రాష్ట్ర ఆక్వాకల్చర్‌కు అంతర్జాతీయ ప్రమాణాలు

రాష్ట్ర ఆక్వాకల్చర్‌కు అంతర్జాతీయ ప్రమాణాలు
X
చేపలకు చికెన్‌ వ్యర్థాలు ఆహారంగా ఇవ్వడం హానికరం,ఉల్లంఘిస్తే లైసెన్స్‌ రద్దు, క్రిమినల్‌ కేసులు - ప్రాన్‌ ప్రొడ్యూసర్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీ ఏర్పాటు

రాష్ట్రంలోని ఆక్వాకల్చర్‌ (చేపల పెంపకం) రంగాన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసి, ప్రపంచ స్థాయిలో నిలబెట్టేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని వ్యవసాయం, సహకారం, పశుసంవర్ధక, మరియు మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. బుధవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఆక్వాకల్చర్‌ అభివృద్ధి సంస్థ (APSADA) ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని మత్స్య సంపద, ఉత్పత్తి నాణ్యత, ఎగుమతి అవకాశాలు, రైతుల ఆదాయం పెంపుపై అధికారులు సమగ్రంగా చర్చించారు.

రైతులు ఇకపై APSADA చట్టం కింద తమ చేపల చెరువులను ఆన్లైన్లో సులభంగా నమోదు చేసుకోవచ్చని మంత్రి తెలిపారు. ఈ విధానం వల్ల లైసెన్స్‌ త్వరగా లభిస్తుంది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందాలంటే ప్రతి ఆక్వాకల్చర్‌ రైతు తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. ఈ రిజిస్ట్రేషన్‌ ద్వారా చేపల ఉత్పత్తుల నాణ్యత, ట్రేసబిలిటీ మెరుగవుతుందని చెప్పారు. డి-పట్టా, అసైన్‌, CJFS భూములపై చేపల పెంపకం చేసే రైతులకు సాగు ధ్రువీకరణ పత్రాలు జారీ చేస్తారు.

కొన్ని ప్రాంతాల్లో చికెన్‌ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వాడుతున్నారని గుర్తించామని మంత్రి అన్నారు. ఇది ప్రజారోగ్యానికి హానికరమని, నీటి కాలుష్యానికి కారణమవుతుందని పేర్కొన్నారు. ఈ విధానాన్ని వెంటనే ఆపాలని ఆదేశించారు. ఉల్లంఘిస్తే లైసెన్స్‌ రద్దుతో పాటు క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో మారికల్చర్‌ (సముద్రంలో చేపల పెంపకం) మరియు రిజర్వాయర్‌ కేజ్‌ కల్చర్‌కు కమిటీ ఆమోదం తెలిపింది. కొన్ని తీరప్రాంతాలు, జలాశయాల్లో చేపల పెంపకాన్ని ప్రోత్సహించి, మత్స్యకారులు, మహిళా మత్స్యకారుల ఆదాయం పెంచే ప్రయత్నం చేస్తారు. 4–5 ప్రాంతాల్లో సముద్ర నాచు సాగును ప్రోత్సహించి స్థానిక ప్రజలకు ఉపాధి కల్పించనున్నారు.

2025 ఆగస్టు 27 నుంచి భారతీయ రొయ్యలపై అమెరికా విధించనున్న 50% టారిఫ్‌ల ప్రభావాన్ని తగ్గించేందుకు కొత్త మార్కెట్లను అన్వేషించాలని మంత్రి సూచించారు. MPEDA సహకారంతో దక్షిణ కొరియా, యూరప్‌, యూకే, మిడిల్‌ ఈస్ట్‌, రష్యా, ఆఫ్రికా వంటి మార్కెట్లపై దృష్టి పెట్టాలి అన్నారు. యూకేతో కుదిరిన FTA అవకాశాలను వినియోగించుకోవాలని అన్నారు. ఎగుమతిదారులు విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రాన్‌ ప్రొడ్యూసర్స్‌ కోఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేసి, దేశీయ వినియోగాన్ని పెంచే దిశగా NECC మోడల్‌ తరహాలో పని చేయాలి అని మంత్రి తెలిపారు.ఆక్వా రైతుల‌కు మేలు జ‌రిగేలా అధిక సుంకాల వ్య‌వహ‌రంపై సీఎం చంద్ర‌బాబు నాయుడు కేంద్ర ప్ర‌భుత్వంతో సంప్ర‌దింపులు చేస్తున్నార‌ని తెలిపారు.

Tags

Next Story