కవిత తిరిగి గులాబీ గూటికేనా?

కవిత తిరిగి గులాబీ గూటికేనా?
X
తాజా వ్యాఖ్యలతో బీఆర్‌ఎస్‌కి చేరువ అవుతున్న సంకేతాలు - సోషల్ మీడియా పోస్ట్‌తో ఊహాగానాలకు మరింత ఊపు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాజకీయ ప్రయాణం గతి తప్పిందా? గులాబీ కారు నుంచి జాగృతి కార్యాలయం వైపు అడుగులు వేసిన కవిత, ఇప్పుడు తిరిగి సొంత గూటికి – అంటే బీఆర్‌ఎస్‌కి – చేరతారా అనే చర్చ తెలంగాణ రాజకీయాల్లో మొదలైంది. ఇటీవల ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది.

కవిత తండ్రి కేసీఆర్‌కు రాసిన లేఖతోనే ఈ వివాదం మొదలైంది. ఆ లేఖతో బీఆర్‌ఎస్‌లో మొదలైన అంతర్గత గొడవలు చివరికి మీడియా వరకు చేరాయి. కేసీఆర్‌ లాంటి దేవుడి చుట్టూ దెయ్యాలున్నారు, నన్ను ఆయన దగ్గర నుండి దూరం చేయాలని చూస్తున్నారు. కేసీఆర్‌ తప్ప మరెవరినీ నా నాయకుడిగా అంగీకరించను అని కవిత చేసిన వ్యాఖ్యలు, ఆమెకు పార్టీతో ఏర్పడిన దూరాన్ని స్పష్టంగా చూపించాయి.

తీన్మార్‌ మల్లన్న కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్‌ గానీ, కేసీఆర్‌ కుటుంబం గానీ స్పందించకపోవడం, ఆ వ్యాఖ్యల వెనుక పార్టీ పెద్దలే ఉన్నారని కవిత ఆరోపించడం, బీజేపీలో బీఆర్‌ఎస్‌ విలీనం గురించి తరచూ మాట్లాడడం, రాఖీ పండుగనాడు కేటీఆర్‌కు రాఖీ కట్టకపోవడం వంటి పరిణామాలు కవితను పార్టీకి మరింత దూరం చేశాయి.

ఇదే సమయంలో, గులాబీ జెండాకు బదులుగా జాగృతి కండువాతో రాజకీయాలు చేయడం, జాగృతిని బీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయంగా పెంచే ప్రయత్నాలు చేయడం చూసి, కవిత కూడా షర్మిల మాదిరిగా స్వంత పార్టీకి సిద్ధమవుతున్నారా అనే ప్రశ్నలు వినిపించాయి.అయితే, తాజాగా కవిత చేసిన వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌తో గ్యాప్‌ తగ్గించాలనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి. ఏ పార్టీ అయినా నాయకుల మధ్య అభిప్రాయ భేదాలు సహజమే అని, కాంగ్రెస్‌లో రేవంత్‌–రాజగోపాల్‌ వివాదం, బీజేపీలో బండి సంజయ్‌–ఈటెల మధ్య పోరును ఉదాహరణగా చెప్పారు. తానూ ఎప్పటికీ గులాబీ మొక్కేనని పరోక్షంగా తెలిపారు.

ఇక కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ,రేవంత్ సర్కార్‌ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక గాంధీ భవన్‌కు పంపిస్తాం అని ట్వీట్ చేశారు. రాష్ట్ర అస్తిత్వ చిహ్నమైన బతుకమ్మను వేరుచేసి, కాంగ్రెస్ తల్లిని బలవంతంగా రుద్దే ప్రయత్నం తప్పు అని పేర్కొన్నారు.

ఇంతకాలం బీఆర్‌ఎస్‌ పేరు కూడా పలకని కవిత, ఇప్పుడు “బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం” అని సంబోధించడం, ఆమె తిరిగి పార్టీకి చేరతారనే ఊహాగానాలను పెంచింది. అయితే, ఈ నిర్ణయానికి కేసీఆర్‌–కేటీఆర్‌లు సమ్మతిస్తారా? ముఖ్యంగా, కవిత చేసిన “నేను సీఎం అవుతా” అనే వ్యాఖ్యలు, వెనుక నడిచే సీఎం నినాదాల రాజకీయాలు, కేటీఆర్‌–కవిత మధ్య భవిష్యత్తులో విభేదాలకు కారణం కావచ్చన్న అనుమానం మిగిలే ఉంది.

Tags

Next Story