ఫామ్‌హౌస్‌కి కవిత పయనం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ రోజు తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. ఆమె కుమారుడు అమెరికాలో ఉన్నత చదువుల కోసం వెళ్తున్న సందర్భంలో కవిత కూడా కుమారుడితో పాటు అమెరికా బయలుదేరుతున్నారు.కుమారుడికి ఆశీర్వాదం తీసుకునేందుకు కుటుంబ సమేతంగా ఫామ్‌హౌస్ వెళ్లిన కవితను, అక్కడ ఉన్న బీఆర్ఎస్ సభ్యులు గుమ్మడికాయతో దిష్టి తీసి ఆత్మీయంగా ఆహ్వానించారు.
ఇదివరకూ కూడా కవిత అమెరికా నుంచి తిరిగి వచ్చిన తర్వాత, కేసీఆర్‌పై, బీఆర్ఎస్ పార్టీ విధానాలపై విమర్శలు చేశారు. కేసీఆర్ చుట్టూ “కొన్ని దెయ్యాలు తిరుగుతున్నాయి” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్‌ను బీజేపీలో విలీనం చేయాలన్న ఆలోచనని బయటపెట్టి, తండ్రిని ఇబ్బందికర పరిస్థితిలోకి నెట్టారు.ఆ విమర్శల తరువాత కేసీఆర్ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పటి నుంచి ఆయనతో పాటు కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు కూడా ఆమెకు దూరంగా ఉన్నారు. దాంతో కవిత తెలంగాణ జాగృతిని మళ్లీ యాక్టివ్ చేసి, ఆ సంస్థ కండువా కప్పుకొని రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
ఈ సారి ఆమె కుమారుడి కోసం ఆశీర్వాదం తీసుకునేందుకు వచ్చినా, తండ్రితో మళ్లీ సఖ్యత సాధించాలనే ప్రయత్నంగా కూడా దీనిని చూడవచ్చు. ఈసారి కేసీఆర్ కూతురిపై కరుణ చూపిస్తారా? చూపిస్తే, తండ్రి చుట్టూ ఉన్న వారితో ఆమె కలిసిపోతారా? లేకపోతే, వారి మధ్య ఉన్న విభేధాలు ఇంకా తీవ్రమవుతాయా? అన్నది రాన్నున్న రోజుల్లో చూడాలి.
-
Home
-
Menu