏ మినహా రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంస్థలలో అనుమతులు లేని లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.

ఎల్‌ఆర్ఎస్ మార్గదర్శకాలు ప్రకారం 2025 జూన్‌ 30కి ముందు వేసిన లేఔట్లను ఈ పథకం వర్తిస్తుంది. దీని ద్వారా రాష్ట్రంలోని సుమారు 18000 ఎకరాల్లో వేసిన అనధికారిక లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునే వీలుందని లెక్కలు చెప్తున్నాయి. ఎల్ఆర్ఎస్ స్కీమ్ కోసం ఆగస్ట్ ఒకటో తేదీ నుంచి అందుబాటులోకి తేనున్నారు. అలాగే 2014-19 సమయంలో నిర్దేశించిన బేసిక్ ధరలనే ఇప్పుడు కూడా ఎల్ఆర్ఎస్ కోసం అవే ధరలను అమలు చేస్తునట్టు తెలుస్తుంది. అయితే ఎల్ఆర్ఎస్‌లో నిర్ణయించిన ధరను, స్థానిక సబ్ రిజిస్ట్రార్ ధరలతో పోల్చి, ఏది తక్కువగా ఉంటే దానిని వసూలు చేస్తారు. మరోవైపు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్ కోసం 90 రోజులు గడువు విధించారు, అలాగే పదిశాతం ఓపెన్ స్పేస్ లేకపోతే 14 శాతం అదనపు ఛార్జీలు విధించనున్నారు.

ఇలాంటి సమస్యలు ఎదురవకుండా ఉండాలంటే భవిష్యత్తులో లేఅవుట్ల అభివృద్ధిని కచ్చితంగా నియంత్రించాలి. ప్రభుత్వ అనుమతులతోనే ప్లాట్ల విక్రయం జరగాలి. ఇకపోతే, అనధికారికంగా ప్లాట్లు కొన్న వారు ఎల్ఆర్ఎస్ ద్వారా సమస్య పరిష్కారం పొందాలన్నది అధికారుల సూచన.

Tags

Next Story